బండి సంజయ్ కి TRS దళిత నేతల బహిరంగ లేఖ

తెలంగాణ రాష్ట్రసమితికి  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కొరకరాని కొయ్య అయ్యాడు. ముఖ్యమంత్రి కెసిఆర్ మీద ఇంతవరకు బహిరంగంగా విమర్శలు చేసి నిలబడిన నాయకులు లేరు. అలా చేసిన వాళ్లు తర్వాత రాజకీయాల్లో కనుమరగుయిపోవడమో, లెేదా టిఆర్ ఎస్ లో చేరడమో చేశారు. ఇపుడు బండి సంజయ్ ఈ రెండింటికి అతీతంగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యలును, ప్రభుత్వాన్ని తెగ విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి అవినీతి మీద కూడా వ్యాఖ్యాలు చేశారు. ముఖ్యమంత్రి అరెస్టవుతారని కూడా అన్నారు.  కెసిఆర్ మీద నాలుక పారేసుకుని ఇంతకాలం ఇంకా వార్తల్లో ఉంటడమే సంజయ్ కే చెల్లింది. అందుకే బండి సంజయ్ ని ఎలా అదుపు చేయాలో టిఆర్ ఎస్ కు అర్థం కావడం లేదు.

ఈ రోజు పన్నెండు దళిత ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాస్తూ ‘రానున్న రోజుల్లోప్రజలే తగిన శాస్తి చేస్తారు’ హెచ్చరిక చేశారు.

‘దళితులంటే చెప్పులు కుట్టుకునేవారిగా, మొలలు కొట్టుకునేవారిగా’  బండి సంజయ్ వ్యాఖ్యానించాడని చెబుతూ ఈ పన్నెండు మంది శాసన సభ్యులు కత్తులు నూరుతూ లేఖ రాశారు.

ఇదిగో లేఖ:

నడిమంత్రపు సిరివస్తే.. కన్నూమిన్నూ గానకుండా విర్రవీగినట్టు ప్రవర్తిస్తున్నాడు రాష్ట్రబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సాటి మనుషులనే అవమానిస్తున్నాడు.

ఇప్పటికే తలాతోకలేని మాటలు మాట్లాడే వ్యక్తిగా సమాజంలో ముద్రపడ్డ బండి సంజయ్ మరోసారి దళితుల పట్ల అమానుషపు వ్యాఖ్యలు చేశాడు.

బండి సంజయ్ కు దళితులంటే చెప్పులు కుట్టుకునే వారుగా, మొలలు కొట్టుకునే వారుగా కనపడుతున్నారు. తన బీజేపీ పార్టీ ఆలోచన విధానాలకు ఇది అద్దం పడుతోంది. భారతీయ జనతాపార్టీ విధానాలు బూజు పట్టిన సనాతన ఆలోచనలకూ, అంటరానితనానికి, దళితుల అణిచివేతకు అద్దం పట్టేవి అని బండి సంజయ్ తన వ్యాఖ్యల ద్వారా మరోసారి రుజువు చేసాడు.

దళితులకు చెప్పులు కుట్టడమే కాదు, మొలలు కొట్టడం కూడా వచ్చు అని వ్యాఖ్యానించడం ద్వారా.. ఈ ఆధునికయుగంలో కూడా దళితుల స్థితిగతులు ఇంకా అలాగే ఉండాలని సంజయ్ కోరుకుంటున్నట్లు సుస్పష్టమవుతున్నది.

దళితులు ఇంకా చెప్పులు కుట్టుకొనే బతకాలని కోరుకోవడం దుర్మార్గం.
తరతరాలుగా అంటరానితనానికి అణిచివేతకు గురై విద్యకు దూరమైన దళితులకు.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వారికి హక్కులు కల్పించి.. విద్య, ఉద్యాగాలలో అవకాశాలు దక్కేలా చూశారు.

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన అవకాశాలతో.. దళితులు అన్ని రంగాలలో అందరితో పోటీ పడి.. ఉన్నత స్థానాలకు ఎదుగుతుంటే.. బండి సంజయ్ కి మింగుడుపడటంలేదు. అందుకే దళితులంటే చెప్పులు కుట్టుకునే వారు గా మొలలు కొట్టుకునే వారుగానే కనపడుతున్నట్లుంది.

