(టి.లక్ష్మీనారాయణ)
విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా యుజిసీ నిర్ణయించిన నూతన వేతనాలను 2016 జనవరి 1వ తేదీ నుండి చెల్లిస్తూ, వైద్య కళాశాలల అధ్యాపకులకు – విశ్రాంత అధ్యాపకులకు మాత్రం 2021 మార్చి 1 నుండి అమలు చేస్తామంటూ జీ.ఓ. జారీ చేయడం ముమ్మాటికీ దగా! దగా! దగా! చట్ట వ్యతిరేకం, వివక్ష ప్రదర్శించడమే. ఐదేళ్ళకుపైగా ఇవ్వాల్సిన వేతన బకాయిలను ప్రభుత్వం ఎగ్గొట్టడం క్రిందికే వస్తుంది.
విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు చెల్లించాల్సిన వేతన బకాయిల్లో 50% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగిలిన 50% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, వైద్య కళాశాలల అధ్యాపకులకు చెల్లించాల్సిన వేతన బకాయిలను మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి కదా! అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్లు కనబడుతున్నది.
హక్కును హక్కుగా నిలదీసి సాధించుకొనే చైతన్యం విధ్యాధికుల్లోనే కొరవడితే ఎలా? రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని, అప్పుల ఊబిలో కూరుకపోయిందని, అప్పులు కూడా దొరకడం లేదు, జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలోకి దిగజారిపోయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే అప్పుడు ఎవరైనా సానుభూతి వ్యక్తం చేయవచ్చు! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వేతనాల్లో కోత విధించుకొని త్యాగాలు చేయమని కోరవచ్చు!
(టి.లక్ష్మీనారాయణ,సామాజిక ఉద్యమకారుడు)