వచ్చే మే నాటికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైయస్‌ఆర్‌సీపీకి ఆధిక్యం వస్తూ ఉందన్న ఆనందం వైసిపి లో మొదలయింది. మండలిలో టీడీపీ చెత్త రాజకీయాలకు చరమగీతం అని ముఖ్యమంత్రి జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ రోజు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో పార్టీ కి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇక్బాల్, కరీమున్సీసా, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్, సి.రామచంద్రయ్య సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం వైయస్ జగన్ బీ- ఫామ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మొత్తం సభ్యత్వం 58. ఇందులో వైసిపికి ఇపుడు 18 మంది సభ్యలున్నారు. తెలుగుదేశం పార్టీకి 26 మంది ఉన్నారు. మిగతావారు ఇతరులు. ఈ ఎన్నికల తర్వాత టిడిపి సభ్యులు ఆరుగురు తగ్గి, ఆమేరకు వైసిపి సంఖ్య పెరుగుతుంది. సభకు తెలుగుదేశం సభ్యుడు షరీఫ్ మొహమ్మద్ అహ్మద్ చెయిర్మన్ గా, రెడ్డి సుబ్రహ్మణ్యం డిప్యూటీ ఛెయిర్మన్ గా ఉంటున్నారు. యనమల రామకృష్ణుడు ప్రతిపక్షనాయకుడు.
అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలిసి పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతిన్న తర్వాత కౌన్సిల్‌లో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని, సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేపట్టిందని ఆయన సజ్జల అన్నారు.
ఇపుడు వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడుతున్నారని వ్యాఖ్యానించారు.
‘వచ్చే మే నెల తో వైయస్‌ఆర్‌సీపీకి కౌన్సిల్‌లో మెజార్టీ వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికి జగన్ గారు చేసే చర్యలకు ఉభయ సభలూ మద్దతు ఇస్తాయి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఊపు అందుకుంటాయి,’అని వ్యాఖ్యానించారు.
“వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని పార్టీలో అందరూ గుర్తించారు. అందుకే.. మిగిలిన పార్టీల రాజకీయ సంస్కృతిలో ఉండే ఊహాగానాలు, అసంతృప్తి వైయస్‌ఆర్‌సీపీలో కనిపించవు. ఇది జగన్ నాయకత్వ ప్రతిభకు, సమన్యాయం అందించటంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఉదాహరణగా నిలబడుతుంది.”అని సజ్జల అన్నారు.