బండి సంజయ్ ఆ సనాతన బూజుపట్టిన ఆలోచనల నుండి బయటపడి.. దళితులంటే అందరితో సమానంగా అన్ని రంగాలలో పోటీపడుతున్నవారిగా గుర్తిస్తే మంచిది. లేదంటే బండి సంజయ్ jr బీజేపీ పార్టీకి  ప్రజలే మొలలు కొడతారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు.. దళిత పిల్లలు ఉన్నత చదువులు చదవాలని వారు ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. వందలాది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. వాటిలో చదువుకున్న, చదువుతున్న పిల్లలు అందరితో పోటీపడి టాప్ రాంకర్లుగా నిలుస్తున్నారు. ఉన్నతచదువుల్లో ఓపెన్ కేటగిరిలో కూడా సీట్లు పొందుతున్నారు. ఎవరెస్టు శిఖరాలను అధిరోహించి శభాష్ అనిపించుకుంటున్నరు. ఐఐటీ, ఐఐఎం, నిట్, మెడిసిన్ లలో ర్యాంకులు సాధించడంతో పాటు.. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలలో సీట్లు సంపాదించి గోల్డ్ మెడల్స్ సాధించారు, సాధిస్తున్నారు. తెలంగాణ ఖ్యాతిని యావత్ దేశానికి, ప్రపంచానికి సగర్వంగా చాటుతున్నారు.

సీఎం కేసీఆర్ సర్కారు.. తెలంగాణ గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపైన సంవత్సరానికి లక్షా 20 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నది. గురుకుల విద్యాసంస్థల్లో ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, కోడింగ్ అకాడమీ, సైనిక్ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్ ప్రారంభించింది. గురుకులాల్లోని విద్యార్థులు చదువుల్లోనే కాదు.. క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ జట్టులోనూ చోటు సంపాదిస్తున్నారు. జాతీయ స్థాయిలో పలుక్రీడల్లో పెద్దఎత్తున మెడల్స్ సాధిస్తున్నారు. భవిష్యత్ తెలంగాణకు, యావత్ దేశానికి.. అణిముత్యాల్లాంటి, వజ్రాల్లాంటి వనరులుగా రుపుదిద్దుకుంటున్నారు.

కానీ, ఇదంతా బూజుపట్టిన సంస్కృతి వివక్ష కళ్లద్దాలను తొడుక్కున్న బీజేపీకి కానరావట్లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దురహంకారంతో.. ఒళ్లూపెయ్యి తెలియకుండా విషపు మాటలు వాగుడుతున్నడు. ఇందుకు తాజా ఉదాహరణ బండి సంజయ్ దుర్మార్గపు వ్యాఖ్యలే. దళితులంటే చెప్పులు మొలలు గుర్తుకు రావడం .. బండి సంజయ్ దురహంకార పోకడకు నిదర్శనం. ఇందుకు తగిన మూల్యం తప్పదు. బండి సంజయ్, బీజేపీకి.. రానున్న రోజుల్లోప్రజలే తగిన శాస్తి చేస్తారు.

లేఖ విడుదల చేసిన ఎమ్మెల్యేలు

• బాల్క సుమన్, ప్రభుత్వ విప్
• గువ్వల బాలరాజ్, ప్రభుత్వ విప్
• ఎంఎస్ ప్రభాకర్, ప్రభుత్వ విప్
• రసమయి బాలకిషన్ , శాసన సభ్యులు
• గాదరి కిశోర్, శాసన సభ్యులు
• కాలె యాదయ్య , శాసన సభ్యులు
• ఆరూరి రమేష్, శాసన సభ్యులు
• క్రాంతి కిరణ్ , శాసన సభ్యులు
• చిరుమర్తి లింగయ్య, శాసన సభ్యులు
• రాజేశ్వర్ , శాసన మండలి సభ్యులు
• సుంకె రవిశంకర్ , శాసన సభ్యులు
• దుర్గం చిన్నయ్య, శాసన సభ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *