వరంగల్ వన విజ్ఞాన కేంద్రం లోని జంతువులను మురుగు నీళ్ల పాలుచేయడం మంచిది కాదని, ఈ మురుగు కాలువల దారి మళ్ళించి జంతువులకు భద్రత కల్పించాలని నగర పౌరుల ‘జూపార్కు పరిరక్షణ కమిటీ’ డిమాండ్ చేసింది.
ఈ రోజు ఉదయం పౌర ప్రజా సంఘాల అధ్వర్యంలో హన్మకొండ లోని పబ్లిక్ గార్డెన్ లో జూపార్కు అధ్వాన్న స్థితిగతులపై ఒక కార్యక్రమం జరిగింది. ఇక్కడి పరిస్థితుల మీద కమిటీ ఒక కరపత్రం విడుదల చేసింది.
“మొన్న కురిసిన భారీ వర్షాలకు పోటెత్తిన వరదలకు జంతువులన్నీ వారం రోజులపాటు నీళ్ళల్ల తడిసి విలవిలలాడి పోయాయి. ఈ విషయాన్ని జూపార్కుసంరక్షణ సిబ్బంది ఆవేదనతో చెప్పారు. వీటి రక్షణకై అహర్నిషలు తాముపడిన కష్టాలను వాటిని కాపాడిన తీరు జంతు ,పక్షి,పర్యావరణ ప్రేమికులమైన మమ్ములను తీవ్రంగా కలచివేచింద”ని ఈ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
వరదల సమయంలో జిల్లాకలెక్టర్ మరియు నగర మేయర్ ,నగర కమీషనర్ గారలు జూపార్కును సందర్శించి నెలకొన్న వైపరీత్యాలను వీక్షించి వెళ్ళిన తర్వాత చేపట్ట వలసిన చర్యల పట్ల నిస్తేజంగా ఉండిపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ (FBW) వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ వరంగల్ మహానగరంలోనీ జూపార్కు కేంద్ర జూపార్కులోకి వదలడం నిబంధనలకు వ్యతిరేకమని, అది జంతుహింస (violence against animals) వస్తుందని అన్నారు.
నగరంలోని పదికాలనీల మురుగునీరు జూపార్కులోకి ప్రవేశించి మురికి కూపంగా మార్చారు. వన్య ప్రాణులు మురుగులో బతకాలుకోవడం అమానుషం. ఇది సందర్శకుల ఆరోగ్య రీత్యా కూడా ప్రమాదకరం. వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి డ్రైనేజీల దారి మళ్ళించాలి,అని ఆయన కోరారు.
నిన్నగాక మొన్న నగర కమీషనర్ స్థానిక కార్పోరేటర్ అధ్వర్యంలో జూపార్కు డ్రైనేజీల అభివృద్ధికై 49 లక్షల రూపాయలతో నిర్మాణం చేపడదామని పనులు ప్రారంభించడాన్ని తీవ్రంగా కమిటీ వ్యతిరేకించింది.
ఈ విధానం కేంద్ర జూపార్కు నియమ నిబంధనలకు పూర్తి వ్యతిరేకమని,
జూపార్కులోకి మురుగు నీరు పంపించి వన్య ప్రాణుల ,మరియు సందర్శకుల ఆరోగ్యాలతో చెలగాటమాడటం మానుకోవాలని కమిటీ కోరింది.
వరంగల్ పౌర స్పందన వేదిక సమన్వయ కర్త నల్లెల్ల రాజయ్య మాట్లాడుతూ జూపార్కులో నెలకొన్న మురుగు దుర్గంధం కారణంగానే ఇటీవల కొన్ని వణ్యప్రాణులు (చిరుత పులి) మృత్యువాత పడటం జరిగింది అన్నారు.
హన్మకొండ జేఏసీ కన్వీనర్ జి.కుమార స్వామి మాట్లాడుతూ ఈ వనవిజ్ఞాన కేంద్రంలో కేంద్ర జూపార్కుల నియమ నిబంధనలు మరియు వన్యప్రాణుల రక్షణ చట్టాలేవీ అమలుజరగడంలేదనేది అక్షర సత్యమన్నారు.
ఈ సమావేశంలో హన్మకొండ జేఏసీ కన్వీనర్ జి.కుమార స్వామి ,అంబటీ కుమారస్వామి,ప్రజారోగ్య పరిరక్షణ సమితి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ,రజక సంఘం నాయకులు చాపర్తి కుమార గాడ్గే బిసీ సంఘం నాయకులు ఐతం నగేష్ , అడ్వకేట్ ఎన్ .రవిందర్ , మామిడాల సాగర్ ,నల్లెల్ల రాజయ్య ,గోనెల దేవెందర్ తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్స్
1.వన విజ్ఞాన కేంద్రంలోనికి ప్రవేశిస్తున్న రెండు డ్రైనేజీల ప్రవాహ దారులు మళ్ళించి భూగర్భ డ్రైన్స్ ద్వార బొంది వాగులకు చేర్చాలీ.
2.కేంద్ర జూపార్కుల గైడ్ లైన్స్ అమలు చేయాలి.
3. జంతువుల ఆవాస ప్రాంతాల్లో చల్లని నీడనిచ్చే వేప,విప్ప,తునికి,మర్రి,చింతలాంటి వృక్షాలను పెంచాలి.
4.జంతువుల ఆవాసాల్లో నిత్యం నీరుపారించి పచ్చని గడ్డి పెరిగే విధంగా చర్యలు గైకొనాలి.
5.నగర పాలక సంస్థ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసి జంతువులు,పక్షులకు అందించాలి.
6. జంతువుల ఆరోగ్య రక్షణకై
జూపార్కుకు ప్రత్యేకంగా వెటర్నరీ వైద్యసిబ్బందిని నియామకం చేయాలి.
7.జూపార్కు వెనకాల బాలసముద్రం అడ్వకేట్స్ కాలనీ వైపున్న ప్రహరీ గోడలకు ఆవల ఉండాల్సిన సుమారు పది ఫీట్ల వెడల్పైన రోడ్డు కోసం కేటాయించిన (జూపార్కుసిబ్బంది వాహనాల ద్వారగస్తీ తిరుగడానికై) ఖాళీ స్థలమంతా కబ్జాకోరులనుండి విముక్తం చేయాలి.రోడ్డు నిర్మించాలి.
8.జంతువుల భద్రత నిమిత్తమై చుట్టూర ఉన్న ప్రహరీగోడల ఎత్తు పెంచి ఎలక్ట్రికల్ ఇనుప ముళ్ళకంచెల ఏర్పాట్లు జరగాలి.
9.జూపార్కు ఏరియల్ వ్యూ చూడటానికి నలువైపులా ఎత్తైన వాచ్ టవర్లను నిర్మించాలి.
10.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జూపార్కులకు కేటాయించే బడ్జెట్ వాటా అతి తక్కువగా ఉంటున్నందున స్థానిక దాతలపై ఆధారపడి గడుపుతున్న దైన్య స్థితిని నివారించాలి. బడ్జెట్ వాటా పెంచాలి.ఆహారభద్రత కల్పించాలి.
11.కేంద్ర జూపార్కుల చట్టం మరియు వన్యప్రాణుల రక్షణ చట్టాలను పకడ్భందిగా అమలు పరచాలి.
12.చారిత్రాత్మకమైన పద్మాక్షిగుడి,భద్రకాళి దేవాలయం,ట్యాంకు బండ్ లాంటి టూరిస్టు ప్రదేశాలతో జూపార్కును కలుపుతు సర్క్యూట్ పర్యాటక జోన్ గా ప్రకటించాలి.