ఆయారాం గయారాంల హర్యానాలోనే రైతాంగ ఉద్యమం కొత్త మలుపు

“ఎద్దుచచ్చినా వాత మాత్రం అద్భుతంగా కుదిరింది”

“శాసనసభలో అవిశ్వాస తీర్మానం ఓడింది, రైతాంగ హృదయాలలో గెలిచింది”

“కొత్తప్రయోగంగా వర్తమాన భారత రైతాంగ ఉద్యమానికి హర్యానా నేర్పుతోన్న సరికొత్త గుణపాఠం”

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

వర్తమాన దేశ రాజకీయ ఉద్యమ గమనంలో హర్యానా రాష్ట్రం నేడు దేశ రైతాంగానికి ఓ కొత్త పాఠాన్ని నేర్పింది. నేటి వరకు ఆయా రాష్ట్రాల శాసన సభల సభ్యులు సంతలలో సరుకుల వలె కొనుగోళ్లు, అమ్మకాల బిజినెస్ తెలిసిందే.

అది ముఖ్యంగా ప్రపంచీకరణ ప్రక్రియ తర్వాత వ్యవస్తీకృత రూపం తీసుకుంది. ఈ కృళ్ళు ఫిరాయింపుల సంస్కృతికి భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ లో హర్యానాకు ప్రత్యేక స్థానం కూడా ఉంది.

సాంప్రదాయం ప్రకారం దానికో నిక్ నేమ్ కూడా ఉంది. దానికి వ్యంగ్యoగా దేశ ప్రజలు పిలుచుకునే వ్యంగ్య నామం “ఆయారాం గయారాం సంస్కృతి”! దానికి కూడా హర్యానా రాష్ట్రమే పేరొందింది.

అదే హర్యానాలో తొలిసారి వర్తమాన రైతాంగ ఉద్యమం దానికి భిన్నమైన నూతన రాజకీయ సంస్కృతిని వ్యాపంప జేస్తోంది. అదే నేడు రైతాంగ ప్రతిఘటానా ఉద్యమ బలంతో కొత్తగా రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల్ని పడగొట్టే రాజకీయ ప్రక్రియకు కొత్త ప్రయత్నం చేయడం. ఇది ఇక్కడితో ముగిసేది కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే.

“ఓ శాసన సభ్యులారా, మీకు కుర్చీ కావాలో? కిసాన్ కావాలో? తేల్చుకోండి అనే పోరాటనినాదంతో వారం రోజులుగా హర్యానాలో రాజకీయ వాతావరణం వేడెక్కి పోయింది. వివిధ శాసన సభ్యుల వద్దకి మాస్ విజ్ఞాపన యాత్రలు సాగాయి. వందలు, వేల మంది చొప్పున రైతాంగం భారీ స్థాయిలో కదిలింది. వారిని నిలదీసింది. వత్తిళ్ళు తీవ్ర స్థాయిలో వచ్చాయి.

అవిశ్వాస తీర్మానం పెడితే తాము మిత్రపక్షంగా వున్నా, తాము ఖట్కార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఉపముఖ్యమంత్రికి చెందిన JJP పార్టీ శాసన సభ్యులు ముందుగా పబ్లిక్ లో భారీ డైలాగులు కొట్టారు. తీర్మానం పెట్టేసరికి ప్లేటు ఫిరాయించారు. అటు పబ్లిక్ లో బయటకు రాలేక, ఇటు లోపల ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

సంయుక్త కిసాన్ మోర్చా (SKM) విడుదల చేసిన తాజా ప్రకటనలో అవిశ్వాస తీర్మానం సాంకేతికంగా ఓడినా, అది రాజకీయంగా గెలిచినట్లుగానే స్పష్టం చేసింది.

రానున్న కొద్ది రోజుల్లోనే ఖట్కార్ ప్రభుత్వాన్ని బలపరిచిన శాసన సభ్యులకు రాష్ట్ర ప్రజల రాజకీయంగా, సాంఘికంగా బహిష్కరణ తప్పదనే విశ్వాసం రైతాంగం లో ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు నిలబడలేరని రేపటి చరిత్ర నిరూపించబోతోంది. ఇప్పటికే మహా పంచాయతీ సభల తాకిడికి భరించలేక రోడ్ల మీద తలెత్తుకోలేక ఎవరికి వాళ్ళు తప్పించుకునే స్థితి ఉంది. ఇది రేపటి భారతదేశ రైతాంగ ఉద్యమ గమనంలో వస్తోన్న ఓ కొత్త మలుపు, సరికొత్త పిలుపు!

భారత పార్లమెంటరీ రంగంలో ధనిక వ్యాపార, వాణిజ్య సాంస్కృతిక కృళ్ళు సంస్కృతి ఎక్కడ వ్యవస్థీకృత రూపంగా ధరించి, ఆయారాం గయారాం సంస్కృతిగా నేడు ప్రాచుర్యం లోకి వచ్చిందో, అదే హర్యానాలో దానికి భిన్నమైన విరుగుడు రాజకీయ సంస్కృతి కి నేడు శ్రీకారం చుట్టడం ఓ గమనార్హం.

సాంకేతికంగా అవిశ్వాస తీర్మానం నేడు ఓటమి పొంద వచ్చు. కానీ రాజకీయంగా అది విజయం సాధించింది. కుర్చీకి అంటిపెట్టుకొని ఉండటానికి అట్టి శాసన సభ్యులు నేడు ప్రజలలో ఘోరంగా అప్రతిష్ట పాలయ్యారు.

చెరకు గడల్ని మిషన్లలో వేసి రసాన్ని పీల్చి పిండి చేసిన తర్వాత పిప్పిగా వాళ్ళిప్పుడు మారారు. వాళ్ళు ఇప్పుడు కేవలం దిష్టిబొమ్మ శాసన సభ్యులు మాత్రమే. అవి ఇకనుండి కదిలే బొమ్మలుగా కూడా పనిచేయవు, కేవలం దహన సంస్కారం కోసం దగ్ధం చేసే బొమ్మలుగా మాత్రమే ఉంటాయి. ఐతే, హర్యానా ప్రజలకు వాటి దహన సంస్కార అంత్యక్రియల పట్ల కూడా ఇక ఆసక్తి కలిగించక పోవచ్చేమో! శాసనసభా సభ్యులు చీము, నెత్తురు లేని నిర్జీవ బొమ్మలుగా మారారు. వాటిని దగ్ధం చేసే ఆసక్తి కూడా ఆ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ లో ఉండక పోవచ్చు.

వర్తమాన రైతాంగ ఉద్యమ తాకిడికి కర్నాల్ జిల్లాలో హర్యానా ముఖ్యమంత్రిని సభ భగ్నమైన సంగతి తెలిసిందే. సభ కోసం హెలికాప్టర్ ని కూడా దిగనివ్వకుండా కుర్చీల్ని, టెంట్లును, సభావేదికల్ని తమ ధర్మాగ్రహంతో రైతాంగం తొలగించి పారేసిన చర్యకు శాసన సభ్యులు మున్ముందు అర్హులుగా మారవచ్చునేమో!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *