(భూమన్)
మల్లె మడుగు తిరుపతికి 15కిమీ దూరాన కరకంబాడి సమీపాన మల్లెమడుగు అనే గ్రామం ఉంది. అమర రాజా ఫ్యాక్టరీకి ఎదరుగా వస్తుంది. మల్లెమడుగు కోన కాలువ మీద 1954-59 మధ్య ప్రభుత్వం ఒక కరకట్ట కట్టింది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిరోజుల్లో కట్టిన తొలి చిన్నతరహా ఆనకట్టలో ఇదొకటి. నాటి ఈ తరహా ప్రాజక్టులలో మల్లెమడుగు అగ్రస్థానాన ఉంటుంది. నీరు నిండితే తనంత తానుగా పారే సైఫన్ స్పిల్ వే సిస్టమ్ ఈ డ్యామ్ ప్రత్యేకత. అహ్లాదకరమయిన పరిసరాలలో 4575అడుగుల పొడవుతో విస్తారమయిన రిజర్వాయర్ ఏర్పడేలాగా ఈ ప్రాజక్టు కట్టారు.
నెల్లూరు జిల్లా కందలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఒక కాలువ ద్వారా తీసుకువచ్చి బాలాజీ రిజర్వాయర్ ను నిర్మించాలని కొద్ది రోజుల కిందట అనుకున్నారు. ఈ బాలాజీ రిజర్వాయర్ నీటిని తిరుమల తిరుపతి దేవస్థానానికి వాడుకోవాలనేది ఒక ప్రతిపాదన. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు రు. 300 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది.
నిజానికి గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో ఈ మల్లెమడుగును చేర్చారు. అయితే, చాలా మార్పులు జరిగాయి. గాలేరు-నగరి చిత్తూరు దాకా వచ్చే అవకాశాలు తగ్గాయి. అందువల్ల పాత సదుపాయంతోనే సర్దు కోవాలనే ఆలోచనకు తితిదే వచ్చింది.
తిరుమలలో శేషాచలం కొండల్లో ఉండే నీళ్లు ఇపుడు ఈ మల్లెమడుగుకు ఆసరా. కొండ పడవల్లో వచ్చే కోన మడుగు నీళ్లు, సున్నపురాతి కోన నుంచి పారే చిన్న కాలువ తో పాటు చింతపాకుల కోన, బందెలదొడ్డి కోన,చింతలచేను కాలువ, వెదురుగుమ్మికాలువ, అముదాల కోనలనుంచి పారే నీళ్లన్నీ మల్లెమడుగుకు వస్తాయి.
మల్లెమడుగు ప్రాజక్టు చాలా ఆహ్లాదకరమయిన వాతావరణం, సుందరమైన ప్రదేశంలో నిర్మించబడింది. ఈ మడుగులోకి పారే నీళ్లన్ని అడవులనుంచి వచ్చిన మంచినీళ్లు కాబట్టి మల్లెమడుగు జలాశయంలోని చేపలు కూడా రుచికరమయినవని ఈ ప్రాంతాల ప్రజలు గొప్పగా చెబుతారు.అందుకే తిరుపతి మొదలుకుని చట్టు పక్కల ప్రజలంతా మల్లెమడుగు చేపలకోసం ఎగబడతారు. కొందరయితే, అదే పనిగా మల్లెమడుగు వచ్చి చేపలు కొనుక్కుని పోవడం నాకూ తెలుసు.
ఈ మల్లెమడుగుకు ఆనుకని ఒక గుట్ట మీద ఉంది. ఇక్కడి చీరాలమ్మ గుడి ఉంది. ఇక్కడ ప్రతి సంవ్సతరం జాతర జరుగుతుంది. ఇది చాలా పురాతనమయి జాతర సంప్రదాయం. అందుకే దున్నపోతుని బలి ఇవ్వడమనే అలవాటు ఇంకా కొనసాగుతూన్నదని ప్రజలు చెబుతారు. చీరాలమ్మ చాలా పేరున్న దేవత ఈప్రాంతంలో. అందుకే ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారు. చిత్తూరు జిల్లా నుంచే కాదు, నెల్లూరు జిల్లా నుంచి కూడా చీరాలమ్మ జాతరకు వస్తుంటారని చెబుతారు.
తిరుపతికి సమీపాన ఉండటం, ఆహ్లాదకరమయిన వాతావరణంలో ఉండడటంతో సంవత్సరానికి నాలుగయిదు సార్లయినా మా బృందంతో పాటి గాని, నేను సొంతంగా గాని ఈ ప్రాంతానికి ట్రెకింగ్ వస్తుంటాను.
మల్లెమడుగు సందర్శన వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒక స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో నిర్మించిన ఒక చిన్న ప్రాజక్టును చూడవచ్చు. కొండల మధ్య కనుచూపు మేరా పరచుకున్న ఈ జలాశయాన్ని చూస్తూ గడిపే ఒక అద్భుతమయిన అనుభవం రెండో ప్రయోజనం.
మనం ఇంతవరకు చూసినవన్నీ సహజ సౌందర్యంలో ఉన్న ప్రదేశాలలు. ఎక్కడో అడవుల్లో, కొండల మీద మైళ్ల కొలది ట్రెక్ చేసుకుంటూ వెళ్లిన సాహసయాత్రలు.
మల్లెమడుగు మనిషి తన జ్ఞానం జోడించి ఈ చిన్న ప్రాజక్టును నిర్మించి ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని రెట్టింపు చేసిన ప్రయోగం. చిన్న చిన్్న ప్రాజక్టులు ఎంత అందంగా ప్రకృతిలో ఒదుగుతాయో మల్లెమడుగు చూపిస్తుంది.
చిన్న, చిన్న ప్రాజక్టు (Smaller Projects)కోసం ప్రపంచమంతా మేధావులంతా ఆందోళన చేస్తున్నారు. అందులో నిజముందని మల్లెమడుగు చూస్తే అనిపిస్తుంది. ఇది ప్రకృతి చెక్కుచెదరకుండా కట్టిన చిన్నతరహా ప్రాజక్టు. దీని వల్ల జనావాసాలు మునిగిపోయి, ప్రజలు పెద్ద ఎత్తున నిర్వాసితులయ్యే ముప్పు లేదు.
మల్లెమడుగు దిగువన రాళ్ల కాలవలో ఆదిమ మానవుడు వాడిన రాతిపని ముట్లు, ఇతర అవశేషాలు దొరికినాయి. విశేషమేమంటే, విఖ్యాత పురాతత్వశాస్త్రవేత్త హెచ్ డి సంకాలియా (HD Sankalia) ఈ ప్రాంతంలో పర్యటించి, ఆదిమ మానవుడు తిరిగిన ఆనవాళ్లను అన్వేషించి ఈ ప్రాంత పురాతన జనజీవితం గురించి అనేక కొత్త విషయాలు చెప్పారు. ఇన్ని విశేషాలున్న మల్లెమడుగును చూడ్డానికి మీరంతా తప్పక రావాలి. ఇక్కడి కొచ్చి కొంతసేపే ఈ ప్రాంతమంతా కలియతిరిగి, కొద్ది సేపు ఈ ప్రకృతి వొడిలో సేద తీరితే, కొండలను, గుట్టలను, అడవులను, చెట్లను, నదులను సెలయేళ్లను కాపాడుకోవలసిన అవసరమెంత వుందో, వాటి వల్ల మానవజాతికి ఒనగూరే ప్రయోజనమెంతుందో గుర్తిస్తారు. తిరుపతికి పదిహేను కిలోమీటర్ల దూరానే ఉంది కాబట్టి మల్లెమడుగు రావడం పోవడం పెద్ద పనికాదు.
(భూమన్, రచయిత, ప్రకృతి ప్రేమికుడు, ట్రెకర్, తిరుపతి)