సరి లేరు నాకెవ్వరూ….సినీ జైత్రయాత్ర మధ్యలోనే మానేసిన నటి

(అహ్మద్ షరీఫ్)

అమెరికా, వర్జీనీయా పాలీటెక్నిక్ యూనివర్సిటీ లో బడ్జెటింగ్ ఆఫీసర్, విజయలక్ష్మి ని కలిసి “ఎలావున్నారు?” అని తెలుగులో కుశలమడిగితే ఆమె చిరు నవ్వు నవ్వుతుంది. సాదరంగా ఆహ్వానించి, భారత దేశం గురించి, అక్కడి సినిమాల గురించి సమాచారం అడుగుతుంది. ఆమే, గత తరం ప్రేక్షకుల కు అందమైన నృత్యాలు చూపించి అలనాటి సినిమాలలో నృత్యాలకు కేరాఫ్ అడ్రసు  గా నిలిచిన సినీ నృత్య తార ఎల్. విజయలక్ష్మి.  ఎల్. విజయలక్ష్మి గత తరం వారికి ఒక గొప్ప డాన్సరు గా, నటీమణి గా చిర పరిచితురాలే. చిత్రసీమ వదిలేసి, పిహెచ్ డి చేసి యూనివర్శిటీ జీవితంలో స్థిరపడిన ఏకైన భారతీయ నటి ఆమెయే

ఆమె చిరునవ్వు మీదుగా కాలచక్రం రింగులు తిరుగుతూ దాదాపు డెభ్భై సంవత్సరాలు వెనక్కి వెళితే, ఫ్లాష్ బాక్ లో ఓ ఆరేళ్ళ అమ్మాయి పుణె లో దక్షిణ భారతీయుల అసోసిఏషన్ వారి తరఫున వైజయంతిమాలా, లలితా, పద్మినీ ల నృత్యాలు  చూస్తూ కనిపిస్తుంది. వీరు చేసిన నృత్యాలతో  ప్రేరణ చెంది, ఇంటికొచ్చి పెరట్లో తనంతట తాను ఆ నృత్యాలను అనుకరించడం మొదలుపెట్టినపుడు ఆమెలోని నర్తకి ప్రాణం పోసుకుంది. నృత్యం  పట్ల ఆమెకున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు శాస్త్రీయ నృత్యం నేర్పించి ప్రోత్సహించడం తో ఆమె, ఒక గొప్ప నర్తకిగా రూపు దిద్దు కుంది.

ఆమె చాలా గొప్ప డ్యాన్సర్. ఎంజిఆర్ తో ఆమె చేసిన కుదియిరుందా కోవిల్ (Kudiyirundha Kovil)  డ్యాన్స్ అశేష జనాదరణ పొందింది. పంజాబీ బాంగ్రా శైలి నృత్యం. ఆమె డ్యాన్స్ చేసేందుకు ఎంజిఆర్ కూడా భయపడ్డారు. ఆమెతో ధీటుగా డ్యాన్స్ చేసేందుకు ఆయన అయిదు రోజులు రిహార్సల్ చేశారనేది చాలా పాపులర్ స్టోరీ.

నృత్యం తో పాటు నటన కూడా బాగా వచ్చినందు వల్ల ఎల్. విజయలక్ష్మి సినీరంగం లో నటీమణి గా స్థానం సంపాదించింది.  పదేళ్ళ పాటు (1959 – 1969 దశకం లో) తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది.  1959 తెలుగు చిత్రం ‘సిపాయి కూతరు’ ద్వారా ఆమె చిత్రసీమలోకి ప్రవేశించారు.

అప్పట్లో ప్రముఖ హీరోల అందరితో నూ నటించింది.నిజానికి ఆమె కూడా మరొక వైజయంతిమాల కావలసి ఉండింది. ఆమె దక్షిణాదిన ఒక వెలుగు వెలుగుతున్నపుడు హిందీ కమేడియన్ మహ్మూద్ చూసి బాలివుడ్ కు పరిచేయడం చేశాడు. ఆమెతో షబ్నమ్ (Shabnam)తీశాడు. అయితే, ఆ చిత్రం ఘోరంగా విఫలమయింది.దానికి ఆమె బాలివుడ్ కలలు చెదరిపోయాయి.

నర్తనశాల (1963) సినిమాలో బాలమురళీ కృష్ణ పాడిన “సలలిత రాగ సుధారస …” పాటను కానీ, దానికి ఎల్ విజయలక్ష్మీ చేసిన నృత్యం కానీ అలనాటి ప్రేక్షకులెవరూ మరిచి పోలేరు.

 

 

అలాగే కంచుకోట (1967) సినిమాలోని “సరి లేరు నీకెవ్వరూ..” పాట దానికి ఎల్. విజయలక్ష్మి చేసిన డాన్సు ఒక ఐకాన్ గా నిలిచిపోయాయి.

 

 

అలనాటి నృత్యాలు దాదాపు క్లాసికల్ డాన్సులే.  భరత నాట్యం, కూచిపూడి లాంటి నృత్యాలను కొద్దిపాటి మార్పులతో సినిమాలకు అడాప్ట్ చేసుకునేవారు. అప్పటి సినిమాలు కూడా చాలా మటుకు, నర్తనశాల, మహామంత్రి తిమ్మరుసు, పాండవ వనవాసం లాంటి సినిమాలే. ఇవి పౌరణిక, చారిత్రాత్మక సినిమాలు కావటం తో ఈ డాన్సులు ఆ సినిమాలలో ఇమిడిపోయేవి. రానురాను సినిమా కథల జోనర్లు మారిపోతూ సాంఘికాలు ఎక్కువ కావటం తో సినీ నృత్యాలు కూడా క్లాసికల్ నుంచి కొత్త కొత్త రూపాల్లో కి తర్జుమా అయిపోయాయి. ఇప్పుడు డాన్సుకు ప్రత్యేక నిర్వచనం ఏమీ లేదు. అన్నీ డాన్సులే. సినిమా నటీనటుల్లో  డాన్సర్ అనే ప్రత్యేక వృత్తి ఏమీ లేదు.  అందరూ డాన్సర్లే.

అప్పట్లో ఎల్ విజయలక్ష్మి నటించిన సినిమాలో ఆమెకు ప్రత్యేకంగా ఒకటైనా డాన్సు ఉండాలని నిర్మాత, దర్శకులు పట్టు బట్టేవారు.

ఆమె మొదటి తమిళ చిత్రం “పాథై తెరియూధు పార్” (1960) గొప్ప పేరు సంపాదించినప్పటికీ, కమర్షియల్ గా అపజయం పొందింది.

అప్పుడు సినీ విమర్శకులు దీనికి కారణం ఆ చిత్రం లో ఎల్ విజయలక్ష్మి డాన్సు ఒకటి కూడా ఉండక పోవటమే అన్నారట. దానికి అ చిత్ర దర్శకుడు ఎల్ విజయలక్ష్మి కి డాన్సు తెలుసు కానీ ఆమే అభినయించిన పాత్ర కి డాన్సు రాదు అన్నాడట. తెలుగు చిత్రం  గుండమ్మకథ (1962) లో ఆమెకు డాన్సు లేకపోవటం గమనించిన నిర్మాత దర్శకుడు చివర్లో ఒక డాన్సు సీక్వెన్సు ను కలిపారు. అయితే ఒక పాట రాసి, దానికి బాణీ కట్టి ఆ పాటకు విజయలక్ష్మి డాన్సు చిత్రీకరించే సమయం లేకపొవటం వల్ల, కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తో ఒక డాన్సు సీక్వెన్సు చిత్రీకరించారు. అప్పట్లో ప్రేక్షకులు కూడా” ఎల్ విజయలక్ష్మి వుంది మంచి డాన్సులు వుంటాయి” అని సినిమాకు వెళ్ళే వారు. ఇలా వుండేవి అప్పట్లో డాన్సు గురించిన ప్రాముఖ్యాలు.

ఎల్ విజయలక్ష్మి జీవితం సినిమా కథ కేమీ తీసి పోదు.

తన నట జీవితం తార స్థాయి లో  ఉన్నపుడు,  విజయలక్ష్మి మనిలా (ఫిలిపైన్స్)  లో పని చేస్తున్న తన సహోదరుడి మిత్రుడు సురజిత్ కుమార్ డే దత్తా ను వివాహమాడి  1969 లో మనిలా వెళ్లిపోయింది. మనిలా లో  ప్రైవేటుగా చదువుతూ, మొదట బెనారస్ లో హిందూ మెట్రిక్ పూర్తి చేసింది. ఆ తరువాత మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి. ఎస్. సి. డిగ్రీ పూర్తి చేసింది. తరువాత 1991 లో అమెరికా వెళ్ళిపోయి అక్కడ  భారత దేశం  లో C A (Chartered Accountant) కు సమానమైన  C.P. A మాస్టర్స్ డిగ్రీ చేసి ఆడిటర్ అయి, ఫైనాన్సియల్ అనలిస్ట్ గా మారి వర్జీనీయా పాలీటెక్నిక్ యూనివర్సిటీ లో బడ్జెటింగ్ ఆఫీసర్ గా పని చేసింది.

ప్రస్తుతం  కుమారుడి వద్ద డేవిస్, కాలిఫోర్నియా లో స్థిరపడింది. అయితే స్వదేశీ మమకారం ఇంకా వున్న ఎల్ విజయలక్ష్మి సంవత్సరానికి ఒక సారి భారత దేశానికి వస్తూవుంటుంది.

సినిమా రంగం ఒక అందమైన రంగుల ప్రపంచం. దానిలోకి రావడానికి ముందు ఎవరెలా వున్నా ఫరవాలేదు కానీ ఆ ప్రపంచాన్ని అర్థాంతరంగా వదిలేసి బయటికి వెళ్ళి పోయిన వారు మాత్రం తారా పథం నుండి నేలమీదికి జారి కొద్ది రోజుల్లో కనుమరుగై పోతారు. నటనే వృత్తిగా మలుచుకోవడానికి ముందు చదువునూ, ఇతర వృత్తుల్నీ వదిలేసి సినిమారంగం లో స్థిరపడటానికి ప్రయాస పడే నటీనటుల గురించి వింటూ వుంటాం. అయితే సినిమారంగపు తళుకుల్ని ఏ మాత్రం సంకోచం లేకుండా వదిలేసి, నూతన వృత్తిని చేపట్టడానికి కావలసిన విద్యార్హతల్ని మొదటి మెట్టునించి సంపాదించి జీవితం లో స్థిరపడ్డ ఎల్ విజయలక్ష్మి లాంటి వారిని  వాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.

ఎల్ విజయలక్ష్మి హీరోయిన్ గా  ఇప్పటి రూపం నుంచి మొదలు పెట్టి, ఆమె జీవిత చరిత్రను సినీకరిస్తే, ఒక గొప్ప మోటివేషనల్ చిత్రం తయారు కావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *