రేపటి నుంచి నాగసూరి వేణుగోపాల్ కొత్త అధ్యాయం ప్రారంభం

(చందమూరి నరసింహారెడ్డి)

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఏదో ఒక రోజు పదవీవిరమణ తప్పదు. ఇష్టంగా కానీ అయిష్టంగా కానీ అంగీకరించక తప్పదు. అయితే ఉద్యోగం లో చేరినప్పటినుంచి మనం చేసిన ఉద్యోగానికి న్యాయం చేశామా? లేదా ? అని మనకు మనమే ప్రశ్నించుకొంటే సంతృప్తికరమైన సమాధానం మనం మన మనస్సుకు చెప్పగలిగితే సంతోషంగా పదవీ విరమణ చేసాక  శేష జీవితం ఆనందంగా గడపగలుగుతారు.

నేడు పదవీవిరమణ చేస్తున్న మిత్రులు ,పెద్దలు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్నాకు తెలిసి ఆనందంగా శేష జీవితం గడపగలరు. ఆయన ఆకాశవాణి లో తన పదవికి న్యాయం చేసారని చెప్పడానికి సందేహించవలసిన అవసరం లేదు. ఎలాగంటే నిత్య విద్యార్థి లాగా నిరంతరం అధ్యయనం చేస్తూ విన్నూత్న కార్యక్రమాలు చేపడుతూ తన పయనం కొనసాగించారు. అనేక అంశాలపై అధ్యయనం చేసి పలు కోణాలను స్పృశించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. నూతన రచయితలను ఉత్తేజపరిచారు. తను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏవిధంగా నిరంతరం సాహిత్యం పై అధ్యయనం చేసే వారో అదే రీతీలో శేష జీవితంలో కొనసాగుతారని అందువల్ల ఆహ్లాదకరమైన జీవితం తప్పక గడుపుతారని నా వ్యక్తిగత విశ్వాసం. నమ్మకం. నిరంతరం ఉద్యోగ ధర్మంలో గడిపిన నాగసూరి  మిగిలిన శేష జీవితంలో కుటుంబ సభ్యుల తో ఆహ్లాదకరంగా, ఆనందంగా గడపాలని కోరుతున్నాను. శేష జీవితంలో సాహిత్యం పై పూర్తి దృష్టి సారించి సమాజానికి మరిన్ని చైతన్యవతమైన రచనలు అందించి సమాజసేవ చేస్తారని ఆశిస్తున్నా. పదవీ విరమణ తర్వాత సమాజ కళ్యాణం కోసం ఉపయోగకరమైన మరెన్నో సృజనాత్మక ప్రయోగాలకు చిరునామా గా నిలుస్తారని కోరుకోందాం.

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లి అనే మారుమూల కుగ్రామంలో జన్మించిన నాగసూరి వేణుగోపాల్  1988లోఆకాశవాణి గోవా లో తన ఉద్యోగ ప్రస్థానం ఆరంభించి 2021లో హైదరాబాదు లో ఉద్యోగ పదవీవిరమణ చేస్తున్నారు.33 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎన్నో మజిలీలు చవిచూసిన అనుభవశాలి. తన అనుభవాలను వేణునాదం ద్వార మనకందించారు.

నాగసూరి వేణుగోపాల్ ముక్కు సూటిగా పనిచేసే వ్యక్తి . 33ఏళ్ల సర్వీసు లో ఐదు రాష్ట్రాల్లో 10 కేంద్రాల్లో పనిచేశారు. దేశ రాజధాని డిల్లీలో ,కేంద్ర పాలిత ప్రాంతం గోవాలో ,తెలంగాణ రాజధాని  హైదరాబాదు లో , రాయలసీమ లో కర్నూలు మినహా అన్ని కేంద్రాల్లో , విజయవాడలో, విశాఖపట్నం లో పనిచేశారు. దాదాపు మూడేళ్లకో బదిలీ అందుకొన్నారు. వేరు వేరు రాష్ట్రాల్లో విభిన్న ప్రాంతాల్లో పనిచేయడం వల్ల విభిన్న సంస్కృతులు ,భిన్న మనస్తత్వాలు చూడగలిగారు.   తాను ఏ కేంద్రంలో పని చేసినా ఆప్రాంత వైశిష్టాన్ని గుర్తించి వెలుగులోకి తెచ్చారు. వైవిధ్యమైన కార్యక్రమాలు నిర్వహించారు.

