టివి చర్చల్లో నోరు అదుపులో పెట్టుకోవాలి: టి లక్ష్మినారాయణ

(టి లక్ష్మినారాయణ)

1. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో నేనూ భాగస్వామినే. టీ.వి. చర్చల్లో పాల్గొంటుంటాను. అనేక అనుభవాలు ఉన్నాయి. ఆ నేపథ్యంతోనే నిన్న ఎ.బి.ఎన్. చర్చలో చోటు చేసుకొన్న అవాంఛనీయమైన ఘటనపై నా స్పందనను తెలియజేస్తున్నాను.

2. నాలుక పదునైన కత్తిలాంటిది. “నాలుకలోనే ఉన్నాయి లాభ నష్టాలు” అన్న నానుడి కూడా ప్రాచుర్యంలో ఉన్నది. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, విజ్ఞానాన్ని, ఆలోచనలను, అభిప్రాయాలను, మనోభావాలను మాట ప్రతిబింబిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలంటుంటారు. నోరు అదుపులో పెట్టుకొంటే మనకు, సమాజానికి కూడా మేలు చేకూరుతుంది.

3. ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరిచే, అవమానించే హక్కు మరొకరికి లేదు. ఒక లక్ష్య సాధన కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఒక ఉద్యమకారుడిని లేదా ఉద్యమకారులను తూలనాడితే, దూషిస్తే సహజంగానే మనసులు గాయపడతాయి. అందులోను ముఖాముఖిగా వాదప్రతివాదనలకు తలపడిన సందర్భంలో ఒకరు, మరొకరిని తేలిక భావంతో తూలనాడితే ఆ సమయంలో క్షణికావేశానికి లోనౌతుంటారు. అలాంటి హద్దులు మీరిన ఉదంతాన్ని నిన్న ఎ.బి.ఎన్. చర్చాకార్యక్రమంలో వీక్షించాను. “నాలుకను, చేతులను విజ్ఞతతో వినియోగించుకోకపోతే అనర్థమే!” అని వ్యాఖ్యానిస్తూ ఫేస్ బుక్, వాట్సాప్ లో ఒక పోస్టు కూడా పెట్టాను.

4. ప్రజాస్వామ్య స్ఫూర్తితో, విస్తృత ప్రజాప్రయోజనాలు, వాస్తవాల ప్రాతిపదికన, వాదనాపటిమతో సమాజాన్ని మెప్పించాలి, గెలవాలి. ఒక్కొక్కసారి న్యాయం ఓడిపోవచ్చు. దుష్టరాజకీయ శక్తులు, దోపిడీ శక్తులే పైచేయి సాధించవచ్చు. లోపభూయిష్టమైన వ్యవస్థకు అదొక ప్రబల నిదర్శనం. అయినా, అంకితభావంతో మార్పు కోసం ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండాలి. దుర్నీతి ఎల్లకాలం రాజ్యమేల లేదు. అవాకులు, చవాకులు, దుర్భాషలాడే వారు చరిత్రహీనుల జాబితాలో చేరిపోక తప్పదు.

5. సంకల్పబలంతో పోరాడుతున్న ఉద్యమకారుల మనోస్థైర్యాన్ని దెబ్బగొట్టడానికి ప్రత్యర్థులు ప్రయోగించే నాసిరకమైన పదజాలాన్ని, కుసంస్కారంతో చేసే వ్యాఖ్యలను సభ్యసమాజమే అసహ్యించుకొంటుంది, తిరస్కరిస్తుంది.

6. రాష్ట్ర భవిష్యత్తును ధ్వంసం చేస్తూ, రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులను వీధులపాలు చేసి, రాక్షతత్వంతో పాలన సాగిస్తున్న ప్రభుత్వ దుర్నీతికి ఎదురొడ్డి నిలిచి, ఆటుపోట్లు ఎదురైనా సంకల్పబలంతో అమరావతి రాజధాని పరిరక్షణ కోసం 435 రోజులుగా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే సమర్థించి, భాగస్వాములు కాకపోతే పోయారు, కనీసం గౌరవించాలి. ఒకవేళ వ్యతిరేకించాలంటే వ్యతిరేకించవచ్చు. అదొక ప్రజాస్వామ్య హక్కు. తప్పు లేదు. అంతే కానీ, “పెయిడ్ ఆర్టిస్టులు” అంటూ అవమానించడం అత్యంత హేయమైన చర్య.

7. ఉద్యమకారుల మనోస్థైర్యాన్ని నిర్వీర్యం చేయాలన్న దుర్భుద్దితో నోరుపారేసుకోవడం కుసంస్కారానికి నిదర్శనం. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఉద్యమకారులకు ధర్మాగ్రహం రావడం సహజం.

8. రాష్ట్ర భవిష్యత్తు కోసం, న్యాయం పక్షాన నికార్సుగా నిలబడి ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులను కించపరిస్తే సహజంగానే రక్తం ఉడికిపోతుంది. నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తుంటే ఆవేశం కట్టలు తెంచుకొంటుంది. ఒక్కొక్కసారి సహనం కోల్పోవడం జరిగుతుంది. కానీ, విసక్షణకోల్పోయి భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత గర్హనీయమైనది.

9. ఆవేశం హద్దులు దాటితే ప్రత్యర్థులు దాన్ని అవకాశంగా మలుచుకొంటారు. నాణ్యమైన, పదునైన పదజాలంతో, శక్తివంతమైన గళంతో ఉద్యమకారులపైన, ఉద్యమంపైన విషం వెళ్ళగక్కే వారి నోళ్ళు మూయించాలి. చేతులకు పని చెప్పడం ద్వారా ప్రత్యర్థులు చేసిన నీచమైన వ్యాఖ్యల తీవ్రత తగ్గే అవకాశం ఉంది.

10. ఉద్యమకారుల గళం, సమిష్టి శక్తి ముందు రాజకీయ కుట్రలు, కుతంత్రాలు అంతిమంగా పరాజయం పొందక తప్పదు.

(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *