భారత పవర్ గ్రిడ్ మీద చైనా గురి? తొలి సైబర్ ఎటాక్ ముంబైలో జరిగిందా!

భారత్ తో సరిహద్దు తగాదాల్లో ఇరుక్కున్న చైనా, ఇపుడు దేశం మీద సైబర్ దాడులకు సిద్ధమవుతూ ఉందా? అమెరికాకు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ (Recorded Future)అనే సంస్థ  చైనా భారత్ మీద సైబర్ దాడులకు గురి పెట్టిందని,  మొదటి దాడి ముంబై విద్యత్ గ్రిడ్ మీద జరిగిందని పేర్కొంది. దీనిని మీద న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురిచింది.

భారత్ దేశంలోని రెండు కరోనా వ్యాక్సిన్ తయారు చేసే సంస్థల మీద కూడా చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్న హ్యాకింగ్ గ్రూప్ దాడి చేసిన సమాచారం కూడా ఇపుడు బయటపడింది. ప్రపంచం కరోనా వ్యాక్సిన తయారీలో భారత్ ఇపుడు అగ్రభాగాన ఉంది. ప్రపంచమొత్తం మీద తయారువుతున్న మొత్తం వ్యాక్సిన్ కంటే ఇండియాలో 60 శాతం ఎక్కువవ్యాక్సిన్ తయారవుతూ ఉంది. భారత్ నుంచి సమాచారం వ్యాక్సిన్ సమాచారం కొల్లగొట్టేందుకు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)  మీద చైనా గ్రూప్ APT10  ప్రయత్నించిందని సైఫర్మా (Cyfirma) నిపుణులు చెప్పారు.

ముంబై విద్యుత్ సంక్షోభం గుర్తుందా

గత ఏడాది అక్టోబర్ 13న  ముంబైయిలో  కనివిని ఎరుగని రీతిలో కరెంటు పోయింది. విద్యుత్ రైళ్లన్ని ఎక్కడివి అక్కడ పట్టాల మీద ఆగిపోయాయి.ఇది ఉదయం 10 గంటలకు మొదలయింది.ముంబై,ధానే,మావి ముంబై ఏరియాలన్నీ కరెంటు అంతరాయం ఎదుర్కొన్నాయి.  కోవిడ్ 19 వళ్ళ ఇళ్ల నుంచి పని చేస్తున్న లక్షలాది టెకీల లాప్ టాప్ లు అగిపోయాయి.  ముంబై చరిత్రలో ఇంత విస్త్రృతంగా అకారణంగా కరెంటు పోలేదు. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కార్యాలయాలు పనిచేయడం ఆపేశాయి. బ్యాంకుల లావాదేవీలు స్థంభించాయి. స్టాక్ మార్కెట్ కుదేలయింది. ఆసుపత్రుల ఎమర్జన్సీ సర్వీసులన్నీజనరేటర్ల మీద పని చేశాయి. కోవిడ్ సెంటర్లు కూడా చీకట్లోకి జారుకున్నాయి. దాదాపు రెండు కోట్ల మందికి కరెంటు సమస్య తలెత్తింది.

మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. నష్టం వేల కోట్లలో ఉంటుంది. మళ్లీ కరెంటు వచ్చేలా చేసేందుకు  కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండుగంటలు పట్టింది. ముంబై సెంట్రల్ మళ్లీ కరెంటు రావడానికి  పది నుంచి పన్నెండు గంటలు పట్టింది.

ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ గ్రిడ్ విఫలానికి కారణమేమిటో కనుక్కోండని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే విచారణకుఆదేశించారు. విచారణ ఏమయిందో తెలియదు.ఈ విద్యుత్ గ్రిడ్ ఎందుకు ఫెయిలయిందో ప్రజలకు తెలియలేదు. అధికారులకు అంతుబట్టటం లేదు.

ఇలాంటపుడు, హఠాత్తుగా రికార్డెడ్ ఫ్యూచర్ అనేసంస్థ ముందుకు వచ్చి, ఈ గ్రిడ్ ఫెయిల్యూర్ వెనక చైనా హస్తం ఉందని పేర్కొంది. అంతేకాదు, చైనా ప్రభుత్వానికి చెందిన హ్యాకర్స్ గ్రూప్ భారత్  మీద గురి పెట్టిందని, ముంబై పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ వెనక రెడ్ ఎకో (RedEcho)  గ్రూప్ హస్తముందని అనుమానం వ్యక్తం చేసింది. ఇది కేవలం వార్నింగ్ మాత్రమేనని రికార్డెడ్ ఫ్యూచర్ చెబుతూ ఉంది.

ఈ హ్యాకర్స్ మాల్ వేర్  ద్వారా ముంబై పవర్ గ్రిడ్ మీద దాడిచేశారని ఈ  సంస్థ ఒక నివేదిక విడుదలచేసింది.

