‘ఆసరా’తో చేతులు దులుపుకోవద్దు, దివ్యాంగుల అభివృద్ధికి బడ్జెట్లో 5 శాతం నిధులు కేటాయించండి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా దివ్యాంగులకు ఆసరా కోసమే నిధులు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నది, ఈనెల 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే 2021-22 బడ్జెట్లో దివ్యాంగుల అభ్యున్నతికి 5 శాతం నిధులు ఖచ్చితంగా కేటాయించి,ఆ నిధులన్నీ వారికే ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని వరంగల్ అర్బన్ జిల్లా వికలాంగుల జేఏసీ కన్వీనర్ నల్లెల్ల రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో దివ్యాంగులకు తీరని అన్యాయం చేస్తుందని ఈ విషయంపై ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలిపినప్పటికీ ఫలితం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసరా పింఛన్ కోసం మాత్రమే నిధులు కేటాయించడం తప్ప వారి అభ్యున్నతి కొరకు ఏమాత్రం నిధులు కేటాయించడం లేదు. దీనితో దివ్యాంగులకు అందాల్సిన వివాహ ప్రోత్సాహకాలు, సబ్సిడీ లోన్లు,సహాయ ఉపకరణాలు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం కనికరించడం లేదని అన్నారు.
స్వయం ఉపాధి రుణాల ఈ సంవత్సరం కొత్తగా ఆన్లైన్ విధానంతో దివ్యాoగులు తీవ్రంగా నష్టపోతున్నారని, గత 2 సంవత్సరాలుగా నిధుల కొరతను సాకుగా చూపి కొత్తగా ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునప్పటికి ఒక్క దివ్యాoగుడికి కూడా పింఛన్ మంజూరు చేయకపోవడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు.
బడ్జెట్ అనంతరం అర్హులైన దివ్యాంగులకు వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు.
2016 చట్టం ప్రకారం 21 రకాల దివ్యాoగులకు ధ్రువపత్రాలు జారీ చేసి వారందరికీ ఆసరా వర్తింపచేయాలని, ఉద్యోగ విరమణ పొందిన వికలాంగ కార్పొరేషన్ ఉద్యోగుల బకాయిలు సైతం చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని, అన్ని దివ్యాంగుల హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో అన్ని కేటగిరీ దివ్యాంగుల కోసం అన్ని వసతులతోకూడిన హాస్టళ్లల్లతో పాటు దివ్యాంగుల ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రాలలో నిరుద్యోగ దివ్యాంగుల కోసం ఉచిత శిక్షణ కేంద్రాలను నిర్వహించేందుకు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల రాష్ట్ర జేఏసి ఆధ్వర్యంలో పోరాటం చేసేందుకు దివ్యాంగుల సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు జరిగే సమావేశాల్లో దివ్యాంగులకు 5 శాతం రాజకీయ రిజర్వేషన్ చట్టం తేవాలని డిమాండ్ చేయడం చేశారు.