(భమిడిపాటి ఫణిబాబు)
చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇదివరకటి రోజుల్లో ఇంట్లో హాల్ లో ఓ గడియారం వేళ్ళాడుతూ ఉండేది. దానికి ప్రతీ వారం, ఓ స్టూల్ వేసికుని, కీ ఇచ్చేవారు.వారంలో ఎప్పుడు కీ ఇవ్వాలో అక్కడ గుర్తుగా వ్రాసి ఉంచేవారు. ఆ గడియారం కూడా చాలా సిన్సియర్ గా గంటలు కొడుతూ, మన జీవితంలో ఒక భాగం క్రింద ఉండేది. సంవత్సరాలకొద్దీ పనిచేసేవి. అదేమిటో
కోఇన్సిడెంటల్ గా ఆ ఇంటి పెద్ద చనిపోయినప్పుడు ఆ గడియారం కూడా ఆగిపోయేది! ఇప్పటి వాళ్ళంటారు’ దానికి ‘కీ’ ఇవ్వకపోవడం వల్లా ఆగిపోయుంటుందీ, అంతేకానీ ఎవరో పోయారని కాదూ’అని. ఇప్పటి ‘వాతావరణం’ చూస్తే బహుశా అది కరెక్టేమో. కానీ ఊరు ఊరంతా చెప్పుకునేవారు.పెద్దాయన పోయినప్పుడు వాళ్ళింట్లో గడియారం కూడా ఆగిపోయిందిట అని. ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి! ఆ గడియారాలు కూడా ఎప్పుడూ రిపేరుకి వెళ్ళేవి కావు. ఇంటి పెద్ద మాదిరిగానే.
ఇంటి పెద్ద గుండె చప్పుడుతో లింకు చేసేవారు. హాల్లో మెజెస్టిక్ గా ఆ గడియారం ఎంత శోభ తెచ్చేదో! ఎవరి తాహతూ,ఎవరి స్థోమతను బట్టి అంత పేద్ద గడియారాలుండేవి.ఇంటి కంతకూ ఒక్కటే గడియారం.ఉద్యోగానికి వెళ్ళే ఇంటి పెద్దకి ఓ వాచీ ఉండేది. గడియారాలే కాదు, ఇంట్లో కరివేపాకు చెట్టు ఎండిపోయేది, ఇంట్లో కుక్కా, పిల్లీ ఉంటే అవి తిండి తినడం మానేసేవి. ఆవులు, గేదెలూ పాలివ్వడం మానేసేవి. వీటన్నిటినీ ‘ఇర్రేషనల్ థింకింగ్’ అనొచ్చు ఇప్పటి వాళ్ళు! అయినా సరే అలా జరిగేవి. ఆ పెద్దాయనో, పెద్దావిడో ప్రతీ రోజూ నీళ్ళు పోసేవారు కాబట్టి, కరివేపాకు చెట్టు నిగనిగలాడుతూ ఉండేవి.12 రోజుల హడావిడిలో ఎవరూ నీళ్ళు పోయలేదు కాబట్టి ఎండి పోయుండవచ్చు! అలాగే కుక్కలకీ,పిల్లులకీ ఎప్పుడూ తిండి పెట్టే మనిషి లేకపోబట్టి తిండం మానేసేవేమో. అయినా ఆ రోజుల్లో ఇంతంత డీప్ గా ఆలోచించే బుర్ర ఎక్కడుండేదీ?
తెల్లారకట్ల చదువుకోడానికి లేపడానికి, కాల క్రమేణా అలారం టైంపీసులొచ్చాయి.వీటిల్లిబంగారం గానూ, కరెక్టుగా మ్రోగేసేవి! గడియారాలు బాగుచేసేవాళ్ళు, ఎప్పుడైనా, ఎక్కడైనా ఓ ఇంటి అరుగు మీదే దుకాణం పెట్టుకుని ఉండేవాళ్ళు.అరుగుకి ఒక వైపు వీళ్ళూ, ఇంకో వైపు ఓ టైలరూ. ఇలాటివన్నీ ఆ రోజుల్లో ల్యాండ్ మార్క్స్! పెళ్ళిళ్ళల్లో అల్లుడుగారికి వాచీ, సైకిలూ తప్పకుండా ఇచ్చేవారు. ‘హెన్రీ సాండొజ్’, ‘బైఫొరా’ ‘ ఫేవర్ లూబా’ వాచీలు ఆ రోజుల్లో ప్రసిధ్ధి. డబ్బున్నవాళ్ళైతే ‘ ఒమేగా’ పెట్టుకునేవారు. ఒమేగా పెట్టుకున్నాడంటే అతనో జమీందారన్న మాట!
కాలేజీకి వచ్చినా చేతికి వాచీ ఉండేది కాదు.’పెర్ఫార్మెన్స్ ఓరియెన్టెడ్’ గా డిగ్రీ పాస్ అవుతే వాచీ కొనిచ్చే వారు. నేనైతే డిగ్రీ ఎలాగోలాగ పూర్తిచేసి ఉద్యోగంలో చేరిపోయి, నా మొదటి జీతం
202 రూపాయలలోనూ, 100 రూపాయలు ఖర్చు పెట్టి ఓ స్మగుల్డ్ వస్తువులు అమ్మే దుకాణంలో ‘ టిటోనీ’ వాచీ కొనుక్కున్నానోచ్! అప్పుడు కూడా మా నాన్నగారికి చెప్పడానికి గుండె ధైర్యం లేకపోయింది! అది వేరే సంగతి!
ఆ రోజుల్లో వాచీలు రేడియం డయల్ తో ఉండేవి. చీకట్లోకూడా కనిపించేవి. వాచీమీద చెయ్యి కప్పేసి, ఆ చీకట్లో అంకెలు చూడడం ఓ సరదా!అపుడప్పుడే వచ్చేయి కాబట్టి బలేగా ఉండేది.
రోజులు గడిచేకొద్దీ, గంటలు కొట్టే గోడ గడియారాలు పాపం ‘ఔట్ ఆఫ్ ఫేషన్’ అయిపోయాయి. ఆ తరువాత అంతా డిజిటల్ యుగం. 20 రూపాయలనుండి ఫుట్ పాత్ ల మీద దొరికేవి. కే.జీ క్లాసులో చేరినప్పటి నుండీ ఇప్పుడు వాచీలే! అవన్నీ బ్యాటరీలమీద నడిచేవే. బ్యాటరీ డిస్ చార్జ్ అయితే ఆగిపోతాయి. అంతేకానీ, ఇంటి పెద్ద ఉన్నాడా పోయాడా అని కాదు!
ఎప్పుడైనా ఇంట్లో, గృహ ప్రవేశమో, పెళ్ళో అయితే, ఆ వచ్చిన వాళ్ళందరికీ ఒకటే ఐడియా వచ్చేస్తుంది. ఓ గడియారం తీసికెళ్ళిస్తే పోలేదా అని. దాంతో ఒకడికి తెలియకుండా ఒకడు ఓ టైం పీసు ( వివిధ డిజైన్లలోవి), మన మొహాన్న కొట్టిపోతారు! టైంపీసుల్లో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, తక్కువ ఖర్చుతో వస్తుంది, పేద్ద గిఫ్ట్ ప్యాకింగు చేయించొచ్చు. చూసేవాళ్ళందరూ అనుకుంటారు- అబ్బో ఆయనెంత పెద్ద గిఫ్ట్ తెచ్చారో-అని! పుణ్యం పురుషార్ధం!
ఈ ఫంక్షన్ అయేటప్పటికి తేలుతుంది. వచ్చిన గిఫ్టుల్లో ఓ పాతిక రకాల టైంపీసులు అని. అవేమైనా అమ్ముకుంటామా ఏమిటీ. అలాగని ఇంకోళ్ళ ఫంక్షన్ లో ఇవ్వడమూ బాగోదూ. పోన్లే పడుంటాయి అనుకుని, ఇంట్లో కనిపించిన చోటల్లా ఓ టైంపీసు పెడతాము. గడియారాల దుకాణం లోలాగ ఒక్కటీ సరైన టైము చూపించదు. ఎవరి దారి వారిది. ఏ రూమ్ములో చూసినా, ఆఖరికి బాత్ రూంలోనూ, టాయిలెట్లలోనూ టైం పీసులే. అసలడుగుతానూ, అక్కడెందుకండీ? అదో పైత్యం! వాటిల్లో బ్యాటరీలు వేయిస్తే పాపం పనిచేస్తాయి.అంత టైమెక్కడ ఈ రోజుల్లో!
ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే మా ఇంట్లో చూస్తే ఓ పాతిక గడియారాలు తేలాయి. ఒక్కటీ పనిచేయదు ( బ్యాటరీలు లేక). పోనీ నాకెప్పుడో తీరికయ్యి బ్యాటరీలు వేయిస్తే, వాటిని మళ్ళీ నేనే ఎప్పుడో చూసేదాకా, అవి అలాగే ఉంటాయి!ఎవరూ పట్టించుకోరు! ఇంట్లో ఇన్నిన్ని గడియారాలున్నా సరే చివరికి టైము చూసుకునేది, మన సెల్ ఫోన్ లోనే!
(భమిడిపాటి ఫణిబాబు,రచయిత, బ్లాగర్, పుణే.)
నిజం
అప్పట్లో మా ఇంట్లో కూడా ఉండేది ఈ గోడ గడియారం
ఆ పెండ్యులం చప్పుడు వింటుంటే సంగీతం వింటున్నట్లే ఉండేది
మా నాన్నగారు పోయాక కూడా పని చేసింది
తర్వాత ఏమయిందో తెలియలేదు
పాత వస్తువులు బంగారం కన్నా మిన్నగా చూసుకోవాలి
మా ఇంట్లో మా మామగారి పడక కుర్చీ ఇప్శటికీ వాడుతాము
అదో లగ్జరీ
వరలక్ష్మి గారూ
అవే కదా మధుర జ్ఞాపకాలు
…
Yes. Lots of memories attached to the wall clock.
శారద గారూ
మరచిపోలేని మధుర స్మృతులు .