ఆటోమేటెడ్ నెట్ వర్క్ ట్రాఫిక్ ఎనలిటిక్స్, ఎక్స్ పర్ట్ ఎనాలిసిస్ ద్వారా తాము  రెడ్ ఎకో సైబర్ ఎటాక్ గురించి కూపీ లాగామని ఈ సంస్థ పేర్కొంది.

గాల్వన్ వ్యాలీలో చైనా ,భారత్ సైన్యాల ఘర్షణ తర్వాత నాలుగు నెలలకు అక్కడి నుంచి 1500 మైళ్ల దూరాన ఉన్న ముంబయిలో చైనా ఆక్రోశం ప్రతిధ్వని వినిపించింది. అదే చైనా జరిపిన పవర్ గ్రిడ్ సైబర్ ఎటాక్ అని ది న్యూయార్క్ టైమ్స్ కూడా రికార్డెడ్ ఫ్యూచర్ రిపోర్డు అధారంగా రాసింది.

గాల్వన్ దాడులకు, ముంబైయి విద్యుత్ గ్రిడ్ ఫెయిల్యూర్ కు సంబంధం ఉంటుందని రికార్డెడ్ ఫ్యూచర్ నివేదిక నుంచి అనుమానం వస్తుంది. ఇది భారత్ కు చైనా పంపిన హెచ్చరిక అని, సరిహద్దు వివాదంలో తెగేదాకా తలదూర్చితే భారతదేశమంతా అంధకారంలోకి జారుకుంటుందనే హెచ్చరిక అని ఈ రిపోర్టు హెచ్చరిస్తూ ఉంది.

రెడ్ ఎకో అనే హ్యాకర్స్ గ్రూప్ ఎడ్వాన్సుడ్ సైబర్ ఇంట్రూజన్ టెక్నిక్ ఉపయోగించి భారతదేశంలో విద్యదుత్పాదన, సరఫరాలకు  సంబంధించిన దాదాపు ఒక డజన్ కీలకమయిన ప్రదేశాల్లోకి చొరబడిందని రికార్డెడ్ ఫ్యూచర్  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్టువర్ట్ సాలొమన్ న్యూయార్క్ టైమ్స్ కు చెప్పారు. “… the Chinese state-sponsored group, named RedEcho, has been seen to systematically utilize advanced cyber intrusion techniques to quietly gain a foothold in nearly a dozen critical nodes across the Indian power generation and transmission infrastructure.”

తమకు ఇలాంటి సైబర్ దాడులు జరిపిశక్తి ఉందని, ఆపత్సమయాల్లో దీనిని దీనిని మేము ప్రయోగించగలమని చెప్పేందుకు సిగ్నల్ గా  చైనా ముంబై పవర్ గ్రిడ్ మీద దాడి జరిపిఉండవచ్చని రిటైర్డు మిలిటరీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హూడా న్యూయార్క్ టైమ్స్ కు చెప్పారు. హూడా సైబర్ దాడుల నిపుణుడు.గతంలో ఆయన ఇండియ పాకిస్తాన్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో పని చేశారు.

అక్టోబర్ లో విద్యుత్ గ్రిడ్ ఫెయిలయినపుడు లోడ్ మేనేజ్ మెంట్ మీద చైనీస్ సైబర్ ఎటాక్ దీనికి కారణమయిన ఉంటుందని భారతీయ అధికారులు కూడా  అనుమానించారు. ఉద్దవ్ థాకరే ఎంక్వయిరీ నివేదిక ఇంకా రాలేదు కాటట్టి ప్రస్తుతానికి ఇది ధృవపడాల్సి ఉంది.

ఈ  లోపు రికార్డెడ్ ఫ్యూచర్ నివేదిక విడుదల చేసి సంచలనం సృష్టించింది. భారతీయ నిపుణులు ఇంకా మాల్ వేర్ కోడ్ ను అన్వేషిస్తూ ఉండవచ్చు.

ఈ నివేదికను విడుదల చేసే ముందు తాము భారతశానికిచెందిన సంబంధిత శాఖకు సమాచారం అందించామని  రికార్డెడ్ ఫ్యూచర్ పేర్కొంది.

రికార్డెడ్ ఫ్యూచర్ అనేది అమెరికా మ్యాసచూసెట్స్  నుంచి పని చేసే సంస్త ఇది అంతర్జాతీయంగా జరిగే సైబర్ దాడుల మీద కన్నేసి వుంచుతుంది.

అయితే, చైనా ప్రభుత్వం రికార్డెడ్ ఫ్యూచర్ రిపోర్టు ఖండించింది.  ఇది నిరాధారమయిందని, దురుద్దేశంతో కూడుకున్నదని పేర్కొంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *