జనసేన నేత పవన్ కల్యాణ్ యాచించడం మానుకోవాలని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సలహా ఇచ్చారు. కాపుల గురించి పవన్ మాట్లాడుతున్న విషయాలు సినిమా డైలాగుల్లా ఉన్నాయని ఈ రోజు విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా అంబటి చెప్పారు. పవన్ కల్యాణ్ వి యాచక రాజకీయలయ్యాయని అంటూ మొదటు తెలుగుదేశం పార్టీ ని యాచించారు, ఇపుడు బిజెపిని యాచిస్తూ తిరుగుతున్నారని అన్నారు.
అంబటి పవన్ గురించి చెప్పిన విశేషాలు:
రాష్ట్రంలోని కాపుల పెద్దలతో సమావేశం అయ్యారు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కాపులు వెళ్లాలని పవన్ కోరుకున్నారు. చాలా సంతోషం. కాపు కులంలో పుట్టిన వ్యక్తిగా నాకు ఈ డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది. యాచించే స్థాయిలో ఉన్నారని వీళ్లను శాసించే స్థాయికి తెస్తానని పవన్ కళ్యాణ్ మాట సినిమా డైలాగ్‌లా మిగిలిపోతే ఎలా సర్?
అసలు ముందు మీరు యాచించటం మానండి. మొన్న తెలుగుదేశాన్ని యాచించారు. ఇప్పుడు బీజేపీని యాచిస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీని యాచించి, యాచించి పవన్ ఇంతగా దిగజారిపోయారు. ముందుగా, మీ కాళ్ల మీద మీరు నిలబడే పరిస్థితికి మీరు వస్తే ఒక కులాన్ని శాసించే స్థాయికి తీసుకువస్తారు. మీరే (పవన్) ఇవాళ యాచించే స్థాయిలో ఉన్నారయ్యా!
తిరుపతి సీటు ఇవ్వండి. హైదరాబాద్‌లో కార్పొరేషన్ సీట్లలో కొన్ని ఇవ్వండని యాచించారు. ఇచ్చారా.. ఇవ్వలేదు. ఇక్కడ కూడా పాచిపోయిన లడ్డూలు బీజేపీవారు ఇస్తారేమో తెలీదు. చంద్రబాబును యాచించి యాచించి గత ఎన్నికల్లో ఆయన సీఎంను చేయడానికి పని చేశారు.
కాపులను యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకువెళ్లే మీరు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని భుజాన మోసుకొని పోరాటం చేశారు.
అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. చంద్రబాబు ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తున్న రోజుల్లో చిరంజీవి, దాసరి నారాయణరావు, మేమంతా బయటకు వచ్చి హోటల్ హయత్‌లో గర్జించాం.
ఆ రోజు మీరు ఎక్కడున్నారు. మ్యావ్.. మ్యావ్ అంటూ.. తటపటాయిస్తూ తప్పుకుపోయారే. మీరా.. కాపుల్ని శాసించే స్థాయికి తీసుకువెళ్లేవారు..? మీరు యాచించే స్థాయి నుంచి మీ కాళ్ల మీద మీరు నిలబడండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. చాలు..!