(రాఘవశర్మ)
తెల్లవారక ముందే తిరుపతి కూరగాయల మార్కెట్‌లో ఒకటే సందడి. వచ్చిపోయే ఆటోలు, వ్యాన్లు, లారీలు. పనిచేసే కూలీల ఉరుకులు పరుగులు. సరుకులు దించుకునే వ్యాపారుల్లో హడావిడి.
తెలతెలవారుతుండగా మార్కెట్‌లోకి సంచులు పుచ్చుకుని వస్తున్న ప్రజానీకం. ప్రతి ఉదయం ఇక్కడ జీవనోత్సాహం తొణికిసలాడుతూనే ఉంటుంది. ఎటు చూసినా రకరకాల కూరగాయలు. తోపుడు బళ్ళపైన పళ్ళు, కుప్పలుగా ఆకుకూరలు. గుట్టలుగా ఎర్రగడ్డలు(ఉల్లిపాయలు), ఉర్లగడ్డలు(బంగాళాదుంపలు).
ధరలు అడుగుతూ, నచ్చినవి ఏరుకుంటూ, తూకం వేయించి తీసుకెళుతున్న పుర ప్రజలు. తిరుపతిలో నిజానికి అది ఒక నాటి తాతయ్యగుంట. పూడిపోయిన ఆ నీటి గుంటలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌ను 1996లో నిర్మించారు.
పాతికేళ్ళ క్రితం వరకు గాంధీ రోడ్డులో కూరగాయల మార్కెట్ చాలా ఇరుకిరుగ్గా ఉండేది. నాలుగు దిక్కులా నాలుగు ప్రధాన పెద్ద పెద్ద గేట్లతో ఈ కొత్త మార్కెట్‌ను చాలా విశాలంగా నిర్మించారు.
తిలక్ రోడ్డులో నుంచి పడమటి దిక్కున ఒక గేటు, మున్సిపల్ కార్యాలయం వైపు నుంచి ఉత్తర దిక్కున మరొక గేటు వచ్చిపోయే వాహనాలతో రద్దీగా ఉంటుంది. తూర్పున తుడా కార్యాలయం వైపు ఉండే గేటు నుంచి అక్కడి ప్రజలు వస్తుంటారు. దక్షిణ వైపు ఉన్న గేటు ఎప్పుడూ మూసే ఉంటుంది.
ఊరంతా ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఇక్కడ భలే సందడిగా ఉంటుంది. ఎప్పుడో అర్ధరాత్రి దాటాక కూరగాయల లారీలు మార్కెట్‌కు వస్తుంటాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల నుంచి కూరగాయలు దిగుతుంటాయి. తెల్లవారు జామున మూడున్నర నుంచే అమ్మకాలు మొదలవుతాయి.
రిటైల్‌గా అమ్మే చిన్న చిన్న వ్యాపారులు ఇక్కడి నుంచే కూరగాయలు కొని తీసుకెళుతుంటారు. సూర్యుడు ఉదయించక ముందే సంచులు పుచ్చుకుని ప్రజలు వస్తుంటారు.
మార్కెట్‌కు పడమర దిక్కున ఉన్న గేటులోంచే ప్రజలు ఎక్కువగా ప్రవేశిస్తుంటారు. ఈ గేటు వెలుపల కొందరు వృద్ధులు రోడ్డుపక్క కూర్చుని నిమ్మకాయలు అమ్ముతుంటారు. చాలా ఏళ్ళబట్టి వీళ్ళను గమనిస్తూనే ఉన్నాను.
ఈ మధ్య మార్కెట్‌కు వెళ్ళినప్పుడు “నిమ్మకాయలు ఎట్లా ఇస్తున్నావ్ ” అని ఒక అవ్వను అడిగాను. చిన్న ప్లాస్టిక్ తట్ట ఇచ్చి ” పదికి నాలుగు ” అన్నది.
ఇరవై రూపాయలకు ఎనిమిది కాయలు ఏరి తీసుకుని చూపించాను. ఆ వృద్ధురాలు నా చేతిలో ఉన్న తట్టను ‘ తే ‘ అంటూ గబుక్కున లాక్కుంది. ఆమె చెప్పిన లెక్క ప్రకారమే తీసుకున్నాను కదా! ఎందుకు లాక్కుందని ఆశ్చర్యపోయాను.
ఆ తట్టలో మరో రెండు నిమ్మకాయలు వేసి ఇచ్చింది. పదికి అయిదు ఇమ్మని ఎలాగూ బేరమాడతానని పదికి నాలుగే అన్నది. నేను బేరమాడకుండా తీసుకునే సరికి ఆ అవ్వ నా చేతిలో తట్ట లాక్కుని మరో రెండు కాయలు వేసిచ్చింది.
దాని వల్ల నాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. చిన్న విషయమే కావచ్చు కానీ, అందులోనే ఆ అవ్వ నిజాయితీ కనిపించింది. అసలు ఎంత మంది వ్యాపారుల్లో ఈ నిజాయితీ చూడగలుగుతాం!?
దాదాపు డెబ్బై ఏళ్ళు దాటిన వయసులో కూడా, తెల్లవారు జామున ఆ చలిలో, తలకు గుడ్డ కట్టుకుని రోడ్డు పక్కన కూర్చుని నిమ్మకాయలు అమ్ముతున్న ఆ అవ్వని ఎలా మర్చిపోగలం!
3
తాజా కూరగాయ ల తో కళకళ లాడుతున్న మార్కెట్గేటుదాటి లోపలికి ప్రవేశించగానే ఎడమ వైపు నుంచి వరుసగా ఎర్రగడ్డల అంగళ్ళు కనిపిస్తాయి. ఎర్రగడ్డల బస్తాలు మోసుకొచ్చి గుమ్మరించే కూలీలు, కూర్చుని అమ్మే ఉద్యోగులు. ఎర్రగడ్డలు అమ్మే పెద్ద పెద్ద వ్యాపారులు. బేరమాడి కొని తీసుకెళ్ళే చిన్న చిన్న రిటైల్ వ్యాపారులు. తెల్లవారు జామునుంచి వీళ్ళు పడుతున్న కష్టం ఇంతా అంతా కాదు. కాస్త ముందుకెళితే నాలుగు దారుల కూడలి.
వ్యాపారులంతా కలిసి ఆ కూడలిలోనే వినాయకచవితికి విగ్రహం పెడతారు. ఆ కూడలిలో నిలబడి ఎటుచూసినా తాజా కూరగాయల అంగళ్లే. ఉత్తర దిక్కు రోడ్డులో ఇరువైపులా కూరగాయల అంగళ్ళు. ఎదురుగా పెద్ద గేటు.
తూర్పుకు తిరిగితే రెండు వైపులా కూరగాయల అంగళ్ళ కు రోడ్డు మధ్యలో కూరగాయల గుట్టలు. ఆ దారిలో కాస్త ముందుకు వెళితే నోరూరించే తెల్ల వంకాయలు. ఎదురుగా తూర్పు గేటు దాటితే ఆ దిక్కున అరటి పళ్ళ అమ్మకాలు. ఆ కూడలి నుంచి దక్షిణ వైపునకు చూసినా సమిసలాడుతున్న తాజా కూరగాయలు.
రోడ్డు మధ్యలోనూ అమ్మకాలే. కాస్త ముందుకు వెళితే ఎడమవైపున షెడ్ల కింద టమాటాలు గుట్టలు గుట్టలు. ఒక వరుసలో ఆకుకూరలు. నిమ్మకాయల అవ్వలాగానే ఓ వృద్ధురాలు ఇక్కడ కూర్చుని ఆకుకూరలు అమ్మేది. పాతికేళ్ళుగా ఆమెని చూస్తూనే ఉన్నాను. తెల్లగా, సన్నగా మా అమ్మలాగే ఉండేది. ఎనభై రెండేళ్ళ వయసొచ్చేవరకు మా అమ్మే వంట చేసిపెట్టేది.
ఈ వయసులో కూడా ఆ వృద్ధురాలు ఆకు కూరలమ్మి రెక్కల కష్టంపైనే బతుకుతోంది! తెల్లవారు జామునే నేను కూరగాయలకు వెళుతున్నానంటే చాలు, మా మేనల్లుడు పండు నా వెంట పడేవాడు. నాతో పాటు కూరగాయలు ఏరేవాడు. వాటి గురించి అడిగేవాడు. దారి పొడవునా కబుర్లు చెప్పేవాడు.
నాతో వచ్చినప్పుడల్లా మా పండుతో ఆ ఆకు కూరలామె ఏదో ఒకటి మాట్లాడేది. ఎప్పుడైనా రాకపోతే ” ఏం నాయనా అబ్బోడు రాలేదే ” అని అడిగేది. లాక్ డౌన్ కాలంలో కూరగాయల మార్కెట్ మూతపడి, మళ్ళీ మూడు నెలల క్రితం తెరుచుకుంది.
మళ్ళీ ఆకుకూరలామె దగ్గరకెళితే, “అబ్బోడు పెద్దోడైపోయినాడుకదా! రావడం లేదు ” అని గుర్తు చేసుకుంది. వరుసగా ఒక నాలుగు వారాలు ఆమె కనిపించలేదు. “ఏం మీ అమ్మ కనిపించడంలేదు ” అని ఆ పక్కనే కూర్చుని ఆకుకూరలు అమ్మే ఆమె కూతురినడిగాను. “మా అమ్మ సనిపోయింది. ఒళ్ళుబాగలేక ” అంది. నెల దాకా ఆ విషయం నాకు తెలియనే లేదు. ఎందుకో తెలియని బాధ.
మా ఇంటికి కాస్త దూరమైనా పాతికేళ్ళ క్రితం నుంచి ఈ కూరగాయల మార్కెట్టుకు వస్తు నే ఉన్నాను. ఆ రోజుల్లో 50 రూపాయలు పెడితే చాలు, వారానికి సరిపోయే కూరగాయలు వచ్చేవి. ఇప్పడు 500 రూపాయలు పెట్టాల్సి వస్తోంది.
ఆ రోజుల్లో ఏ కూరగాయ అయినా కిలో పదిరూపాయలు దాటితో ‘ అబ్బో.. ధరలు పెరిగాయి ‘ అనుకునే వాణ్ణి. బాగా మండిపోతున్నాయని బాధపడేవాణ్ణి. ఇప్పుడు పది రూపాయలకు ఏ కూరగాయ దొరకడం లేదు.
కూరగాయలు కిలో సగటున ముప్ఫై నుంచి అరవై రూపాయల వరకు పలుకుతున్నాయి. వంద రూపాయల వరకు కూడా వెళ్ళిన కారట్ ఇప్పుడు దాని ధర ఇరవై రూపాయలకు ఢమేల్ అంది. ఏ కూరగాయ ఎక్కవ పండుతుందో దాని ధర ఇలా పడిపోతుంది.పంట దిగుబడిని బట్టి ధరలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
పచ్చి వ్యపారంలో నష్టాలూ ఉంటాయి.కొత్తిమేర వంటి ఆకుకూరలు అమ్ముడుపోకపోతే కుళ్ళిపోతాయి. ఆ నష్టమంతా వ్యాపారుల నెత్తినే పడుతుంది. కూరగాయల వ్యాపారం కూడా జూదం లాంటిదే. అన్ని ధరలతోపాటు కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి.
మిగతా సరుకులు, వస్తువుల ధరల పెరుగుదలతో పోల్చుకుంటే కూరగాయల ధరలు పెద్దగా పెరగలేదనే చెప్పాలి. కూరగాయలు రోజూ కొంటాం కనుక, ధర ఏ కాస్త పెరిగినా అబ్బో పెరిగిపోయాయని బాధపడిపోతాం.
లాక్ డౌన్ సమయంలో కూరగాయల ధరలను మున్సిపల్ కమీషనర్ కాస్త అదుపు చేశారు. లేకపోతే ప్రజలు అల్లాడిపోయేవారు.లాక్ డౌన్ ఎత్తివేయగానే కూరగాయల ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. కూరగాయల వ్యాపారులు విపరీతంగా ధరలు పెంచేసి లాక్ డౌన్ లోటును అలా భర్తీ చేసుకున్నారు.
కూరగాయలు మళ్ళీ మామూలు ధరలకొచ్చి ఇప్పుడొక సమతుల స్థాయికి చేరుకున్నాయి.లాక్‌డౌన్ కాలంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌ను మూసేశారు.
తిరుపతిలోని అనేక ప్రాంతాలలో కూరగాయల అమ్మకాలకు ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు ఎంత బాగా ఏర్పాట్లు చేసినా ఈ పెద్ద మార్కెట్‌కు సాటి రాలేదు.
ఆ తాజా కూరగాయలు, అన్ని రకాలు ఒకే చోట ఎక్కడా దొరకలేదు. లాక్‌డౌన్ కాలంలో కూరగాయల మార్కెట్ మూతపడిన ఆ ఎనిమిది నెలలు ఈ కూరగాయల వ్యాపారులంతా ఎలా బతికారో తెలియదు! వారి జీవనం ఎలా సాగిందో అర్థం కాదు!
మూడు నెలల క్రితం మార్కెట్ మళ్ళీ తెరుచుకుంది. అక్కడ అందరి ముఖాల్లో ఆనందం. మళ్ళీ ఒక జీవనోత్సాహం. మళ్ళీ జీవన సంరంభం ఆవిష్కృతమైంది.
(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)