ఆంధ్రలో స్తంభించిన ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వ సహాయనిరాకరణ

ఆంధ్రలో కనిపించని పంచాయతీ ఎన్నికల సందడి, కొనసాగుతన్న సహాయ నిరాకరణ

రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ కొనసాగుతూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్  పంచాతీయ ఎన్నికల సందడి కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజునుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు కావాలి.   నామినేషన్ల వేయడం ఈరోజు జరగాలి. అయితే, జిల్లాలవారీగా  జిల్లాల కలెక్టర్లెవరూ నోటిఫికేషన్లు ఇవ్వలేదు.అధికారులంతా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఫలితంగా నామినేషన్ల ప్రక్రియ మొదలే కాలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అనుకూలంగా వస్తే వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని కొన్ని జిల్లాలో  అధికారులుచెబుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

జాగ్రత్తగా ఎన్నికలు జరపండి అని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. ఇవి ఈరోజు మధ్యాహ్నం బెంచ్ పరిశీలనకు రానున్నాయి. ఇరుపక్షాలు తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నాయి. కోర్టు తీర్పును గౌరవిస్తామని చెబుతున్నాయి.

ఈ రోజు ఈ వ్యవహారం   సుప్రీం కోర్టు విచారణకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్,ఉద్యోగుల సంఘాలు వేసిన పిటిషన్ రెండూ ఈ   మధ్యాహ్నం విచారణకు వస్తున్నాయి. ఎన్నికల భవితవ్యం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మీద ఆధారపడి ఉంటుంది. అధికారులందరికి రాష్ట్రప్రభుత్వం అండదండలుండటంతో  ఎన్నికల కమిషన్ ఉనికినే గుర్తించడం మానేశారు.

దీనితో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాయకత్వంలోని  రాష్ట్ర ఎన్నికల కమిషన్  భవిత్యవం ప్రశ్నార్థకమయింది. కమిషన్ కు ప్రాణం రావాలంటే సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావాలి. అదే విధంగా పరువు నిలబడాలంటే, సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రభుత్వం,ఉద్యోగుల సంఘాలు ఎదురుచూస్తున్నాయి.

షెడ్యూల్ ను అమలు పర్చని అధికారుల  మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవాలి? తీసుకోవలసింది ప్రభుత్వమే. ఇపుడా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ను గుర్తించడమే లేదు.

కారణమేదయిన ఈ పరిణామం నుంచి ఒక పాఠం స్పష్టం. రూలింగ్  పార్టీ అనుకుంటే  అధికారులందరిని కంట్రోల్ చేస్తూ రాజ్యంగ సంస్థను కూడా పనిచేయకుండా చేయవచ్చు. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికి ఇదొక సిగ్నల్.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *