50 సంవత్సరాలైనా ‘ఆనంద్ ’ సినిమా ఇంకా ఎందుకు గుర్తుంది?

‘జిందగీ బడీ హోనీ చాహియే…లంబీ నై’ : అదే ఆనంద్ సినిమా

(సిఎల్ సలీమ్ బాష)
ఆనంద్(1971) సినిమా గురించి రాయడం అంటే, జీవితం గురించి రాయడం, Romanticism (కాల్పనికవాదం) గురించి రాయడం, కొంత వరకు నా గురించి, నాలాంటి వాళ్ల గురించి రాయడం కూడా ! ఆనంద్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే (కొంచెం కష్టమైనా సరే) ‘జిందగీ బడీ హోనీ చాహియే…లంబీ నై’ (zindagi badi honi chahiye… lambi nahi ). దీన్ని తెలుగులో సరిగ్గా అనువాదం చేయలేం. దానికి దగ్గరగా చెప్పాలంటే ” ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం”. ఇంగ్లీషులో అయితే ఇది కొంచెం దగ్గరగా వస్తుంది “It is not the years in your life that count but how much life was there in those years definitely counts!”
దీనికి కొంత దగ్గరగా ఉన్న రెండు కొటేషన్స్ ఈ సందర్భంగా ప్రస్తావించడం, ఆనందం సినిమా గురించి కొంత వరకు వివరించినట్లే అనుకుంటున్నా.
1.“ Live as if you are going to die tomorrow and earn knowledge as if you are going to live for hundred years!” – Mahatma Gandhi
2. “ఒక పువ్వుని చూస్తూ వందేళ్లు బతకగలను”- గుంటూరు శేషేంద్ర శర్మ
ఆనంద్ సినిమా రివ్యూ నేను రాసి ఉంటే బాగుండు అని అప్పుడప్పుడు అనుకుంటాను. కానీ ఎలా కుదురుతుంది 1971 లో నాకు 12 ఏళ్లు. అప్పుడు నేను మా మామయ్య తో కలిసి సినిమా చూసినట్లు గుర్తు. కానీ ఎక్కువ అర్థం కాలేదు. మళ్ళీ ఏడేళ్ల తర్వాత అనుకుంటా ఆ సినిమా చూశాను. చూస్తూనే ఉన్నాను. ఆనంద్ టీవీలో ఎప్పుడొచ్చినా మిస్ కాను. మిస్ అయితే నా దగ్గరున్న డి వి డి లో చూస్తాను. నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఇదే! అందుకే ఆనంద్ సినిమా గురించి ఇప్పుడు రాస్తున్నాను.
ఆనంద్ సినిమా చూసిన వాళ్లకి ఎవరికైనా కళ్ళల్లో కాసింత తడి రాకపోయినా, గుండెల్లో మూల ఏదో గుబులు అనిపించకపోయినా, వాళ్లకు ఏదో సమస్య ఉన్నట్లే. వాళ్లు కళ్ల డాక్టర్ దగ్గరికో, గుండె డాక్టర్ దగ్గరికో పోవాల్సిన అవసరం లేదు. సినిమా మరో సారి చూస్తే చాలు.
ఆనంద్ సినిమా గురించి చర్చించే ముందు ఆ సినిమా గురించిన విశేషాలు చూద్దాం. ఆనంద్ సినిమా కథ వెనక కొన్ని కథలున్నాయి. హృషికేశ్ ముఖర్జీ కి రాజ్ కపూర్ కి మధ్య చక్కటి అనుబంధం ఉండేది. రాజ్ కపూర్ రిషికేశ్ ముఖర్జీని ” బాబు మషాయ్” అని సరదాగా పిలిచేవాడు. దాన్నే రిషికేశ్ ముఖర్జీ ఆనంద్ సినిమా లో పెట్టాడు. రాజేష్ ఖన్నా, అమితాబ్ ను సినిమాలో తరచూ “బాబు మషాయ్”(Mister) అని సంబోధిస్తూ ఉంటాడు. ఒకసారి రాజ్ కపూర్ తీవ్రమైన వ్యాధి బారిన పడ్డాడు. రిషికేశ్ ముఖర్జీ రాజ్ కపూర్ చనిపోతాడు ఏమోనని భయపడినప్పుడు ఈ కథ రాసుకున్నాడు. అయితే రాజ్ కపూర్ చనిపోలేదు, అది వేరే విషయం. ఇది ఒక కథ. ఈ సినిమాకు మొదట ఆనంద్ పాత్రకు కిషోర్ కుమార్ ను, డాక్టర్ బెనర్జీ పాత్రకు ప్రముఖ హాస్యనటుడు మహమూద్ ను అనుకున్నారు. అయితే కిషోర్ కుమార్ హృషికేశ్ ముఖర్జీ కు గేట్ కీపర్ లోపలికి వెళ్ళనివ్వలెదు. దాంతో కోపం వచ్చిన హృషికేశ్ ముఖర్జీ ఆ పాత్రకు రాజేష్ ఖన్నాను తీసుకున్నాడు. దరిమిలా మహమూద్ కూడా సినిమాలో నుంచి తప్పుకున్నాడు. దాంతో డాక్టర్ బెనర్జీ పాత్ర అమితాబ్ కు దక్కింది. ఇది మరో కథ. రాజేష్ ఖన్నా కిషోర్ కుమార్ జోడి అప్పటికే చాలా పాపులర్, కానీ ఈ సినిమాలో కిషోర్ కుమార్ ఒక్క పాట కూడా పాడలేదు! సంగీత దర్శకుడు సలీల్ చౌదరి ఆనంద్ పాత్రకు గంభీరమైన, ప్రశాంత విషాదకరమైన గొంతు అవసరం కనక ముఖేష్ పాడితే బాగుంటుంది అని భావించడం వల్ల కిషోర్ కు అవకాశం దక్కలేదు. రాజేష్ ఖన్నా కూడా ముఖేష్ పాడడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో ముకేశ్ పాడిన “కహిన్ దూర్ జబ్ దిన్ ఢల్ జాయె” పాట రాజేష్ ఖన్నాకు ఇష్టమైన పాటగా మారి పోవడం విశేషం.
ఆనంద్ సినిమా 1971 సంవత్సరపు జాతీయ ఉత్తమ హిందీ చిత్రం గా అవార్డు పొందింది. అంతేకాదు 1972 ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఎనిమిది నామినేషన్లు పొంది, ఆరు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథ, ఉత్తమ డైలాగులు(గుల్జార్), ఉత్తమ నటుడు(రాజేష్ కన్నా), ఉత్తమ సహాయనటుడు (అమితాబ్), ఉత్తమ ఎడిటింగ్(హృషికేశ్ ముఖర్జీ).
అంతేకాదు1971 లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమా ప్రజలకు నచ్చడమే కాకుండా, కమర్షియల్ సక్సెస్ గా కూడా నిలిచింది. అమితాబచ్చన్ కు ఇది మొట్ట మొదటి హిట్ సినిమా. ఈ సినిమా తర్వాత అమితాబ్ రాజేష్ ఖన్నా 1974 లో మళ్లీ హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలోనే “నమక్ హరాం” సినిమాలో నటించారు.
వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా లు ఈ రెండే! నమక్ హరాం సినిమా లో కూడా లో రాజేష్ ఖన్నా చనిపోతాడు. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమా కి కూడా అమితాబ్ బచ్చన్ కి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డు రావడం!
ఈ సినిమా గురించి ఇంకో విశేషం ఉంది. అమితాబచ్చన్ ఈ సినిమా రిలీజ్ రోజు ఉదయం కారులో పెట్రోల్ పోయించడానికి ఒక పెట్రోల్ పంప్ కి వెళ్ళాడు. అక్కడ ఎవరు గుర్తుపట్టలేదు. మళ్లీ సాయంత్రం అదే పెట్రోల్ బంకు కి వెళ్లగా అందరు గుర్తుపట్టడం ప్రారంభించారు. ఈ విషయం అమితాబ్ స్వయంగా ట్విట్టర్లో ధ్రువీకరించాడు.
ఇక ఆనంద్ సినిమా కథ ఒక ముక్కలో చెప్పవచ్చు. ” లింఫోసర్కోమా” అనే అరుదైన(సినిమా కూడా అరుదైనదే!) క్యాన్సర్ తో ఉన్న ఆనంద్(రాజేష్ ఖన్నా) జీవితం”. క్యాన్సర్ కాబట్టి ఆనంద్ చనిపోతాడని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బతికి ఉన్నంత సేపు ఎలా బతికాడు, ఎలా బతకాలని చెప్పాడు అన్నదే సినిమా మొత్తం సారాంశం.
ఈ సినిమా కథ సాధారణమైనదే అయినా, దర్శకుడితో సహా, ఈ సినిమాకు పని చేసిన మహామహులు దీన్ని ఒక శిఖరం పై నిలబెట్టారు. రిషికేశ్ ముఖర్జీ చాలా ప్రేమగా రాసుకున్న ఈ కథను అంతే ప్యాషన్ తో తీయడం వల్ల ఇది ఒక గొప్ప సినిమాగా నిలబడింది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ముఖ్య పాత్ర వహిస్తుంది. దీన్ని రిషికేశ్ ముఖర్జీ తో కలిసి, గుల్జార్, డీ.ఎన్. ముఖర్జీ, బిమల్ దత్త రాశారు. ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా తీసేయడానికి వీల్లేని విధంగా ఉండడానికి కారణం పకడ్బందీ స్క్రీన్ ప్లే నే! భారత సినిమా చరిత్రలో ఈ సినిమా స్క్రీన్ ప్లే ఒక రిఫరెన్స్ గా నిలిచిపోయింది.
ఈ సినిమాలో కొన్ని సీన్లు కళ్ళను తడిపితే, మరి కొన్ని సీన్లు గుండెను తడుముతాయి. దానికి కారణం స్క్రీన్ ప్లే, డైలాగులు, నటీనటులు, దర్శకుడే స్వయంగా చేసిన ఎడిటింగ్!
ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన సలీల్ చౌదరి, అంతకుముందు రాజేష్ ఖన్నా నటించిన ఇత్తేఫాక్ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. హిందీలో అప్పటికి అంత పెద్దగా గుర్తింపు పొందలేదు. విశేషమేమంటే అంతకుముందు” మధుమతి” (1958) సినిమాకు చక్కటి సంగీతం అందించి ఫిలిం ఫేర్ అవార్డు కూడా పొంది ఉన్నాడు. రిషికేశ్ ముఖర్జీ ఆనంద్ సినిమాతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. తర్వాత రజనీగంధ, మౌసం, చోటిసీ బాత్ వంటి సినిమాల్లో జనరంజకమైన పాటలు స్వరపరిచాడు. 1974లో వచ్చిన తెలుగు చిత్రం ” చైర్మన్ చలమయ్య ” కు సంగీతం దర్శకత్వం వహించడం విశేషం! ఆనంద్ సినిమాలో చౌదరి అందించిన 5 ఆణిముత్యాలు ఒకదానికొకటి మించి ఉంటాయి. ముఖేష్ పాడిన ” మైనే తేరే లియే” పాట అయినా సరే, మన్నాడే పాడిన ” జిందగీ కైసి హై పహేలి” అయినా, లతా మంగేష్కర్ పాడిన ” నా జియా లాగేనా” పాట అయినా ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి రిషికేశ్ ముఖర్జీ లతా మంగేష్కర్ ని ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించమని అడిగితే, ఆమె సున్నితంగా తిరస్కరించి కేవలం పాటలు మాత్రమే పాడతాను అని చెప్పడం విశేషం!
ఈ సినిమాకు పాటలు రాసింది ప్రముఖ కవి గుల్జార్(2), ప్రముఖ పాటల రచయిత యోగేష్(3). ఆనంద్ సినిమాలో కథను బట్టి చాలా కప్పు చక్కటి పాటలు రాశారు అని చెప్పొచ్చు. గుల్జార్ ఈ సినిమాకు మాటలు కూడా రాశాడు. పాటలతో పాటు అమితాబ్ చెప్పిన ” మౌత్ ఏ కవితా హై”( ” మృత్యువు ఒక కవిత”) అన్న వచనం కూడా గుల్జార్ కలం నుంచి జాలువారింది. అమితాబ్ తో పాటు ఆ సీన్ లో రాజేష్ కన్నా కూడా ఒక ముఖ్యమైన వచనం చదువుతాడు. ఆ సీన్ సినిమా కు చాలా చాలా ముఖ్యమైనది. దర్శకుడి ప్రతిభ ఇక్కడ కనిపిస్తుంది.
ఈ సినిమాకు డైలాగులు రాసిన గుల్జార్ ప్రముఖ కవి. పాటల రచయిత శైలేంద్ర, దర్శకుడు బిమల్ రాయ్ ప్రోత్సాహంతో మొదటిసారి బందిని(1963) సినిమా కోసం ఒక పాట రాశాడు. తర్వాత రిషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ” ఆశీర్వాద్ ” సినిమాకు పాటలతో పాటు మాటలు కూడా రాశాడు. ఆ సినిమాలో గుల్జార్ పాటలకు మాటలకు కవితలకు మంచి పేరు వచ్చింది. అలా మొదలైంది గుల్జార్ సినీ జీవితం.
ఆనంద్ సినిమాకు మాటలే బలం. ఒక్కో పాత్ర కు రాసిన ప్రతి డైలాగు సినిమా నేపథ్యానికి, పాత్ర వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. రాజేష్ ఖన్నా చెప్పిన ఒక ఫిలసాఫికల్ డైలాగ్ గుల్జార్ ప్రతిభకు నిదర్శనం. దాన్ని ఈ వీడియోలో చూడొచ్చు .
ఈ ఒక్క నిమిషం సన్నివేశం సినిమాలో దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడో చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ ఒక్క సన్నివేశం ద్వారా అమితాబ్, రాజేష్ ఖన్నా ల నటన చూసి తీరాలి. వారి పాత్రల వ్యక్తిత్వం కూడా ఈ సన్నివేశం ద్వారా స్పష్టం అవుతుంది రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ కు, తన ఫ్రెండ్ అయిన డాక్టర్ కు జీవితం గురించి, చావు గురించి చక్కగా చెప్పే సన్నివేశం ఇది. రాజేష్ ఖన్నా అమితాబచ్చన్ నాడీ చూసి ” నీ జీవితం ఇంకో 70 సంవత్సరాలు మాత్రమే!(అప్పటికీ అమితాబ్ వయసు 30 సంవత్సరాలు). ఆరు నెలలకి 70 సంవత్సరాల కి ఏం తేడా ఉంది? చావు ఒక్క క్షణం మాత్రమే! ఈ ఆరు నెలల్లో కొన్ని లక్షల క్షణాలు నేను జీవించబోతున్నాను. వాటి సంగతి ఏంటి? బాబు మషాయ్.. జిందగీ బడీ హోనా చాహియే…లంబీ నై. బతికున్నంత వరకు నేను నేను చచ్చిపోను. చచ్చాక నేను ఉండను” చివరి మాటలు “చావంటే నాకు భయం లేదు. నేను ఉన్నంత వరకు అది నా దగ్గరికి రాదు. అది వచ్చాక ఎలాగూ నేను ఉండను” అని ఆత్రేయ చెప్పిన మాటలను గుర్తు చేస్తాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, రాజేష్ ఖన్నా అమితాబ్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటించారు. మరో ఆరు నెలలు చనిపోతానని తెలిసినా ఆరు నెలలు సంతోషంగా బతకడానికి నిర్ణయించుకొని అదేవిధంగా తన చిలిపి పనులతో ఇతరులను ప్రభావితం చేసిన ఆనంద్ పాత్రలో రాజేష్ ఖన్నా జీవించాడు. ఆనంద్ చేష్టలతో మొదట్లో కోప్పడి తర్వాత ఆనంద్ కి దగ్గరై, క్యాన్సర్ తో చచ్చిపో బోతున్న మిత్రుడిని కాపాడుకో లేక పోతున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ బెనర్జీ పాత్రలో అమితాబ్ నటన చూసి తీరాలి. ముఖ్యంగా చివరి సన్నివేశంలో ఆనంద్ చనిపోయినప్పుడు అమితాబ్ నటన తారా స్థాయిలో ఉంది.
అలాగే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన డాక్టర్ ప్రకాష్ కులకర్ణి పాత్రలో రమేష్ డియో, ఆయన భార్య సుమన్ కులకర్ణి డియోపాత్రలో సీమ డియో తగిన న్యాయం చేశారు. కమెడియన్ జానీ వాకర్ చిన్న పాత్రే అయినా, ఆకట్టుకుంటాడు. అలాగే హాస్పిటల్ matron పాత్రలో లలితా పవార్ తమ వంతు పాత్రను సమర్ధవంతంగా పోషించారు.
ఆనంద్ సినిమా డాక్టర్ బెనర్జీ (అమితాబ్) పుస్తకావిష్కరణ తో మొదలవుతుంది. అమితాబ్ ఆనంద్ గురించి చెప్పడమే ఈ సినిమా కథ. చివర్లో ” ఆనంద్ మరా నహి.. అనంద్ మర్తే నహి” దీన్ని తెలుగులో చెప్పాలంటే ” ఆనంద్ చావలేదు. ఆనంద్ లకు చావు లేదు”.
నిజమే! “ఆనంద్” సినిమాకు కూడా చావు లేదు. 50 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పటి కూడా ప్రేక్షకులు మర్చిపోలేదు. మర్చిపోలేరు కూడా ! ఇంకో యాభై ఏళ్లయినా అంతే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *