ఈ ఏడాది రిప్లబిక్ డే విశేషాలేంటో తెలుసా?

జనవరి 26న రిపబ్లిక్ డేకి ఏర్పాట్లు జోరుగాసాగుతున్నాయి. కరోనా ఆంక్షలు పోయి, దేశం మళ్లీ పూర్వపు పరిస్థితికి వస్తున్న సమయంలో ఈ రిపబ్లిక్ డే సంబరం జరుగుతూ ఉంది. అందుకే కరోనా పాండెమిక్ ఛాయలు ఈ రిపబ్లిక్ డే  సంబరంలో కనబడుతూనే ఉంటాయి. అయితే, ఈ ఏడాది రిపబ్లిక్ డే కి కొన్ని ప్రత్యేకతలూ ఉన్నాయి. ఇలాగే కొన్నింటిని కరోనా కారణంగా రద్దు చేశారు.

ఈ ఏడాది విశేషాలు:

*భారత్ ఫ్రాన్స్ నుంచి కొన్న రాఫేల్ యుద్ద విమానాలు ఈ ఏడాది రిపబ్లిక్ డే విన్యాసాల ప్రత్యేకత. ఈ విమానాలు భారత్ కు గత సెప్టెంబర్ లో అందాయి. మొత్తం 30 విమానాలను భారత్ కొంటున్నది. ఇందులో  11 దేశానికి అందాయి.

*భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్  భావనా కాంత్ ఈ సారి రిపబ్లిక్ డే పరేడ్ లోని మరొక ప్రత్యేకత. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శకటం మీద ఆమె కనిపిస్తారు.

*ఈ సారి 122 మంది సిపాయిలు ఉన్న బంగ్లాదేశ్ సాయుధ దళం కూడా పరేడ్ లో పాల్గొంటుంది.  విదేశీ సాయుధ దళాలు కూడా అపుడపుడూ రిపబ్లిక్ పరేడ్ లో పాల్గొంటూ ఉంటాయి.  2016లో ఫ్రాన్స్ దళం,  2017 లో యుఎఇ దళం పాల్గొన్నాయి.

*ఈ సారి అయోధ్య రాయాలయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వము తమ శకటంగా ప్రదర్శిస్తూ ఉంది.

అయితే,  ఈ రిపబ్లిక్ పరేడ్ లో కొన్ని విషయాలు మిస్సవుతున్నాయ్. అవేంటంటే…

*ఈ సారి భారత్ రిపబ్లిక్ డే లో చీఫ్ గెస్ట్ ఎవరూ ఉండటంలేదు. భారత ప్రభుత్వం ప్రతి యేడాది రిపబ్లిక్ డే కి ఒక విదేశీ అధ్యక్షుడిని ప్రధాన అతిధిగా ఆహ్వానిస్తారు. ఈసారి కరోనా కారణంగా చీఫ్ గెస్టు ఉండటం లేదు. నిజానికి ఈ సారి భారత్ బ్రిటిష్ ప్రధాని బొరిస్ జాన్సన్ ను ప్రధాన అతిధిగా ఆహ్వానించింది. ఆయన కూడా అంగీకరించారు. ఇపుడు ఇంగ్లండులో  కోవిడ్ తిరగదోడిన కారణంగా ఆయన రావడం లేదు. గతంలో  1952,1953, 1966లలో  మాత్రమే చీఫ్ గెస్టు  ఎవరూ లేరు.

*కరోనా కారణంగా రిపబ్లిక్ పరేడ్ కు ప్రేక్షకుల మీద ఆంక్షలు విధించారు. ఈ సారి కేవలం 25 వేల మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. గత ఏడాది 1,50,000 మంది హాజరయ్యారు. విలేకరుల సంఖ్యను కూడా 300 నుంచి 200కు తగ్గించారు.

*వెటరన్స్ పరేడ్ తో పాటు, సైనికుల మోటార్ సైకిల్ విన్యాసాలను రద్దు చేశారు.

ఇండియాగేట్ దగ్గిర విన్యాసాలను వీక్షించేందుకు  15 సంవత్సరాలలోపు పిల్లలను ఆహ్వానించడం లేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *