‘సొమ్మొకరిది , సోకొకరిది’, ఒక తెలంగాణ సగటు ఉద్యోగి ఆవేదన

(తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్)

సొమ్మెవ్వంది-సోకెవ్వంది.,
కూతలెవ్వనియ్-కోతలెవ్వనియ్.,
రాతలెవ్వనియ్-చేతలెవ్వనియ్,
దొరెవ్వడో-బానిసెవ్వడో.

అదే విషయం సగటు ఉద్యోగులుగా మేము అడుగుతున్నాం. పొట్ట కూటి కోసం జీతం మీద ఆధారపడే వేతన జీవులను ఆడిపోసుకోవడం నీ అవగాహన రాహిత్యంగ భావిస్తం. ముందు నీకు, నీవు కొమ్ముకాసే, అధికార పార్టీ కరపత్రిక నమస్తే తెలంగాణకు ఇక మా నమస్తే. ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఉద్యోగులను చులకన చేస్తూ., వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కరి పరిపాటి అయింది. ఉపాధ్యాయులను తప్పు పట్టే ముందు పాఠశాలల్లో నెలకొన్న స్థితిగతులు, ఉపాధ్యాయుల కొరత, పర్యవేక్షణా ,తదితర అంశాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉంటే బాగుండేది.

ఇటీవలి కాలంలో ఉద్యోగులు విపరీతమైన ఆరోపణలు, అవహేళనలు, అపహాస్యాన్ని, అప్రతిష్టను, మూట కట్టుకొంటున్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం మామూలు అయిపోయింది.

ఇది అత్యంత దురదృష్టకరం. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉద్యోగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్న సందర్బాలు కోకొల్లలు. ఉద్యోగుల అనగానే అందులో సింహభాగం నిలిచే ఉపాధ్యాయులే గుర్తుకు వస్తారు. విద్యార్థులకు విద్యనందించి, సమాజ గతిని మార్చి , జాతి నిర్మాణంలో కీలక భూమిక పోషించే జాతి నిర్మాతలుగా పిలువబడే ఉపాధ్యాయులను అపహాస్యానికి, అవహేళనకు గురిచేయడం నేడు నాయకులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు నిత్య కృత్యమైంది. ఏ సమాజం కోసమైతే ఉద్యోగలు విధి నిర్వహణలో అహర్నిశలు శ్రమించి, ఆ సమాజ శ్రేయస్సుకు సమిధలు అవుతున్నారో, అదే సమాజం చేత ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ పాలకవర్గం పబ్బం గడుపుతుంది.

తమ తప్పులను కప్పిపుచ్చుకునే అంశంలో భాగంగా ఆ పాపాన్ని ఉద్యోగుల మీదికి నెడుతుంది. దీనికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు వంత పాడడం పరిపాటి అయింది. ఉద్యోగులు అంటేనే ఒక చులకన భావన, ఈసడింపు ధోరణి . ఈ సమాజంలో అప్పణంగా బతికేది ఉద్యోగులే అనే భావనను ప్రజల్లో కల్పించారు. ఈ ముగ్గురు పనిగట్టుకుని చేసే ప్రసంగాలు, ప్రచురణలు, ప్రసారాలు ప్రజల దృష్టిలో ఉద్యోగులను దొంగలు, నేరస్తులుగా నిలబెడుతున్నారు, అన్నది నిష్ఠుర సత్యం. అయితే ఒకప్పుడు పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిర్వివాద, నిష్పక్షపాత, వాస్తవిక విషయాలను ప్రచురించేవి, ప్రచారం చేసేవి. ప్రజల్లో ఆ వార్త ప్రసారాలకు విశేషమైన ప్రజాదరణ మరియు విశ్వసనీయత ఉండేది.

