ఉద్యోగులకు 45% ఫిట్మెంట్ ఇస్తే ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తప్పుకుంటాం: డా. దాసోజు సవాల్

‘’ఉద్యోగులకు 45% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు జీవో విడుదల చేసి, వారి సమస్యలన్నీ పరిష్కారిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటుంది. అలా చేయని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ తప్పుకోవాలి’’ అని బహిరంగ సవాల్ విసిరారు కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.

‘’కేసీఆర్ కు నిబద్దత వుంటే ఎన్నికల కమీషన్ కు లేఖ రాసి సుదీర్గంగా పెండింగ్ లో వున్న ఫిట్ మెంట్ డిమాండ్ ని వెంటనే అమలు చేయడానికి అనుమతులు కోరాలి. ఉద్యోగులకు చేసిన అన్ని వాగ్దానాలు , హామీలు పరిష్కరించి జీవో రిలీజ్ చేయాలి. ఉద్యోగులకు న్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ పోటీ నుండి తప్పుకుటుంది. దీనికి కేసీఆర్ సిద్దమా?’’ అని సవాల్ చేశారు దాసోజు.

తెలంగాణ ఉద్యోగులు గతంలో తమకు చేసిన వాగ్దానాలు అమలు చేయండని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరినప్పుడు.. ఉద్యోగులని తోకతో పోల్చి ‘’కుక్క తోకని ఊపుతుందా ? తోక కుక్కని ఊపుతుందా ?’’ అని వ్యాఖ్యానించి అపహాస్యం చేశారు సిఎం కేసీఆర్. నేడు అదే కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ఉద్యోగులని మళ్ళీ మోసం చేసి మసిపూసి మారేడుకాయ చేసి ఓట్లు గుంజుకోవడానికి క్షుద్రరాజకీయం చేస్తున్నారు. కేసిఆర్ కుట్రని ఉద్యోగులు, పట్టభద్ర మిత్రులు గమనించాలి’’ అని కోరారు దాసోజు.
ఈ సందర్భంగా ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ కవితని గుర్తుచేశారు దాసోజు శ్రవణ్. ‘’ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట.. ఇంకెవరినీ మోసగించను అని.. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట.. తోటి జంతువులని సంహరించనని.. ఈ కట్టుకధవిని గొర్రెలింకా.. పుర్రెలూపుతూనే వున్నాయి’. ఈ కవిత చదువుతుంటే ఈరోజు గొర్రెలు లెక్క ఉద్యోగ సంఘ నాయకులు పుర్రెలు వూపుకొని వాళ్ళన్ని వాళ్ళు మోసం చేసుకుంటూ , తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులని మోసం చేస్తూ ..కేసీఆర్ మాయలో పడి మొత్తం ఉద్యోగులని భ్రమకు గురి చేస్తున్నారు. ఉద్యోగులు కేసీఆర్ మాయని గుర్తించాలి. ఈ ఒక్క ఎన్నికలో కేసీఆర్ ని ఓడిస్తే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కేసీఆర్ ని ఓడిస్తే.. మీ ఇంట్లో కూర్చున్నా పీఆర్సీ వస్తుంది. మీ హక్కులు సాకారం అవుతాయి. మీకు అందాల్సిన అన్ని సౌకర్యాలు అందుతాయి. ఈ విషయాన్ని ఉద్యోగ మిత్రులు గ్రహించాలి’’ అని కోరారు దాసోజు.

‘పీఆర్సీ అనేది ఉద్యోగుల హక్కు. దీనికి కేసీఆర్ దయ అవసరం లేదు. కానీ కేసీఆర్ మాయ ఎలా వుందంటే.. దానికి ఒక కమిటీ వేశారు. మూడేళ్ళ తర్వాత బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. దిన్ని కూడా అమలు చేయకుండా మళ్ళీ దానికి త్రిసభ్య కమిటీ వేశారు. ఉద్యోగులకు చట్టపరంగా రావాల్సిన హక్కుని ఇవ్వడానికి కేసీఆర్ కి ఏంటి నొప్పి ? ఇదంతా కేసీఆర్ ఆడుతున్నా డ్రామా .. ఈ డ్రామాని ఉద్యోగులు గమనించాలి. ‘’పక్కన వున్న ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ 27శాతం ఇస్తున్నారు. నేను 29శాతం ఇస్తానని’’ కేసీఆర్ చెప్పగానే పటాసులు, పాల ప్యాకెట్ల బ్యాచ్ క్షీరాభిశేకాలకి సిద్దమవ్వడం ఎంత వరకూ న్యాయం ఉద్యోగులు అర్ధం చేసుకోవాలి. ఆంద్రప్రదేశ్ అప్పుల్లో వున్న రాష్ట్రం. మనది రెవెన్యూ సర్ ప్లస్ వున్న ధనిక రాష్ట్రం. 43% ఫిట్ మెంట్ ఇస్తామని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ నేడు 29% % ఫిట్ మెంట్ గురించి మాట్లాడటం ఏమిటి? 43% అన్న కేసీఆర్ 45% ఇస్తామంటే ఉద్యోగులు సంబరాలు చేసుకోవాలి. పాల ప్యాకెట్ బ్యాచ్ క్షీరాభిశేకాలు చేయాలి. కానీ ఉత్తి మాటలకే మోసాపోయి పరిస్థితి ఎందుకు వస్తుంది.?? ఫిట్ మెంట్ విషయంలో కేసీఆర్ మాయని, ఉద్యోగసంఘ నాయకులు భ్రమని ఉద్యోగులంతా కలసి తిప్పికొట్టాలి’’ కోరారు దాసోజు.
‘’ఎన్నికలు రాగానే కేసీఆర్ అబద్దాల కోరుగా మారిపోతారు. 2018లో ఎన్నికల సమయంలో అధికారంలో రాగానే నిరుద్యోగ బృతి ఇస్తామన్నారు. అధికారం వచ్చిన వెంటనే మర్చిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకి ముందు ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ. 10000 చొప్పున ఇస్తామన్నారు. మేయర్ ప్రమాణ స్వీకారం కూడా అయిపొయింది. పరిహారం సంగతే మర్చిపోయారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి మంచి నీరు అన్నారు. దాని సంగతే మర్చిపోయారు. కేసీఆర్ కు అబద్దం.. తప్పితే ఆచారణ లేదు. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం ఓట్లు వేయించుకొని అల్జీమర్స్ వచ్చినట్లు మర్చిపోవడం కేసీఆర్ కి అలవాటు. దయచేసి నిరుద్యో, ఉద్యోగ మిత్రులు కేసీఆర్ మాయలో పడకండి. కేసీఆర్ ని ఓడించడమే మీ సమస్యకు పరిష్కారం’’ అని వివరించారు దాసోజు.

కేటీఆర్ గోబెల్స్ ప్రచారం :

మంత్రి కేటీఆర్ ‘మీట్ ది స్టూడెంట్స్’ అంటూ ఇస్తున్న ప్రసంగాలు వింటే నవ్వు వస్తుంది. హైదరాబద్ ఎర్రమంజిల్ నుండి ఖైరతాబాద్ వెళ్ళేటప్పుడు.. ఆయనకు మహిళలు నీళ్ళ కోసం బిందెలతో కొట్టుకోవడం కనిపించేదట. ఆయన చెప్పిన ముఫ్ఫై ఏళ్ళ కిందట ముచ్చట ఇది. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చారట. ఇంతకంటే పెద్ద అబద్దం ఏమైనా ఉంటుందా ? కేటీఆర్ ముచ్చట తీసుకుంటే .. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు కృష్ణా నుండి దాదాపు 16టీఎంసిల నీళ్ళు, వెల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టి గోదారి నుండి 10టీఎంసిల జలాలు తెచ్చి హైదరాబాద్ వాసుల దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవాలు ప్రజలకు స్పష్టంగా తెలుసు. కానీ కేటీఆర్ మాత్రం మేమే నీళ్ళు ఇచ్చామని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఇంత గోబెల్స్ ప్రచారం ఎందుకు కేటీఆర్ ? ‘’ అని నిలదీశారు దాసోజు.

ఆత్మహత్యలకు సమాధానం ఎవరు చెబుతారు కేటీఆర్ ?

ట్రాన్స్ కో , జెన్ కో ఇలా వివిధ శాఖల్లో పని చేస్తున్న 22,637మంది ని ఆర్టిజన్ పేరుతో రెగ్యులర్ చేశామని కేటీఆర్ గొప్పగా చెబుతున్నారు. కానీ మొన్నటికి మొన్న అంకం బుచ్చిరాజు అనే అర్టిజన్ ఉద్యోగి జగిత్యాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ విధ్యుత్ బోర్డ్ రెగ్యులర్ పే స్కేల్స్ ఏమీ అమలు కావడం లేదు. అర్టిజన్ అని ఉత్తుత్తి ఆర్డర్ ఇచ్చారు తప్పితే మా ఉద్యోగాలు పర్మినెంట్ కాలేదని యూనియన్ దీక్ష చేస్తే అందులో అంకం బుచ్చి రాజుని సస్పెండ్ చేశారు. ఆ నిరాశలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న మరో ఘటన. ఎన్ నరసయ్య భువనగిరిలో పని చేస్తున్న మరో ఆర్టిజన్ కార్మికుడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యలకు కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు ? ఈ చావులకు కారణం ఎవరు ? నిరుద్యోగులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు పిట్టల్లా రాలిపోతుంటే ..ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు కేటీఆర్ ?అని నిలదీశారు దాసోజు.
కేటీఆర్ కు సిగ్గుందా ?

‘’కాంగ్రెస్ పార్టీ పదేళ్ళలో పదివేల ఉద్యోగాలే ఇచ్చింది. మేము ఒక లక్షా ముఫ్ఫైరెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెబుతున్నారు. ఈ మాట వింటుంటే అసలు కేసీఆర్ సిగ్గుందా ? అనే అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు డీయస్సీ ద్వారా వేలమందికి ఉద్యోగాలు కల్పించింది. పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా వేలమంది ఉద్యోగాలు పొందారు. స్కిల్ డెవలప్ ద్వారా లక్షమంది ఉద్యోగాల్లో చేరారు. అసలు మీరు డీయస్సీ తీసేశారు. స్కిల్ డెవలప్మెంట్ లేక యువత బిక్కుబిక్కుమంటుంది. వ్యవస్థల్ని బ్రస్టుపట్టించారు. ఖాళీల విషయంలో చర్చకు రమ్మంటే అబద్దాల మీద అబద్దాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇంటిపేరు శ్రీగంధం .. ఇంట్లో మాత్రం గబ్బిలాల వాసన అన్నట్టు వుంది కేటీఆర్ తీరు. చెప్పేవి గొప్ప మాటలు .. లోపల మాత్రం డొల్ల’’ అని ఎద్దేవా చేశారు దాసోజు.

రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా ?]

రాష్ట్రంలో ఎన్నికల కమీషన్ పనితీరు చూస్తుంటే అది ప్రైవేట్ కమీషన్ అనిపిస్తుంది. ఎన్నికలకు సరిగ్గా 48గంటలు కూడా లేదు. ఇప్పుడు బోగస్ ఓట్లు గుర్తించడానికి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు బోగస్ ఓట్లని గుర్తించి ఎప్పుడు సరి చేస్తారు ? ఎప్పుడు వాటిని తొలగిస్తారు ? ఇదేం పని తీరు.? అసలు రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా ? అని మండిపడ్డారు దాసోజు.

కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి :

‘’చేతులు జోడించి నమస్కారిస్తున్నా. ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్ర మిత్రులు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. టీఆర్ఎస్ గెలిస్తే మరో భజన బ్యాచ్ ని చట్ట సభకు పంపినట్లే అవుతుందని కానీ ప్రశ్నించే గొంతుకని కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మీ తరపున ప్రశ్నించడానికి కాంగ్రెస్ అభ్యర్ధులకు అవకాశం ఇవ్వండి. మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్ధులని ఎమ్మెల్సీగా గెలిపించండి’’ అని విజ్ఞప్తి చేశారు దాసోజు శ్రవణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *