(టి.లక్ష్మీనారాయణ)
విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు 2016 జనవరి 1 నుండి 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా యుజిసి నిర్ధారించిన నూతన వేతనాలను చెల్లిస్తూ 2019 ఫిబ్రవరి 13న జీ.ఓ.ఎం.ఎస్. నెం.14ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి, అమలు చేస్తున్నది.
ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు మాత్రం 2021 మార్చి 1 నుండి నూతన వేతనాలను చెల్లిస్తామంటూ జీ.ఓ. నెం. కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా వివక్షత ప్రదర్శించింది.
తద్వారా వైద్య కళాశాలల అధ్యాపకులు 2016 జనవరి 1 నుండి 2021 ఫిబ్రవరి 28 వరకు హక్కుగా రావలసిన వేతన బకాయిలను కోల్పోతున్నారు.
నామ మాత్రంగా ఉన్న వైద్య కళాశాలల అధ్యాపకుల సంఘాల బలహీనతను ఆసరాగా చేసుకొని ఐదు సంవత్సరాల రెండు నెలల వేతన బకాయిలను ఎగ్గొట్టడం ప్రభుత్వానికి తగని పని. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ తరహా వివక్షత అత్యంత గర్హనీయం, చట్ట వ్యతిరేకం.
ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న డాక్టర్లకు జేజేలు పలకండని ప్రధాన మంత్రి మోడీ గారు అందరితో చప్పట్లు కొట్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వారి పట్ల వివక్షత ప్రదర్శిస్తూ, హక్కుగా ఇవ్వాల్సిన వేతన బకాయిలను చెల్లించమని చెప్పకనే చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వివక్షతకు స్వస్తి చెప్పి, ఉత్తర్వులను సవరించి, వైద్య కళాశాలల అధ్యాపకులకు న్యాయబద్ధంగా 2016 జనవరి 1 నుండి చెల్లించాల్సిన వేతన బకాయిలను చెల్లించాలి.
(టి.లక్ష్మీనారాయణ,సామాజిక ఉద్యమకారుడు)