(వడ్డేపల్లి మల్లేశము)
ప్రజాస్వామ్య పాలన సఫలం కావడం కోసం రాజ్యాంగంలో ఎన్నోఅధికరణలను ప్రవేశపెట్టినా ఆచరణలో పాలకులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం సర్వత్రా కనబడుతుంది. దీనితో చట్టపాలన (Rule of the Law)అనేది బాగా బలహీనపడుతూ ఉంది. ఇది చాలా విచార కర పరిణామం. అధికార ప్రతిపక్షాల తో కూడుకున్న చట్టసభలు ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసింది పోయి స్వప్రయోజనాలకు పాల్పడడం వలన ప్రజాస్వామ్యం రాజ్యాంగ పాలన విఫలం కావడం, చివరకు అదే చట్టబద్ధం కావడం దారుణం.
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసం ఇటీవల తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన పోరాటంలోనూ, అనంతరం ఒక గొప్ప ప్రయోగం జరిగింది. అదే టిజాక్ (Telangana Joint Action Committee : T-JAC) ప్రాచుర్యంలోకి వచ్చిన ఐక్య కార్యాచరణ కమిటీ. ఈ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) కొంత వ్యవస్థలో ప్రజాస్వామ్యం లోటును భర్తీ చేసే విధంగా ప్రజా చైతన్యానికి పని చేసింది.
కనుక ప్రభుత్వాలకు సమాంతరంగా జేఏసీలు సర్వకాలాల్లో సర్వత్రా అవసరమని తెలంగాణ అనుభవం చెబుతుంది.
ప్రజాస్వామం- చట్టసభలు, ప్రభుత్వాలు
అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యానికి ఒకే నిర్వచనం ఇచ్చుకోవడం మనందరికీ తెలిసిందే. ప్రజల కోసం ప్రజల చేత ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా చేసే పాలన విధానమే ప్రజాస్వామ్యం. ఈ మౌలిక భావన స్వాతంత్య్రానంతర కాలంలో కొంత వరకు ప్రభుత్వాలు పాటించినప్పటికీ, సామ్యవాద భావన దిశ నుండి పెట్టుబడిదారీ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దిశగా ప్రభుత్వాలు దేశాన్ని మళ్లిస్తుండటం మన అనుభవం.
చట్టసభల్లో అధికార ప్రతిపక్షాలు స్పష్టమైన ప్రజా పాలన జరపాల్సింది పోయి స్వప్రయోజనాలకు పాల్పడటంతో పాటు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి కూడా వెనుదీయక పోవడం వలన చట్టసభలు క్రమంగా నీరుగారిపోయాయి. దీనివల్ల ప్రభుత్వాల మీద ప్రజలకు వ్యతిరేక భావన కలుగుతోంది. ఇది రకరకాల రూపాల్లో వ్యక్తమవుతూనే ఉంది.
రాజ్యాంగాన్ని నీరుగార్చిన సందర్భాలు
స్వాతంత్య్రానంతర కాలంలో బ్యాంకుల జాతీయీకరణ రాజభరణాల రద్దు లాంటి అనేక చర్యలు సామ్యవాద భావన దిశగా కొనసాగినప్పటికీ 1975 జూలై లో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టిన అత్యవసర పరిస్థితి భారతదేశాన్ని అపకీర్తి లోకి నెట్టింది.
1991 నుండి క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ వైపుగా కొనసాగించే క్రమంలో నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రపంచీకరణ వైపుగా కొనసాగి నేటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపుగా మరింత వూపుతో మరింత అడుగులు వేస్తున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ పాలన సహజంగా జరగకపోగా ప్రతిపక్షాల పైన దాడులకు పాల్పడడం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ,రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు. ప్రమాదంలోకి నెడుతున్నారు.
ఐక్య కార్యాచరణ కమిటీ ఒక కొత్త అనుభవం
2011 నుండి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వరకు కొనసాగిన రాజకీయ ఐక్య కార్యాచరణ జేఏసీ పేరు మీదే సాగింది. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ భావజాలాన్ని మూలమూలలకు ఇంటింటిటి,ప్రతి హృదయానికి వ్యాప్తి చేయడం ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం అయిందనడంలో అతిశయోక్తి లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి కీ ప్రజా సమస్యల పరిష్కారం పాలకులకు స్థానిక చిత్తశుద్ధి ఉన్నపుడు మాత్రమే సాధ్యమవుతుందని, అలా కాని సందర్భాలలో ప్రభుత్వాలను పని చేయించే దిశగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బుద్ధిజీవులు మేధావులతో కూడినటువంటి ఐక్య కార్యాచరణ కమిటీ లు అవసర మవుతాయి.ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలోని నాటి తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటి రాష్ట్ర సాధన కోసమే కాకుండా ఆ తర్వాత దాదాపుగా 2019 వరకు కొనసాగింది.
అయితే, రాష్ట్రమైతే ఏర్పడింది కానీ మౌలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం గమనము ప్రజాస్వామిక వ్యతిరేక దిశలో ఉన్న విషయాన్ని గమనించిన జేఏసీ మలి దశ ఉద్యమం మొదలు పెట్టింది. బుద్ధిజీవులు, మేధావులను కలుపుకుని విస్తృత స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన , యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యమాలను అణచి వేత నిరసనగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఆలోచింపజేసింది.
విద్యావంతులు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు ,ఉపాధ్యాయులు, న్యాయవాదులు, రైతులు, కార్మికులు, అభ్యుదయ భావజాలం కలిగిన ప్రతి ఒక్కరూ ఈ జేఏసీలో సభ్యులుగా కొనసాగి ప్రజా చైతన్యానికి ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయడం కూడా జరిగింది.
సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆనాటి ధూమ్ ధామ్ కార్యక్రమాల లాగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తూ పునర్నిర్మాణ కార్యక్రమానికి సన్నద్ధం చేసే దిశగా కళాకారులు తమ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
అనేక అంశాలపై నా సదస్సులు సెమినార్లు చర్చలు నిర్వహించి జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలపై న తమ నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకు పోవడంతో ప్రభుత్వం కూడా ఆలోచించి కొంతవరకు పక్కదారి పట్టకుండా కొనసాగడం జరిగింది.
2019లో ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో పార్టీ (తెలంగాణ జన సమితి) ఆవిర్భవించిన తర్వాత దాని గమనం మందకొడిగా సాగుతున్నప్పటికీ దాని చారిత్రక అవసరం మాత్రం ప్రజలు గుర్తించారు.
సమాంతర ప్రజా చైతన్యం కృషి
రాష్ట్రాలు, భౌగోళిక అంశాలు వేరు కావచ్చు కానీ ఎక్కడైనా ప్రజల సమస్యలు ఒకటే. పెట్టుబడిదారులు రాజకీయ పక్షాల వారు మాత్రమే స్వప్రయోజనాలకు పాల్పడడం వలన కొన్ని రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు కానీ ప్రజల మధ్య ఏనాడు కూడా విభేదాలు లేవు.
ఈ విషయాన్ని అందరూ గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఐదు సంవత్సరాలు పాటు నిరంతరాయంగా కొనసాగుతూ ప్రభుత్వాన్ని ఆలోచింప జేసే విధంగా పనిచేసిన ఐక్యకార్యాచరణ కమిటీ( జేఏసీ) వంటి కమిటీల నిర్మాణాలను భారతదేశమంతా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతా రాష్ట్రాలలోనూ ఈ తెలంగాణలో ఈ సజీవ అనుభవాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని పుట్టిన సంస్థలు ప్రజలకు సక్రమ పాలన అందించే దిశగా కృషి చేస్తున్నాయి.
అంటే ఈ ఐక్య కార్యాచరణ కమిటీ లు ప్రభుత్వానికి సమాంతరంగా పని చేయవలసి ఉంటుంది దీనికి చట్టబద్ధమైన అధికారాలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రజా చైతన్యమే ఐక్య కార్యాచరణ కమిటీ ల(J.A.C) ఏర్పాటుకు గీటు రాయి.
ప్రజాస్వామ్య పద్ధతి కొంతయినా అమలు కావడానికి ఇటీవలి కాలంలో విజయవంతమైన టువంటి ఒక మహత్తరమయిన ఏర్పాటు జెఎసి. ఈ రోజు అనేక రాష్ట్రాల్లో చట్ట పాలన, ప్రజాస్వామ్య పాలన ప్రమాదంలో పడుతూ ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. దీనికి పరిష్కారం బుద్ధిజీవులు, ప్రజాస్వామిక వాదులు, పౌర సంఘాలు కలసి కృషి జెఎసిగా ఏర్పడటం. జెఎసి ద్వారా మాత్రమే అంబేద్కర్ కలలుగన్న ప్రజాస్వామిక సౌధాన్ని బలోపేతం చేయగలం. అదే ప్రస్తుతావసరం.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, కవి, రచయిత, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ)