తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు గోల్కొండ సతీష్ ఆధ్వర్యంలో శుక్రవారం సిఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రెవెన్యూ అధికారులు భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో 5483 మంది గ్రామ రెవెన్యూ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్వోల పోస్ట్ రద్దయిన అప్పటినుంచి గ్రామాలలో రైతులు గాని ప్రజలు గాని అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ముఖ్యంగా తహసీల్దార్లు, ఆర్ఐలు పని ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారని కవితకు వివరించారు.
మండల ఆఫీస్ లలో ప్రజల సమస్యలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయినట్లు తెలిపారు. విద్యార్థులకు రావలసిన కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పేరుకుపోయి తహసీల్దార్లు సతమతమవుతున్నారని చెప్పారు.
అక్కడక్కడ విలువైన ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం పొంచిఉందని వివరించారు. సంక్షేమ పథకాల అమలులో ఆలస్యము జరుగుతున్న విషయాన్ని ఆమె దృష్టికి తెచ్చారు.
గ్రామ స్థాయిలో ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని అధికారి ద్వారా అటు ప్రజలకు ప్రభుత్వానికి మంచి జరిగి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వివరించారు. రెవెన్యూ శాఖ అంటే కేవలము భూమికే పరిమితం కాదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. ల్యాండ్ అక్విజేషన్, వరద బాధితులను ఆదుకోవడం, ఓటర్ లిస్ట్ నమోదు, బీదలకు చెందవలసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, కంటి వెలుగు, ఎలక్షన్ వర్క్, విపత్కర పరిస్థితిలో సేవలు, లా అండ్ ఆర్డర్, ప్రోటోకాల్ డ్యూటీలు, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఆపద్బందు, నేషనల్ బెనిఫిట్ స్కీమ్స్, లోన్ లకు సంబంధించిన సర్టిఫికెట్లు, రేషన్ కార్డు జారీ చేయడం, బర్రెల పంపిణీ, గొర్రెల పంపిణీ లో అర్హులను ఎంపిక చేయడం, పల్లె ప్రకృతి వనాలు, గ్రామాలలో వైకుంఠ ధామాల అభివృద్ధి లాంటి పనులు ఉంటాయని పేర్కొన్నారు.
ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలోని వీఆర్ఓ లందరూ జీతాలు సరిపోక వాళ్ళ కుటుంబాన్ని పోషించలేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. గ్రామ రెవెన్యూ అధికారులు పిల్లల స్కూల్ ఫీజులో రాయితీ కలిగించాలని, కాలేజీలలో కూడా రాయితీలు కలిగించాలని అభ్యర్థించారు. దాదాపుగా 8 సంవత్సరాల నుండి జూనియర్ అసిస్టెంట్ లో పని చేస్తున్నా ప్రమోషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని గుర్తు చేశారు.
వీఆర్వో అందరినీ రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తూ వారికి స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా జూనియర్ అసిస్టెంట్ గా నామకరణం చేసి సీనియార్టీ మరియు హర్హత కలిగిన విఆర్వోలు అందరికీ సీనియర్ అసిస్టెంట్లు గా ప్రమోషన్ ఇవ్వాలని కోరారు.
రాత్రింబవళ్ళు కష్టపడి భూప్రక్షాళన విజయవంతం చేసి సిఎం చేతుల మీద పెడితే ఆనాడు మమ్మల్ని ప్రశంసించి ఒక నెల జీతాన్ని బోనస్ గా చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం వీఆర్వోలకు నష్టం కలిగిస్తున్నట్లు చెప్పారు.
ఐదు నెలల నుంచి ఎలాంటి పోస్టులు ఇవ్వకుండా మాతో అనధికారికంగా అధికారికమైన పనులు చేయిస్తున్నారని తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ కుటుంబాలు ఆత్మగౌరవాన్ని కోల్పోయాయని బాధపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు 11 డిమాండ్లతో కలిగిన వినతిపత్రాన్ని సమర్పించారు.
అతి త్వరలో సిఎం అపాయింట్మెంట్ ఇప్పించి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారని రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు గోల్కొండ సతీష్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చింతల మురళి రామ్ కుమార్ స్వామి అర్చన జానకి మధులత విజయ్ రాజు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.