(రాఘవశర్మ)
ఫిబ్రవరి 25వ తేదీ, 2001, గురువారం ఆనారోగ్యంతో అనంతపురంలో కన్ను మూసిన సింగమనేని నారాయణ ప్రసిద్ధ కథారచయిత, నవలాకారుడు, సాహిత్య విమర్శకుడు, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, వామపక్ష భావజాలం ఉన్న వక్త.
అసలు ఇన్ని విశేషణాలెందుకు?
ఒక్క మాటలో చెప్పాలంటే రాయలసీమ రైతాంగం గుండె చప్పుడు. రైతుకుటుంబంలో పుట్టిన నారాయణ తెలుగు పండితుడిగా పల్లెల్లోనే ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడి జీవితాన్ని, గ్రామీణ కుటుంబాలను, వ్యవసాయ సంక్షోభాలను, ముఠాకక్షలను దగ్గరగా పరిశీలించారు.
రాయలసీమలో సేద్యం జూదమైపోయింది.పాతాళానికి వెళ్ళినా నీటి జాడ కనిపించడం లేదు.ఈ స్థితిలో దళారీ వ్యవస్థ అన్నదాతను ఎలా దగా చేస్తోందో సింగమనేని నారాయణ తన కథల్లో సజీవంగా చిత్రించారు.
సమస్యలమయమైన వ్యవసాయమనే వెట్టి నుంచి విముక్తి ప్రసాదించమని వేడుకుంటున్న రైతన్నల నిర్వేదానికి ఆయన అక్షర రూపమిచ్చారు.
అందుచేత అనంతపురం జిల్లాలో ఉండే కరువు, దుర్భిక్షం వారి కథావస్తువుగా తయారైంది. ప్రధానంగా ‘జూదం ‘ ‘ ఊబి ‘ ‘యక్షప్రశ్నలు ‘ ‘ అడుసు ‘ వంటి వారి కథలు రైతుల నిర్వేదాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి.’నీకు నాకు మధ్య నిశీధి ‘ ‘జీవఫలం చేదునిజం ‘ ‘ జూదం ‘ ‘అనంతం ‘ ‘సింగమనేని కథలు ‘ వారి కథా సంపుటాలు.
రైతు ఎక్కడున్నా రైతే.
అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి బాగా దగ్గరగా చూశారు కనుక వారి గురించి దాదాపు పదిహేను కథలు రాశారు. ఆయన ఏరంగం గురించి కథలు రాసినా అందులో రైతులు, వ్యవసాయం అంతర్లీనంగా ఉంటాయి. ‘న్యాయమెక్కడ ‘ అన్న వారి తొలి కథ 1960లో కృష్ణాపత్రికలో అచ్చయింది.
అప్పుడు వారి వయసు 17 సంవత్సరాలు. మళ్ళీ పది సంవత్సరాలు రచనా వ్యాసంగం జోలికి వెళ్ళలేదు. తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో తెలుగు విద్వాన్ చదువుతున్న సమయంలోనే మహాప్రస్థానంతో పరిచయమేర్పడింది.
శ్రీశ్రీ గీతాలు ఆయనను ఆవహించాయి. జీవిత గమ్యాన్ని చూపించి, ఆ దారిలో నడిపించాయి.సామాజిక సాహిత్యదృక్ఫథాలను అర్థం చేసుకోవడానికి పదేళ్ళు అధ్యయనంలో మునిగిపోయారు. అనంతపురం జల్లాలో 1968లో వ్యవసాయ పరిస్థితులను కళ్ళారా చూసి చలించిపోయి ‘జూదం’ అన్న కథ రాశారు.
ఆతరువాత ఆయన దాదాపు యాభై కథల వరకు రాశారు.పాత్రోచితమై పలుకుబడులతో సింగమనేని కథనా శైలి అద్భుతం.
రాయలసీమ అస్తిత్వ స్పృహ ఆయన కథల్లో కనిపిస్తుంది. కథలు జీవితంలోని ఒక పార్వ్శాన్ని, ఒక కోణాన్ని, ఒక అంశాన్ని మాత్రమే చూపిస్తాయి. జీవితంలోని అనేక అంశాలు చెప్పడం కోసం ‘అనుబంధాలు’ ‘ఎడారి గులాబి’ ‘ అనురాగానికి హద్దులు ‘ అనే మూడు నవలలను కూడా రాశారు.
కానీ, అవి మార్క్సిస్టు తాత్విక దృక్పథం ఏర్పడకముందు వచ్చిన రచనలు. రాయలసీమలో యాభై ఏళ్లుగా జరుగుతున్న పరిణామాల్ని ఆధారం చేసుకుని సింగమనేని ఒక నవల రాయాలనుకున్నారు
కానీ, ఆ పని పూర్తి చేయకుండానే ఈలోకం నుంచి నిష్క్రమించారు.
రాయలసీమలో ఆధునిక కథ జి. రామకృష్ణ(1941), కె. సభా(1944)తో ప్రా రంభమైందని చాలా మందిలా తొలుత ఆయన కూడా భావించారు.
కానీ, 1882లోనే రాయలసీమలో కథ ప్రారంభమైందని డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి తన పరిశోధనలో తేల్చడంతో తన పాత అభిప్రాయాలను సవరించుకుని కొత్త ఆవిష్కరణతో సమాధానపడి, సంబరపడిపోయిన సంస్కారి సింగమనేని.
‘సంభాషణ’ ‘ మున్నుడి’ ‘ పరిమితం ‘ వంటి విమర్శనా గ్రంథాలు, ‘ సమయము – సందర్భమూ ‘ వంటి సాహిత్య వ్యాసాలు వామపక్ష ప్రాపంచిక దృక్ఫథం నుంచే రాశారు.’ సమయము – సందర్భమూ ‘ లో రాయలసీమ కథాచిత్రాన్ని కళ్ళముందు నిలిపారు.
చాగంటి, కేతువిశ్వనాథ రెడ్డి, మధురాంతకం రాజారాం కథలు, రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’ , మహీధర రామ్మోహన్‌రావు ‘కొల్లాయిగట్టితే నేమి? ‘ వంటి నవలలపైన చక్కని సమీక్ష చేశారు.
యుద్ధనపూడి సులోచనారాణి ‘కీర్తికిరీటాలు ‘ గురించి రాస్తూ నాలుగు వందల చౌకబారు సినిమాలను జీర్ణించుకుని పుట్టుకొచ్చిన నవల అని వ్యంగోక్తి విసిరారు.
ఏ రచయితకైనా, సాహిత్య కారుడికైనా భావజాలం ఉండితీరాలంటారు సింగమనేని. రచయిత గుర్తించినా, గుర్తించకపోయినా ఏదో ఒక భావజాలం ఉండి తీరుతుందని ఆయన భావన.
వస్తువు, రూపం, దృక్ఫథం ముఖ్యమని, వీటిని బట్టే రచయిత దృక్పథాన్ని అంచనావేస్తామంటారు. ఏ దృక్పథం లేకుండా రచనలు చేయడం వీలు కాదంటారు. రచయిత ఏ భావజాలం లేకుండా ఉండడం సాధ్యం కాదంటారు. సింగమనేని రచనలకే పరిమితం కాలేదు. కార్యాచరణకు కూడా నడుంబిగించారు.
అనంతపురం జిల్లాలో 1999 తరువాత రైతుల పరిస్థతి బాగా దిగజారింది. వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. పెట్టుబడులు పెరిగిపోయాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. సాగు నీరు లేదు.దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు బాగా ఏర్పడ్డాయి.
ప్రపంచీకరణ ప్రభావం అనంతరపురం జిల్లాపైన పడింది. దీంతో ఆ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి.భూమి పెరిగే కొద్దీ అప్పు కూడా పెరిగిపోతోంది.
ఒక్క అనంతపురం జిల్లాలోనే 1999-2003 సంవత్సరాల మధ్య దాదాపు 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరిస్థతిలో రైతులు, రైతు సంఘాలు కలిపి రైతు ఆత్మవిశ్వాస యాత్రను చేపట్టాయి. ఆ సమయంలోనే సింగమనేని చొరవతో ‘ ఒరువు ‘ కవితా సంకలనాన్ని, ‘ఇనుప గజ్జెల తల్లి ‘ అన్న కథాసంకలనాన్ని తెచ్చారు.
రెండు విడతలుగా 70, 80 గ్రామాలలో తిరిగారు. పోరాడాల్సింది ప్రభుత్వంతో కాని, మృత్యువుతో కాదు అని రైతులకు నచ్చ చెప్పారు.