సామాజిక స్పృహతో ప్రజలను చైతన్య పరుస్తూ.., పాలక వర్గాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ.. మరో ప్రక్క ప్రశ్నిస్తూ, వారి కర్తవ్య బాధ్యతలను గుర్తు చేస్తూ ఉండేవి. ఇలా సమతూకాన్ని పాటిస్తూ ఆనాటి పత్రికలు ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా, ప్రజా పరిరక్షకులుగా వ్యవహరించేవి. అందులో పని చేసే పత్రికా సంపాదకులు,విలేకరులు, మరియు మీడియా ప్రతినిధులు గొప్ప విషయ పరిజ్ఞానం గల మేధావులుగా ఉండేవారు. వారు వృత్తి నిబద్ధత, క్రమశిక్షణా మరియు అంకితం భావం కలిగి వుండి, నిష్పక్షపాత నిఖార్సైన వార్తలు ప్రచురించేవారు. నేడు అది లోపించింది. కనీస విషయ పరిజ్ఞానం లేని వారు మిడిమిడి జ్ఞానంతో వార్తలు రాసి వాసి కెక్కాలను కోవటం దురదృష్టకరం.

దరిమిలా ఆ పత్రికల యొక్క నిబద్ధతను, విశ్వసనీయతను నిలువునా దిగజార్చడంలో కృతకృత్యులు అవుతున్నారు. దీనికంతటికీ కారణం మారుతున్న కాలమాన పరిస్థితులే. ఒకప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు స్వతంత్రంగా వ్యవహరించేవి. అవి ప్రశ్నించే గొంతుకలై నినదించేవి. కానీ ఇప్పటి మాదిరి ఏ పాలక పక్షానికో, ప్రతిపక్షానికో, రాజకీయ పార్టీకో లేదా నాయకునికో అంటకాగేవి కాదు. నేడు అవి ఒక్కొక్కరి చెరలో ఒకటిగా బందీలై స్వార్థ చింతనతో స్వప్రయోజనం కోసం తమ స్వంత డబ్బా కొట్టుకుంటున్నాయి.

ఈ మాధ్యమాలు ఎదుటి వారిని దూషించడానికి, నిందించడానికి పనికొచ్చే ప్రసార సాధనాలుగా మారాయి. పత్రికా విలువలను కాలరాస్తూ, అభూత కల్పనలను సృష్టించి ప్రచురిస్తూ.., ప్రచారం చేస్తూ , తప్పుడు కథనాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. ఒక వార్త, వ్యాసంగం లేదా వ్యాసాన్ని ప్రచురించేటప్పుడు ఆ విషయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించటం, వాస్తవిక దృక్పథంతో పరిశీలించడం విచక్షణతో వ్యవహరించి, ప్రచురించడం తద్వారా దాని ప్రామాణికతను, విశ్వసనీయతను చాటాల్సి వుంటుంది.

కానీ ప్రస్తుతం పత్రిక విలేకరులకు ఇవేవి పట్టవు. తాము రాసిన అంశం మీదే తమకు అవగాహన లేకుండా పోతుంది. కవర్ పేజీ కోసం కబురు, గుర్తింపు కోసం ఒక ఫోటో వేసి, దాన్ని వార్తను చేసి సమాజాన్ని తప్పుదోవ పట్టించడం ద్వారా అది వారికి ప్రధాన వార్త అవుతుందని భ్రమపడటం అత్యంత శోచనీయం. వారు ప్రచురించిన వార్తల మీద ప్రజలకే కాదు, వారికి కూడా విశ్వసనీయత కొరవడింది. తప్పుడు కథనాలతో ఇలా పదే పదే ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తూనే వున్నారు. పాలకుల లోపభూయిష్టమైన పాలనా పరమైన విధానాల ఎండగట్టాల్సింది పోయి, వారి అవినీతి అక్రమాలను, దోపిడి, దాష్టీకాన్ని సమర్థిస్తూ .., వారి అడుగులకు మడుగులొత్తుతూ… తొత్తులుగా మారి ఉద్యోగులను నిందించి అగౌరవ పరచడం అలవాటు మారింది. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు.

దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకోని భూదానం, గోదానం, హిరణ్యదానం వంటి ఇనాంలు పొందుతున్నట్లు వార్తలు రాయడం వారి సంకుచిత ధోరణికి నిదర్శనం. దేశంలోనే అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం మనదేనని ప్రవచిస్తూ, ఉద్యోగులను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. పక్క రాష్ట్రంలో ఇంత కన్న మెరుగైన వేతనాలు ఇస్తుంటే కళ్ళు మూసుకు పోయినయా అని ప్రశ్నిస్తున్నం. దేశంలోని ఏ ముఖ్యమంత్రి, మంత్రులు,ఎమ్మెల్యేలు తీసుకోలేని జీత భత్యాలను తెలంగాణ మంత్రి గణం తీసుకుంటున్న విషయం ఎప్పుడూ మీ పత్రిక కళ్లకు కానరాదు. దేశంలో ఎక్కడా లేని జీతాలు ఇస్తున్న రాష్ట్రంగా పదేపదే పతాక శీర్షికలతో వార్తలు రాసే ఈ వార్తాహరులు వాస్తవాలను కప్పిపుచ్చడం దురదృష్టకరం. ఇంతకంటే మిన్నగా ఘననీయమైన జీతాలు ఇతర రాష్ట్రాలు ఇస్తున్నట్లు గణాంకాలు చెబుతున్న సంగతి మీకు తెలియనిది కాదు. బావిలో పడ్డ కప్పకు అదే లోకం అనిపిస్తుంది కదా!.

అలాగే ప్రభుత్వ ప్రాపకానికి మోకరిల్లిన మీ చేతి రాతలు వారి కనుసన్నలకు లోబడి ఉంటాయని విశదమైంది. అయితే ప్రజా సేవ చేయడానికి వచ్చిన నాయకుల్లో నూటికి 60% ప్రజాసంక్షేమాన్ని మరిచి కేవలం ఐదేళ్ల కాలంలో వందల ఎకరాలు కబ్జా చేసి, వేలకోట్ల ఆస్తులకు అధిపతులు ఎలా అవ్వగలుగుతున్నారు? దానిని ప్రశ్నించడానికి మీకు నోళ్ళు రావు, 30 సంవత్సరాల పైబడి సేవ చేసిన ఉద్యోగికి లేని పెన్షన్, ఎవర్ని ఉద్దరించని నాయకులకు ఐదేండ్ల కాలానికి ఎలా పెన్షన్ కు అర్హులౌతారో ? నని ప్రశ్నించే దుమ్ముండదు. భజన చేయడం తప్పా, ఇలాంటి విషయాలు రాయడానికి మీకు చేతులు రావు. దాదాపు మూడు పదుల సేవా ప్రస్థానంలో ఏ ఉద్యోగి, ఉపాధ్యాయుడు కూడా ప్రజల సొమ్ము దోసుకుని, దాచుకుని అద్దాల మేడలో నివసిస్తూ.. టుంగుటూయల్లో ఊగడం లేదు. జీవిత కాలంలో ఇల్లు కట్టి, పిల్లల్ని చదివిస్తూ..,ఆడ బిడ్డ పెళ్లి చేసి అప్పుల పాలై, రోగగ్రస్తులుగా మిగిలిన ఉద్యోగులే తప్ప , ఎవ్వరూ కోట్లకు పడగెత్తలేదు.

ప్రభుత్వ ఉద్యోగి అనే పేరుతో గవర్నమెంట్ ఇచ్చే రాయితీలకు, సంక్షేమ ఉచిత పథకాలుకు అనర్హులం అయ్యాం. పూర్తిగా వేతన మీద ఆధారపడి బతికే వ్యథల జీవులుగా మిగిలాం. కానీ, అదే ప్రైవేటుగా స్వంత వ్యాపారం చేస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో కడు నిరుపేదలే. వారు ప్రభుత్వం అందించే అన్ని రాయితీలకు, సంక్షేమ ఫలాలకు ఎల్లవేళలా అర్హులు. వీళ్ల గురించి ఎవ్వరూ పట్టీంచుకోరు. రాష్ట్రాన్ని పాలించే రాష్ట్ర అధినేత తన గురువు బోధన వల్లనే నేనింత గొప్పవాన్ని అయ్యానని పదేపదే కీర్తించిన విషయం అందరికీ విదితమే. తనకు చిన్ననాడు విద్య నేర్పిన గురువును తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా ప్రశంసలతో ముంచెత్తి, పద్యాలను వల్లెవేసి గురువు పాదాలకు సాగిలపడి సన్మానించి తన ఏకలవ్య భక్తిశ్రద్ధల్ని చాటుకున్నారు. వేదిక దిగినంతలోనే అంతా మరిచిన మహా నేత చదువు చెప్పే గురువులను నిందించడం కొసమెరుపు. పంతుళ్లకు రాజకీయాలు ఎందుకని ? ఉపాధ్యాయులకు ఇన్ని సంఘాలు అవసరమా ? అని ప్రశ్నిస్తూ ..తమ ద్వంద్వ నీతిని ప్రదర్శించారు.

