2018 పద్మ అవార్డు గ్రహీతలను ఒకసారి గమనించారా? ఆ ఏడాది రాష్ట్రపతి నుంచి పదశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్న వారిలో గొప్ప సంగీత విద్వాంసులు, చరిత్రకారులు, అంతర్జాతీయ క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, సంఘసేవకులు ఉన్నారు. ఇదేమంత విశేషం కాదు.
ప్రతియేట ఆయా రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ గుర్తింపు వస్తూనే ఉంటుంది.
అయితే, ఇంతవరకు ఎపుడూ గుర్తింపుకు నోచుకోని ఒక రంగానికి ఆ యేడాది గుర్తింపు వచ్చింది. ప్రాణం పోసేదే అయినా గౌరవం లేని వృత్తి అంది. కేవలం చదువురాని మహిళల చేతి మీదుగా తరతరాలుగా సంక్రమిస్తున్న వృత్తి. ఆ రంగమే పురుడు పోయడం.
పురుడు పోసి కొన్ని వేల మంది మహిళలను ఆదుకున్నందుకు చదువురాని ఒక మంత్రసానికి ఆ యేడాది పద్మశ్రీ అవార్డు లభించింది. ఆమె పేరు సూలగిత్తి నరసమ్మ. కర్నాటక టుమ్కూర్ జిల్లా పావగడ ఆమె సొంతవూరు. మరొక విశేషమేమంటే, ఆమెది తెలుగు కుటుంబం. మాతృభాష తెలుగు.
మరొక విశేషమేమింటే, పురుడు పోయడంలో ఆమె నైపుణ్యాన్ని, సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఆమె సేవలను గురించి టుమ్ కూరు విశ్వవిద్యాలయం 2014లో గౌరవ డాక్టొరేట్ సత్కరించింది.
అకడమిక్ కొలబద్దకు అందని ఒక రంగాన్ని ఒక యూనివర్శిటీ గుర్తించడం, ఆ రంగంలో అక్షరం ముక్క రాని ఒక మహిళని విశేషవ్యక్తిగా గుర్తించడం గౌరవ డాక్టొరేట్ అందించడం భారతీయ యూనివర్శిటీలో చరిత్రలో తొలిసారి కావచ్చు. ఈ విషయంలో టుమ్ కూర్ విశ్వవిద్యాలయాన్ని అభినందించాల్సిందే.
ఆసుపత్రి కాన్పులంటేనే తెలియని రోజులలో సరసమ్మ గ్రామీణ ప్రాంతాలలో ఉచితంగా పురుడు సేవలందిస్తూ వచ్చారు. ఆ ప్రాంతంలో కాన్పు గురొచ్చే పేరు నరసమ్మయే. కులాలకు, మతాలకు, పేద ధనిక వర్గాలనే తేడాలేకుండా ఆమె ఎపుడో స్వాతంత్య్రం రాని రోజుల్లో , జిల్లాకొక ఆసుపత్రి కూడా లేని రోజులలో ఆమె వేలాది పిల్ల పుట్టుకకు దోసిలి పట్టారు.
సుమారు 70 సంవత్సరాల పాటు ఆమె 15,000 మందికి పురుడు పోశారు. ఆమె చేసిన కాన్పులు వికటించిన దాఖలా లేదు. శిశువు తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు, సుఖప్రసవమా, ప్రసవం సమస్యగా మారుతుందా. ఆపరేషన్ అవసరమా వంటి విషయాలు ఖచ్చితంగా గుర్తిస్తుందని చెబతారు. ఆమె నేర్పరి తనానికి గైనకాలజిస్టులు అబ్బురపడేవారు.
ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి పంపేది.
సూలగిత్తి అంటే కన్నడ భాషలో మంత్రసాని అని అర్ధం. మంత్రసాని నరసమ్మ అని ప్రజలు పిలిచే వారు. ఇదే చివరకు ఇంటి కన్నడలో ఇంటిగా పేరుగా మారి సూలగిత్తి నరసమ్మగా అయింది.
నరసమ్మ పావగడ సమీపంలోని కృష్ణ పురలో ఒక తెలుగు కుటుంబంలో 1920లో జన్మించింది. వారికుటుంబం సంచార జీవనం చేసేది. ఆరోజుల్లో చదువు అబ్బే అవకాశమే లేదు. 12వ యేట ఆమెకు అంజనప్పతో వివాహమయింది. ఆమెకు పన్నెండు పిలల్లున్నారు. 97 సంవత్సరాల జీవిత కాలంలో 36 మంది మనవళ్లు, మునివళ్లని చూశారు.
తన ఇరవై అనుకోకుండా ఒక పురుడుకి అమ్మమ్మకి ఆమె సహాయకురాలిగా పనిచేసింది. పురుడుపోసింది సొంత అత్తకే. నరసమ్మ అయిదు పిల్లకు అమ్మమ్మే పురుడుపోసింది. అట్లా ఆమె అమ్మమ్మదగ్గిర నుంచి మంత్రసాని విద్య నేర్చుకుంది.అప్పటి నుంచి చనిపోయే వరకు ఆమె ఈ వృత్తి మానలేదు. దీనిని సేవగానే కొనసాగించి తప్ప ధనార్జన కోసం చేయలేదు.
ఆమె మంత్రసాని సేవలకు ఎంత గుర్తింపు వచ్చిందో. 2012లో కర్నాటక ప్రభుత్వం దేవరాజ్ అర్స్ అవార్డు లభించింది. 2013 లో కిట్టురాణి చెన్నమ్మ అవార్డు లభించింది. 2013లో కర్నాటక రాజ్యోత్సవ అవార్డు లభించింది. అదే సంవత్సరం ఆమెకు నేషనల్ సిటిజన్ అవార్డు లభించింది. 2104లో ఆమె టుమ్ కూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టొరేట్ (మన తెలుగులో కళాప్రపూర్ణ) పురష్కారం లభించింది. 2018లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ పురష్కారం అందుకున్నారు.
నరసమ్మ దగ్గిర శిక్షన పొందిన 180 మంది మంత్రసానులు టుమ్ కూరు ప్రాంతంలో ఇప్పటికీ సేవలందిస్తున్నారు.
అదేసంవత్సరం డిసంబర్ 25న తన 98వ యేట ఆమె మరణించారు. డిసెంబర్ 26న టుమ్ కూరు పట్టణం సమీపంలోని గంగసముద్ర గ్రామం వద్ద పూర్తి అధికార లాంఛనాలతో కర్నాటక ప్రభుత్వం ఆమెకు తుది వీడ్కోలు పలికింది. తర్వాత అర ఎకరా భూమిలో ఆమెకొక స్మారక మందిరం నిర్మించబోతున్నారు.