మద్రాసు ఆకాశవాణి లో ప్లాటినం జూబ్లీ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో మద్రాసులో ,కడప ,విజయవాడ కేంద్రాల్లో స్వర్ణోత్సవాలు జరుగుతున్న సందర్భంలో అయా కేంద్రాల్లో ,హైదరాబాద్ ఆకాశవాణిలో డైమండ్ జూబ్లీ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు. ఒక ఉద్యోగి ప్లాటినం, డైమండ్, స్వర్ణోత్సవం ఇలా అన్ని వసంతాల కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అరుదు. అనంతపురం రేడియో కేంద్రం ప్రారంబించడానికి ఓ నెల ముందు అనంతపురం కు బదిలీ అయ్యారు. ఇలా ప్రారంబోత్సవ సందర్భంలో పనిచేయడం కేంద్రానికి గుర్తింపు తీసుకరావడానికి విశేషంగా కృషి చేశారు. అనంతపురం జిల్లాలో గుర్తింపుకు నోచుకోని జానపదాల గురించి అదయ్యనం చేసి అమ్మళ్ళదిన్నె గోపీనాథ్  చేత ఓ కార్యక్రమం చేయించి ‘అనంత కళారూపాలు’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా ప్రముఖుల గురించి ప్రముఖ జర్నలిస్ట్ కాశీపతి చేత ప్రసంగాలు నిర్వహించారు. విజయవాడ కేంద్రంలో వంద కథలు గురించి తెలియజేస్తూ ‘శతవసంతసాహితీమంజీరాలు ‘ అనే కార్యక్రమం , ‘జీవనబింబం ‘నిర్వహించారు. విశాఖపట్నం లో ‘ఆదివాసీ అంతరంగం’ వెలుగు జాడ ‘ కడపలో పెన్నేటిపాట, ‘పెన్నేటి కథలు’ అన్నమయ్య పదగోపురం ‘ధారావాహిక నిర్వహించారు. విజయవాడలో సినీ కవిసమ్మేళనం నిర్వహించారు. స్వర్ణోత్సవ సావనీరు లో భాగస్వామి అయ్యారు. ఎయిడ్స్ వ్యాది పై అవగాహన కలిపిస్తూ ధారావాహిక నిర్వహించారు. తిరుపతి లో పని చేసినప్పుడు చిత్తూరు జిల్లా  జీవన చిత్రం ధారావాహిక చేశారు. ఇలా ఏ స్టేషన్ లో పనిచేసినా వినూత్న తరహాలో కార్యక్రమాలు నిర్వహించారు. తనదైన ముద్ర వేసారు. పైరవీలకు దూరంగా పనిచేసుకు వెళ్లడం ఈయన నైజం.

ఆకాశవాణిలో పనిచేస్తూనే రచనా రంగంలో అయన చూపిన చొరవ చాల గొప్పది.

సైన్స్ పట్ల ఎనలేని విశ్వాసం కలిగిన వ్యక్తి గా ఆయన రచనల ద్వార తెలుసుకోవచ్చు. మూఢ విశ్వాసాలతో స్వంత పిల్లలనే చంపుకొనే మూర్ఖత్వం ఉన్న ఈ సమాజం లోని మూడ విశ్వాసాలను తరిమికొట్టడానికి తన భవిష్యత్ రచనల ద్వారా కృషి చేయాలని కొరుతున్నా. డాక్టర్ నాగసూరి వేణుగోపాల్  ఇప్పటివరకు 60కి పైగా రచనలు ప్రచురించారు. జాతిపిత మహాత్మాగాంధీ గురించి విసృత అద్యయనం చేస్తున్నారు. ఇప్పటికే గాంధీజీ జీవితం పై అనేక రచనలు వెలువరించారు.

సమాజ చైతన్యం కోసం సామాజిక మార్పుకోసం  మూఢనమ్మకాలు -సైన్స్ , పత్రికారంగంలో మార్పులు, విశ్వసనీయత తదితర అంశాలపై మీడియావాచ్ , వార్తామాధ్యమాల విశ్వసనీయత , పాత్రికేయపాళి ,సాహిత్యం, భాష అంశాలను వివరిస్తూ మదరాసు బదుకులు , సాహితీస్పర్శ , సాహితీవీక్షణం , టెలివిజన్ రంగం ప్రజలపై ప్రభావం అన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రశ్నార్ధకమైన విశ్వసనీయత , బుల్లితెర విశ్వరూపం , టీవీ ముచ్చట్లు , పర్యావరణం ,పాపులర్ సైన్స్ అంశాలుగా పర్యావరణం – సమాజం , ప్రకృతి – వికృతి , సైన్స్ సమాజం సాహిత్యం , సైన్స్ ధ్రువతారలు ఇలా అనేక అంశాలను స్పృశిస్తూ 60కి పైగా రచనలు నాగసూరి ప్రచురించారు.

నేడు ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీవిరమణ చేస్తున్న మిత్రులు,పెద్దలు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారికి పదవీవిరమణ శుభాకాంక్షలు. శేషజీవితం  సాహిత్యం తో , సహధర్మచారిణితో నూతనోత్సాహం తో గడపాలని ఆశిస్తున్నాము.

Chandamuri Narasimhareddy

(రచయిత :- చందమూరి నరసింహా రెడ్డి. ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *