టైగర్ మామగారు పుష్కరానికోసారి కూడా నవ్వేవారు కాదు

(శారద శివపురపు)

పెళ్ళికుదిరాకా అందరూ వచ్చి చూసారుగాని కాబోయే మామగారు మాత్రం అసలు నన్ను చూడటానికి రాలేదు. అదే అడిగితే ఆయనకి పెద్ద అభ్యంతరం లేదు నేనెవరిని చేసుకున్నా అని చెప్పాడు మా ఆయన. అప్పట్లో కమ్యూనిస్ట్ సాహిత్యం ఎక్కువ చదివేదాన్ని, అలాగే ఆ ప్రభావం  ఉండేది కొంత నామీద. కాబోయే కోడలు కమ్యునిస్టన్నా భయంలేదేంటి అనడిగితే, ఆ విషయం ఆయనకి తెలుసు, పరవాలేదు, సింపుల్ లివింగ్ లే వాళ్ళది అని అన్నారని చెప్పాడు. ఓహో అయితే మీ నాన్నగారు బాగా లిబరల్ అన్నమాట అన్నా.  నువ్వేమనుకుంటున్నావో మానాన్న గురించి ఆయన టైగర్ మాఇంట్లో, ఆయన ఎంత లిబరల్లో నువ్వే చూస్తావుగా అన్నాడు మా ఆయన ఇంక బెదిరించడం ఎందుకులే అనుకున్నాడేమో మరి.

ఇక మా మామగారి గురించి చెప్పాలంటే చిన్నప్పుడే అంటే పదిహేడేళ్ళ వయసులో తండ్రిపోతే చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళూ తమ్ముళ్ళకి చదువులూ చెప్పించి మా అత్తగారి సాయంతో అంత సంసారాన్ని గట్టున పడేసిన గట్టివాడు. తనూ ఆయుర్వేదం డాక్టరయి గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పటల్లో వైద్యుడిగానూ, కళాశాలలో బోధకుడిగానూ పని చేసారు.  చదివింది ఆయుర్వేదమైనా, అలోపతీ కూడా ప్రాక్టీసు చేసేవారు.  వైద్యుడిగా మంచిపేరు ప్రతిష్టలు గౌరవం సంపాదించుకున్నారు.  హైదరాబాద్ లోని ఇంటికి ఆయన పనిచేసిన అన్ని తెలంగాణా జిల్లాలనుంచి జనాలు ఆయన్ని చూసిపోదామని  వస్తుండేవారు.

వృత్తి రీత్యా ఇది ఆయన వ్యక్తిత్వంలోని ఒక పార్శ్వం అయితే ఇంట్లో ఆయన టైగర్ అనే పేరు ఎందుకు తెచ్చుకున్నారంటే చాలా చాలా చెప్పుకోవాలి.  ఆయనకి  పుస్తకాలు చదివే అలవాటుండేది. ఇంగ్లీష్ క్లాసిక్స్ పెద్ద కలెక్షన్ ఉండేది. ఆయన ఇంగ్లీష్ వాళ్ళకి కూడా టైమ్ సెన్స్ నేర్పగలరు, అంత డిసిప్లీన్‌డ్ లైఫ్ స్టైల్ ఉండేది. ప్రతిరోజూ పొద్దున్నే రేడియో వినే అలవాటుండేది. తరవాత పూజా కార్యక్రమమ్ ఒక గంట, ఎనిమిందింటికల్లా కాఫీ, పేపర్, పదింటికి భోజనం, ఆ తరవాత సాయంత్రం వరకూ ఏటైమ్‌లో పేషంట్స్ వచ్చినా చూసి మందులివ్వడం, మద్యాహ్నం రెండింటికి టిఫినూ, కాఫీ, సాయంకాలం ఏదైనా అల్పాహారం, వ్యాయామం కోసం తోటపని లేదా ఇంటిపనీ, రాత్రి 7.30 కల్లా భోజనం, కాసేపు చూస్తే టీ వీ,  9 గంటలకల్లా దోమతెర సిద్ధం చేస్తే అందులో పడుకుని రేడియోలో ఏ ఎం ఎస్ సుబ్బలక్ష్మినో, కర్నాటిక సంగీతాన్నో వింటూ, చేతిలో పుస్తకంతో ఓ అరగంటో ముప్పావుగంటో కాలక్షేపం చేసి నిద్ర పోయేవారు. అలా రిలాక్స్ అవుతూ పుస్తకం చదువుకునే టైమ్‌లో మంచింగ్ కోసం వేయించిన పల్లీలో, నారింజ తొనలో, అనార్ గింజలో రెడీగా ఉంచేవారు అత్తగారు. పండిన జాంపండులాంటి రంగుతో వొత్తైన తెల్లటి జుత్తు, చక్కటి క్రాప్ తో ఉండేవారు. వెండిజరీ పట్టుకుచ్చు లాంటి ఆ వత్తైన క్రాప్ కోసం ఆయన చాలానే శ్రమ పడేవారు. పేరు గుర్తులేదుగానీ ఎర్రని రంగులో సెంటెడ్ ఆముదం వచ్చేది చూసారూ, అది రాసి చక్కగా ఓ పావుగంట జుట్టు దువ్వేవారు.  ఎప్పుడూ తెల్లటి బట్టలు వేస్కునేవారు. నవ్వితే విచ్చుకున్న తెల్ల కలువలా ఎంతో ముచ్చటగా ఉండేవారు,  కాని పుష్కరానికోసారి కూడా నవ్వేవారు కాదు. ఎక్కువ పొడుగు కాదు గాని ఆజానుబాహుడు. ఇప్పుడు మన బాహుబలి అట్ట లింగాల్ని కష్టపడి మోసినట్లు నటిస్తాడుగానీ, మా మామగారు, బండరాళ్ళని అవలీలగా మోసవతల పడేసేవారు డెబ్భై ఏళ్ళ వయసులోగూడా. ఇంత చెప్పాకా మీకు ఆయన గురించి ఒక ఐడియా వచ్చేసుండాలి.  ఇప్పుడు చెప్పండి ఆయన బాహుబలి కాదంటారా. సరే బాహుబలే గానీ టైగర్ ఎలా అయ్యాడో చెప్పమ్మా తల్లీ అనుకుంటున్నారా, వస్తున్నా,  వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఎందుకంటే ఒకమాటలో తేల్చేసే వ్యవహారం కాదిది. మీరూ కొంచం ఓపికగా చదవాల్సిందే మా మామగారి గురించి తెలుసుకోవాలంటే.  మా మామగారా మజాకానా.

తెలంగాణాలో పనిచెయ్యడంవల్లేమో మరి జర్దా పాన్ తినే అలవాటుండేదట కొంచం వయసులో ఉన్నపుడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళే టైమ్‌కల్లా ఒక అరడజను పాన్లు తయారుచేసి లవంగం గుచ్చి వాటిని ఒక పాన్‌దాన్లో అమర్చి పెట్టి చెప్పులు రెడీగా వెళ్ళే ముందు కాళ్ళ దగ్గర పెడితే వేస్కుని పాన్‌దాన్ తీస్కుని వెళ్ళేవారట. ఆయనకి ఏమైనా సరే అలా స్పాట్్‌లో  అమిరిపోవాలి.  పొద్దున లేచినప్పుడు వాష్బేసిన్ దగ్గర నిలబడితారు. బ్రషూ, పేస్టూ అన్నీ అక్కడే ఉంటాయి. కానీ వేస్కోరే, అత్తగారు బ్రష్ మీద పేస్ట్ వేసివ్వాలి. పొరపాటున ఆవిడ అక్కడ లేక ఏవాకిట్లోనో ముగ్గేసుకుంటున్నారనుకోండి ఇక అయిపోయారే.  అలా ఆయన లేచే ముందే ఆయనకి కావాల్సినవి అమర్చడం కోసం ఆవిడ ఆయనకంటే ముందే లేచి సిద్ధంగా ఉండాలి. పూజ చేస్కుని కుర్చీలో కూర్చుని పేపర్ పట్టుకున్నారంటే కాఫీ కప్పు చేతిలో పెట్టాలి.  ఇంక ఆ పేపర్ ఆయన పూర్తి చేసేవరకూ ఎవరూ చదవడానికి వీల్లేదు.  పొరపాటున ఎవరు చూస్తున్నా ఆయన ఒప్పుకోరు.  వాళ్ళ చేతుల్లోంచి లాక్కుని ఆయన కివ్వాల్సిందే.   పక్కన పెట్టేసారుకదా అని పొరపాటున ఎప్పుడైనా తీస్కోబోతే ఇంకా నే చదవలేదు అనేవారు గంభీరంగా. అలా పెళ్ళయ్యాకా పేపర్ చదివే అలవాటు తప్పిపోయింది నాకు.

 

మాఇంట్లో కమ్యూనిస్ట్ లీడర్లా ఎగిరిపడే నేను ఇక్కడ పార్లమెంట్లో ఓమూల కూర్చునే అనామక పార్టీకి ఎన్నికైన ఏకైక మెంబర్లా అయిపోయాను.

 

ఇంటి వరాండాలో సిం హంలా, అలా ఆయన కూర్చుంటే పక్కన బస్తీలోని వస్తాదులైనా, ఉస్తాదులైన తోక ముడిచెయ్యాల్సిందే.  ఇంటి ముందుండే కొబ్బరి చెట్ల మట్టల కోసమో, జామకాయలకో దేనికైనా పోరంకి పిల్లలు ఇష్టారాజ్యంగా దాడిచేస్తుండేవాళ్ళు ఇళ్ళమీద.  చార్మినార్ హాస్పిటల్లో పనిచేసిన మామగారికి ఉర్దూ భాషా ప్రావీణ్యం కూడా ఉంది, చెప్పడం మరిచాను. కోపం వస్తే దూర్వాసుడే.  ఏం చేస్తారన్నది పక్కనబెడితే, ఆ ఉగ్రస్వరూపం చూస్తే ఎంతటివారికైనా వణుకు పుట్టాల్సిందే. ఆయన కోపంతో పక్కా తెలంగాణా పక్కీలో తిట్ల వర్షం కురిపిస్తుంటే పొకిరీలు వారి పిక్కలకి బుద్ధిచెప్పేవారు.  సిం హం మీదైనా ఈగ వాలుతుందేమో గానీ, ఉర్దూలో గర్జించే టైగర్ ఉండగా మా ఇంటిమీద ఈగ కూడా వాలేది కాదు.

ఆయనకి ఎంత మొండి ధైర్యమంటే చెప్తే మీరు నమ్మరు. సగం ఊడి బాధపెడుతున్న దంతాన్ని ఈమాత్రం దానికి డెంటిస్ట్ ఎందుకంటూ కటింగ్ ప్లయర్ తో పీకేసుకోగలరు. ఆయనకున్న ఒక్కో అలవాటు గురించి ఒక కధ చెప్పుకోవచ్చు. కడుపు నిండిన పులి చుట్టూ లేళ్ళు ధైర్యంగా తిరిగినట్టు ఆయన పడుకున్నప్పుడో, పేషంట్స్ తోటి బిసీగా ఉన్నపుడో మేం స్వేచ్ఛగా ఉండేవాళ్ళం లేదంటే వేటాడే పులి చుట్టుపక్కల నిశ్శబ్దంగా దాక్కునే జంతువుల పరిస్తితే మాది.   ఆయన భోజనం అయ్యి వాకిట్లో ఉంటే మేము ఏ పెరట్లోనో ఒకచోట చేరి సరదాగా నాల్గు కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటే, ఏంటా నవ్వులు అని ఓ కేకేస్తే ఎక్కడివాళ్ళక్కడ డిస్పెర్స్ అన్నమాట.

మొఘల్ బాద్్‌షాకి వంగి చేత్తో సలాం చేసుకుంటూ వీపు చూపెట్టకుండా వెనక్కి వెళ్ళడమే గుర్తొచ్చేది ఆయనతో ఏమాట్లడాల్సివచ్చినా. అవునన్నా కాదన్నా పద్ధతదే. ఏంచేసినా ఆయనే చెయ్యాలి.  పిల్లచేష్టలు కాకపోతే మొదట్లో నేను వంటింట్లో పాటలు వింటూ వంట చేద్దామనుకునే సాహసం చేసాను. వెంటనే వేటు పడింది రంగు పడుద్ది లాగా.

ఇక ఆయన రేడియో అబ్సెషన్ ఎలా ఉండేదో చెప్తాను చూడండి. ఆరింటికి రేడియో కార్యక్రమాలు మొదలయితే ఒక పావుగంట ముందునుంచి రేడియో ఆన్ చేస్తే గుయ్యిమని సౌండ్ వస్తుంది చూసారా, అక్కణ్ణుంచి మొదలవుతుంది. పోనీ అదేమీ తక్కువ వాల్యూమ్‌లో ఉండదు. ఇల్లంతా గూంజుఠీ షెహ్నాయీ అన్నమాట. ఆ ఇంట్లో కాస్తో కూస్తో అల్లరీ, కుర్ర చేష్టలు చేసేది ఈయనే అంటే మా ఆయనన్నమాట. వాళ్ళ నాన్న అక్కడ లేనప్పుడు చూసి వైర్ కట్ చేసి ఏమెరగనట్లు పడుకునేవాడట.  ఆయన వచ్చి ఎందుకాగిపోయింది చెప్మా అని పరిశోధించి తిరిగి కనెక్ట్ చేసుకునేపాటికి ఓ అరగంట నిద్రపోయేవాడట. ఇంక రేడియో వార్తలు, భక్తిరంజనులు అయ్యాకా, ఆయన పూజా కార్యక్రమాలయ్యాకా టేప్ రికార్డర్లో ఎం ఎస్ సుబ్బలక్ష్మి కేసెట్లు వినేవారు. అవి ఇంక ఎన్ని గంటలు తిరిగి తిరిగి ప్లే అయ్యేవంటే ఎం ఎస్ కాబట్టి గొంతరిగిపోకుండా పాడగల్గిందిగానీ మరొకరు మరొకరూ అయితే గొంతరిగిపోయి కీచు కీచుమనే వారే.  ఇంక మా అత్తగారైతే బాబ్బాబు ఆ కేసెట్లు ఆయనకి కనపడకుండా దాచెయ్యరా ఎక్కడన్నా నీకు దణ్ణం పెడతా అని మొర పెట్టుకునేవారు.   పేషంటెవరైనా వస్తేనే దానికి బ్రేక్.

ఏపేషంటునీ డబ్బులడిగేవారు కాదు. ఇస్తే ఇచ్చినట్లు లేకపోతే లేదు. ఫీస్ ఇవ్వకపోతే మానె, అలాంటి వాళ్ళు ఇంకొంచం ఎక్కువసేపు కబుర్లు చెప్పి మరీ వెళ్ళేవాళ్ళు.  ఆయనకి ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళే అప్పుడప్పుడూ వస్తుండేవాళ్ళు.  అప్పుడు గానీ ఆయన్ను చూస్తే ఈయనేనా మా టైగర్ అన్నంత ఆశ్చర్యం కలిగేది.  అన్నట్లు క్రికెట్ ఆయనకి చాలా ఇష్టం. ఇక ఆ టాపిక్ వస్తే ఆయన అనర్గళంగా మాట్లాడగలరు, ఆడకపోయినా అంత పట్టు ఆ సబ్జెక్ట్ మీద. పాలిటిక్స్ కరెంట్ ఎఫైర్స్ మీద ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడారంటే అయిపోయారే.

ఇంటికి రావడానికి అనుమతించబడే వాళ్ళు అతి కొద్దిమంది మాత్రమే ఉండేవారు. ఆయన ఫ్రెండ్స్  ఒకరు, రెండోది పేషంట్లు, మూడోది ఇద్దరు ముగ్గురు అతి దగ్గరి చుట్టాలూ. వీరు కూడా కాసేపు చూసెళ్ళడం మాత్రమే. ఎప్పుడైనా ఇంటికొచ్చి ఉండేది మనవలూ, మనవరాళ్ళూ, కూతుళ్ళూ మాత్రమే.  ఆయన మాత్రం ఎప్పుడూ ఎవరింటికీ వెళ్ళేవారు కాదు ముఖ్యమైన ఫంక్షన్స్కి  తప్ప.

మా మామగారి గురించిన ఎన్నో ఆసక్తికరమైన, నవ్వించే కధలెన్నో చెప్పాలి, అలా అని అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇదొక పెద్ద కధ అయిపోతుంది. అంత పెద్దది ఒకేసారి చదవడమూ కష్టమౌతుంది.  అందుకని మరిన్ని విశేషాలతో అతి త్వరలో మళ్ళీ  ఇంకో పోస్ట్్‌తోటి వస్తాను. అంతవరకూ ఇది చదివి గుర్తుంచుకోండేం.

(శారద శివపురపు, రచయిత్రి,పెయింటర్, బెంగళూరు)

 

 

13 thoughts on “టైగర్ మామగారు పుష్కరానికోసారి కూడా నవ్వేవారు కాదు

  1. The article is very nice .The way you wrote about a person who stood for and looked after not only his family but also his brothers and sisters speaks about his love and responsibility towards his family. As you mentioned one has to be tough to make the family sail thru during tough times.You write the facts of his life very hilariously .Great job.Looking forward for the next part.

  2. మా నాన్న గారు గుర్తొచ్చి ఉద్వేగానికి గురయ్యాను , మీరు చెప్పబోయే మిగిలిన విశేషాల కోసం ఎదురుచూస్తుంటానండీ.
    ధన్యవాదాలు.

  3. రచయిత్రి శారద గారిని ముందుగా అభినందించాలి. ఆవిడ థైర్యాన్ని మెచ్చుకోవాలి. సింహస్వప్నం లాంటి మామగారిగురించి ఆమె వివరించిన సంఘటనలలో ఆ మహోన్నత వ్యక్తి పట్ల ఆమెకు అంతర్లీనంగా వున్న అమిత గౌరవం, అభిమానం ప్రతిమాటలోను వ్యక్తం అవుతాయి. మనిషి భీకరంగా వుండొచ్చు, మాట కరుకుగా వుండొచ్చు కానీ అటువంటి వ్యక్తుల మనస్సు కచ్చితంగా వెన్నలా వుంటుంది. అటువంటి వ్యక్తుల ఉదాత్త స్వభావాన్ని, కుటుంబం పట్లా, సమాజంపట్లా వారు కనపరిచిన శ్రద్థ, సేవా తత్పరతనీ తెలియజేసే సంఘటనల్ని రచయిత్రి వెలికి తీసి రాబోయే భాగాల్లో పాఠకులతో పంచుకుంటారని ఆశిద్దాం.
    పాఠకుల్ని ఆకట్టుకునే వైనం ఆమె రచనల్లో అడుగడుగునా కనిపిస్తుంది. శారదగారికి అభినందనలు.ఇంకా ముందుముందు ఇటువంటి రచనల్ని పాఠకులకు అందిస్తారని ఆశీస్తున్నాను.

    1. Thanks, thanks a lot for the kind encouraging words. What you said is exactly correct. He was extremely committed to his family and his profession.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *