సర్పంచ్ మధు టిడిపి కాదు, వైసిపియే :ఎంపి గోరంట్ల మాధవ్ వివరణ

మధు అనే తెలుగుదేశం మద్దుతుదారుడిని కర్నూలు జిల్లా పశుపుల రుద్రవరం గ్రామంలో ఏకగ్రీవంగా గెలిపించేందుకు హిందూపూరం (అనంతపురం జిల్లా) వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్ మద్దతు పలికారని జరుగుతున్న ప్రచారానికి మాధవ్ వివరణ ఇచ్చారు.

ఇది దురుద్దేశంతో కూడుకున్న ప్రచారం అని ఆయన విమర్శించారు. ఇక్కడి నేతలంతా కలసి వైసిపి అభిమాని అయిన మధును ఏకగ్రీవంగా సర్పంచు ఎన్నికకు ప్రతిపాదించడం జరిగిందని చెబుతూ ఆయన తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ మధు ముందుకు వచ్చినపుడు అంతా ఆలోచించి ఈ మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందని మాధవ్ వివరించారు.

‘పంచాయతీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోగొట్టుకున్న  చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీ ఒకటి గెలిస్తే పది సీట్ల లాగా, పది గెలిస్తే నూరు సీట్లలా చూపించుకునేందుకు తంటాలు పడుతూ ఉంది. అందులో భాగమే మధును తెలుగుదేశం మద్దతు దారు అనడం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘ఈ గ్రామం ఫ్యాక్షన్ గ్రామం, ఇక్కడ ఒకటి రెండు హత్యలు జరిగాయి.ఇది నన్ను బాధించింది. ఈ  గ్రామంలో గొడవలు లేకుండా ఎన్నికలు జరిపేందుకు కృషి చేయాలనుకున్నాను.  హత్యకు గురైన రాముడనే వ్యక్తి కుమారుడిని సర్పంచుకు ఎంపిక చేసి ఈ కుటుంబానికి మేలు చేద్దామని ఊరందరితో కలసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. గ్రామస్తులు ఏకీభవించారు. అంతా పోటీలో నుంచి తప్పుకున్నారు.అపుడు మధును స్థానిక ఎమ్మెల్యే డా. సుధాకర్ అంగీకారంతో మధు పేరు ప్రకటించారు,’ అని అన్నారు.

ఈ ప్రచారానికి కారణం  మధు ఏకగ్రీవ ఎన్నిక జరిగిన పశుపుల రుద్రవరం మాధవ్ సొంతవూరు. ఇది కోడుమూరు నియోజకవర్గంలో ఉంది. అక్కడి ఎమ్మెల్యే సుధాకర్ సహకారంతో తాము వైసిపి కార్యకర్తఅయిన మధును ఏకగ్రీవంగా ఎన్నికకు ఎంపిక చేసి గెలిపించేందుకు కృషి చేశామని ఆయన వివరణ ఇచ్చారు.

కర్నూలు లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఇది మధు  టిడిపి  మద్దతు దారుడని తెలుగుదేశం పార్టీ చేస్తున్నది దుష్ప్రచారం అని  ఆయన విమర్శించారు.   సమావేశంలో సర్పంచ్ మధు కూడా ఉన్నారు.

వీడియోలో మరిన్ని వివరాలు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *