భారతీయ జనతా పార్టీ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకించారు. అంతేకాదు, ప్రతిదాన్ని ప్రయివేటీకరించడం మంచి విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణను తాను వ్యతిరేకించిన విషయం గుర్తు చేస్తూ ఇదే కారణంతోనే ఇపుడు తాను విశాఖ స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద తనకు పెద్ద అవగాహన లేదని అంగీకరిస్తూనే, జగన్ తో కలసి ఈ విషయం మీద ప్రధాని మోదీనికలుస్తానని కూడా చెప్పారు. ఎప్పటిలాగానే ఆయన చంద్రబాబు నాయుడికి బాగా వ్యతిరేకించారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన సోనియా కాళ్ల మీద ఎందుకుపడ్డారో ప్రజలకు జవాబీయాలని అన్నారు.
డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను బాగా వ్యతిరేకిస్తారనే తెలిసిందే.
ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నివాసంలో కలుసుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్ సుబ్రహ్మణ్య స్వామిని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
టిటిడి పాలనా తీరు మీద ఒకపుడు కేసు వేసిన సుబ్రహ్మణ్య స్వామి సంచలనం సృష్టించారు. టిటిడి లెక్కలను కాగ్ చేత ఆడిట్ చేయించాలని డిమాండ్ చేశారు. తర్వాత టిటిడి ఈ మేరకు ఒక తీర్మానం చేసింది.తర్వాత ఈ పేరు చెప్పి ఆయన కేసును ఉపసంహరించుకున్నారు. తర్వాత ఆయన జగన్ అభిమాని అయ్యారు. టిటిడి విముక్తి పోరాటందాదాపు వదలుకున్నట్లే.
తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలుసుకున్నాక ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆయన కామెంట్స్:
“టీటీడీ ప్రతిష్ట దెబ్బతీయటం సరికాదు. ఆంధ్రజ్యోతిలో టీటీడీకి సంబంధించి వచ్చిన తప్పుడు వార్తలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. వెంకటేశ్వరస్వామి భక్తుడిని నేను. సీఎం జగన్ తండ్రి వైఎస్ తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆంధ్రజ్యోతి లో వచ్చిన కథనాల వెనక చంద్రబాబు ఉన్నాడు. ఆంధ్రజ్యోతి పై పరువునష్టం దావా వేశాను.
టీటీడీ లావాదేవీలపై కాగ్ ఆడిట్ చేయించేందుకు సీఎం అంగీకరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర పరిధిలోని అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు. ఇదివరకే ప్రధానికి సీఎం రెండు సార్లు లేఖ రాశారు. ప్రధానితో సీఎం జగన్ చర్చలు జరుపుతారని అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను వ్యతిరేకం.”