పంతుళ్లకు మాత్రం పంగనామాలు పెడుతూనే ఉన్నారు. ఏ ప్రజలైతే ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అసమానతలకు లోనై వివక్షతో అణచివేయబడ్డారో , అక్కడే ఉద్యోగ, ఉపాధ్యాయ ,కార్మిక, కర్షక, విద్యార్థి, కుల,వర్గ సబ్బండ వర్ణాలు సంఘటితమై మహోజ్వల, మహోన్నతమైన ఉద్యమాన్ని నిర్మించి, నినదించినప్పుడు హక్కుల సాధనలో మనం కలలు గన్న తెలంగాణ సాకారమైంది. గద్దెనెక్కిన దొర నేడు ఇన్ని సంఘాలు ఎందుకు ? అని ప్రశ్నించడం విడ్డూరం. నాడు లేని సంఘాల ప్రస్తావన ఇప్పుడెందుకు ఉత్పన్నమైందో అర్థం కాదు. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించడానికి కనీసం రెండు పార్టీలు ఉంటే చాలు అనుకున్నప్పుడు పుట్టగొడుగుల్లా వేల కొలది పార్టీలు ఎందుకు పుట్టుకొస్తున్నాయో ! చెబితే బాగుంటుంది.

ప్రజల్ని మభ్యపెట్టి, ప్రలోభ పెడుతూ ఇన్ని పార్టీలు ఎందుకు ఏర్పడ్డాయో విజ్ఞులైన మీకు తెలియనిది కాదు. ఇతరుల గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచిస్తే మంచిది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ప్రతి వాడు ఉద్యోగులను దూషించడం అవమానకరం. ఎవరి దయాదాక్షిణ్యాల తోటి ఉద్యోగులు బతకడం లేదని గుర్తెరగాలి. ఏ నిర్బంధాలను చేధించి, స్వేచ్ఛా , స్వాతంత్య్రం, సమానత్వం కోసం కలలుగన్నామో ! ఆ తెలంగాణ స్వరాష్ట్ర ఏలుబడిలోనే మన ప్రశ్నించే గొంతుకలు మూగబోయేలా, ఉద్యమించే సంఘాలు నిర్వీర్యం అయ్యేలా చేస్తూ…నిర్బంధ, నిషేధాజ్ఞలు విధిస్తూ.., ధర్నా చౌక్ ఎత్తివేసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న నిరంకుశ ప్రభువుల పాలన కొనసాగుతుంది. దీనికి ఏదో ఒక రోజు కాలమే సమాధానం చెబుతుంది.

ఏది ఏమైనా, ఎవరేమన్నా ! ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులు మొక్కవోని దీక్ష, ధైర్యంతో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుని, అవమానాలకు కృంగిపోక, సన్మానాలకు పొంగిపోక, తమ విధులకు నిలబడి, హక్కుల కోసం కలబడుతూనే.., నిర్వహణలో అంకితమవ్వాలని కోరుకుంటున్న.

ఈ చివాట్లు,
చీత్కారాలు,
అవహేళనలు,
ఏవగింపులు,
వెక్కిరింతలు,
వెటకారాలు,
అపహాస్యాలు,
అవమానాలను,
… అన్నింటినీ ఉద్యోగి జీవిత కాలం ” సన్మాన గీతికలు”గా భావించాల్సి
ఉంటుందని తెలియజేస్తూ ఉద్యోగులపై ఈ లత్కోరు రాతలు రాసి,కూతలు కూసే వారికి కనువిప్పు కలగాలని కోరుకుంటూ….

(లక్ష్మణ్ గౌడ్ తాళ్ళపల్లి,సగటు ఉద్యోగి పేరుతో వాట్సాప్ లో వైరలవుతున్న ఆవేదన)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *