(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
ఏపీ ప్రజలు కోరితే చేసిన చట్ట కాదు విభజన చట్టం బలవంతముగా రుద్దినది. దాన్ని కూడా అమలు చేయకపోవడం దుర్మార్గం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రామాయపట్నం పోర్టు విషయంలో చేసిన ప్రకటనతో ఏపీకి రాజకీయ హామీ అయిన ప్రత్యేక హోదానే కాదు పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టం అమలుకు కూడా సిద్ధంగా లేమని చెప్పినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించడం భారతదేశ సమగ్రతకు విఘాతం కలిగించడమే.
విభజన చట్టం అమలలో అడుగడుగునా అలసత్వం..
విభజన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సీమాంధ్ర ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం. కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రత్యేక హోదా హామీ , సీమాంధ్ర సమగ్రాభివృద్ధికి విభజన చట్టం చేసింది. రెండు అమలు జరిగి ఉంటే విభజన వల్ల జరిగిన నష్టం నుంచి బయట పడటంతో బాటు అభివృద్ధి వైపు అడుగులు పడేది. విభజన చట్టాన్ని కాంగ్రెస్ చేసింది. నాటి ప్రతిపక్ష బీజేపీ చట్టంలో లోపాలు ఉన్నాయని పేర్కొన్న అంశాల అమలుకు ఆటంకం అని తాము అధికారంలోకి వస్తే మార్పులు చేసి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. విభజనకు కాంగ్రెస్ పార్టీతో బాటు బీజేపీ కూడా కారణమే. ఈ ఒక్క హామీతో కోపాన్ని పక్కన పెట్టి బీజేపీని ఆదరించి ఇద్దరు ఎంపీలను కూడా గెలిపించారు. 10 సంవత్సరాల విభజన చట్టాన్ని అమలు చేసే అవకాశం బిజెపికి దక్కింది. ఈ చట్టాన్ని అమలు చేసి ఉంటే ఏపీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారడంతో బాటు బీజేపీకి రాజకీయంగా ఎదుగుదలకు అవకాశం లభించేది. హోదా చట్టంలో పేర్కొన్న లేదు కాబట్టి అమలు చేయడానికి సాద్యం కాలేదు అన్నారు. దాని స్థానంలో ప్యాకేజీ అమలు చేస్తామని అన్నారు. నాడు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మోసపూరిత నిర్ణయం. ఎందుకంటే హోదాకు ప్రత్యామ్నాయంగా ప్యాకేజి అంటే విభజన చట్టానికి అదనంగా ఇచ్చేది కానీ కేంద్రం విభజన చట్టంలోని కొన్ని అంశాల అమలుకు అయ్యే ఖర్చును కూడి అదే హోదా స్థానంలో ప్యాకేజీ అన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన నాటి అధికార పార్టీ దాన్ని స్వాగతించి అర్థం లేకుండా దానికి చట్టబద్ధత కోసం కృషి చేసింది. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాము ప్రకటించిన ప్యాకేజీకి చట్టం అవసరం లేదని విభజన చట్టంలో పేర్కొన్న అంశాలే ప్యాకేజీలో ఉన్నాయని చెప్పారు.
విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు కడప ఉక్కు , రాజధాని నిధులు , ఆర్థిక లోటు , కోస్తా కారిడార్ లాంటి అంశాలు పరిశీలన ,సాయం అన్న పదాలు వాడారు. వీటికి సవరణలు చేసి మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన మాటలు పక్కనపెట్టి చట్టంలోని లోపాలను ముందుకు తెచ్చారు. 2018 మార్చి కల్లా దుగరాజపట్నం పూర్తి , పోలవరం నిర్వాసితులకు ఇచ్చే పరిహారంతో సహా పూర్తి బాధ్యత కేంద్రందే అని చట్టంలో ఉన్నా వక్రీకరించి మాట్లాడుతున్నారు. రాయలసీమ , ఉత్తరాంధ్ర అభివృద్ధి నిధులు మంజూరు ఇప్పటి వరకు చేయలేదు. కేవలం అన్ని రాష్ట్రాలకు ఇచ్చే విద్యాసంస్థలు మినహా మిగిలిన చట్టంలో పేర్కొన్న అంశాల గురించి పూర్తిగా మరిచిపోయారు. పుండు మీద కారం కొట్టినట్లు చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కు , తిరుపతి మన్నవరం ప్రాజెక్టులను అమ్మడానికి పూనుకున్నారు.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం..
భారత దేశం వివిధ రాష్ట్రాల సమాహారం. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ద్వారా మాత్రమే దేశసమగ్రతను పటిష్టం చేసుకోగలం. ఏపీ దేశంలో భాగమే. ఏపీ ప్రజలు కోరే కోర్కెలు అన్ని తీర్చాలని కోరితే అన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత అసంతృప్తి ఉండవచ్చు. విభజన చట్టం ఏపీ ప్రజల కోరికతో చేసింది కాదు. ఏపీ ప్రజల మీద కేంద్రం రుద్దినది. అందులో కాంగ్రెస్ , బీజేపీ భాగస్వామ్యం ఉన్నది. తాము చేసిన , చేస్తామన్న చట్టాన్ని కూడా అమలు చేయడానికి నిరాకరించడం అప్రజాస్వామిక చర్యే కాదు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కూడా. రాష్ట్రాల విశ్వాసంతో సంబంధం లేకుండా దేశ సమగ్రత సాధ్యమా ? కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన తప్పులను నాటి అధికార పార్టీ రాజకీయ కోణంలో చూసి తప్పు చేసింది. నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలానే చేస్తే తప్పు చేసిన వారు అవుతారు. ఏపీ ప్రభుత్వం చేయాల్సినది విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు విషయంలో స్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకు అధికారిక నిజాలు చెప్పాలి. అందరిని కలుపుకుని రాజకీయంగా చేయాల్సిన ప్రయత్నాలు అనుమానాలకు ఆస్కారం లేకుండా వ్యవహరించాలి.