ఆ పద్ధతిలో జిల్లా అంతటా వాల్‌పోస్టార్లు వేసి, కళాకారులతో పాటలు పాడించారు. పట్టణాలలో కూడా కార్యక్రమాలుచేపట్టి అధికారుల ముందు నిరసన తెలిపారు. హంద్రీ-నీవా జలసాధన సమితి ని ఏర్పాటు చేసి సింగమనేని కన్వీనర్‌గా ప్రాజెక్టును సాధించేందుకు కృషి చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్నవారి కటుంబాలకు ఎక్స్‌గ్రేషి ఇప్పించారు. ఫలితంగా అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. ఒక రచయితగా, ఒక ఉపాధ్యాయుడిగానే సింగమనేని ఇవ్వన్నీ చేశారు.
ఏ ఉద్యమమైనా సామాజిక పరిస్థితులను ఆధారం చేసుకుని పుట్టుకు వస్థాయని సింగమనేని అంటారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర అనివార్యత ఉందంటారు. ఆ అనివార్యత వల్లే అక్కడి కవులు, రచయితలు ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో పాలుపంచుకున్నారని అంటారు.
అలాంటి స్థితి కోస్తాంధ్రలో కానీ, రాయలసీమలో కానీ లేదంటారు.ప్రత్యేక తెలంగాణాకు తాము వ్యతిరేకం కాదని రాసిచ్చిన అన్ని రాజకీయ పార్టీలు తెల్లారేసరికల్లా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎలా తీసుకొచ్చారని ప్రశ్నిస్తారు.
సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ప్రతీఘాతుక ఉద్యమం అంటారు. రాజకీయ నాయకుల దోపిడీ స్వభావం నుంచే ఇలాంటి ప్రతీఘాతుక ఉద్యమాలు పుట్టుకు వస్తాయంటారు.అందు చేతనే అక్కడి రచయితలు సమైక్యాంధ్ర ఉద్యమానికి స్పందిచలేదని వ్యాఖ్యానిస్తారు.
“రాయలసీమకు జరిగిన న్యాయం గురించి, ముఖ్యంగా రైతులకు జరిగిన ద్రోహం గురించి చాలాకాలంగా ప్రజాహృదయం క్షోభిస్తూనే ఉంది; ఉద్విగ్నమవుతూనే ఉంది. తమకు జరిగిన అన్యాయం ఏమిటి, అది ఎందుకు జరిగిందో తెలయచెప్పాల్సిన బాధ్యత రాయకీయ నాయకులపైన, మేధావులపైన, ఇంకా చాలామంది పైన ఉందని సింగమనేని డాక్టర్ ఎంవి రమణారెడ్డి విరచిత రాయలసీమ కన్నీటి గాథ కు రాసిన ముందుమాటలో అంటారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదపల్లెలో 1943 జూన్ 23వ తేదీన పుట్టిన సింగమనేని నారాయణ ఉపాధ్యాయుడిగా, రచయితగా ఒక అర్థవంతమైన జీవితాన్ని గడిపారు.
తెల్లని పంచె, తెల్లని షర్టు, తెల్లని జుట్టుతో తెల్లని మీసాల మధ్య ఎప్పడూ చెరగని చిరునవ్వుతో నిర్మలత్వానికి ప్రతీకగా కనించేవారు. ఆ పొడగరి వేదిక ఎక్కి ఉపన్యాసం మొదలు పెట్టారా, శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ఏదో ఒక గీతం ఆయన నోటి వెంట జాలువారాల్సిందే.
మహాప్రస్థానం అంటే చాలు ఆయనకు పూనకమం వచ్చేస్తుంది. అది ఆయనకు కంఠోపాఠం. మహాప్రస్థానం గురించి సాధికారికంగా మాట్లాడగలిగిన కొద్దిమందిలో సింగమనేని ముందుంటారు.ఆయన భాష చాలా పదునుగా, సూటిగా, స్పష్టంగా ఉటుంది.
ఆయన ఉపన్యాసం ఉద్వేగమైతే, కథలు ఆలోచనాత్మకం.
(రాఘవ శర్మ ,జర్నలిస్టు, సాహిత్య విశ్లేషకుడు)