మాజీ ప్రధాని (స్వర్గీయ) పివి నరసింహారావు స్వగ్రామమైన వంగర ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విధంగా పీవీ నరసింహారావు ఇంటిని మ్యూజియంగా రూపొందిస్తారు.
ఈ భవనాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు, అక్కడ విజ్ఞాన వేదిక థీమ్ పార్క్ ను కూడా ఏర్పాటు చేస్తారు.
పివి విజ్ఞాన వేదికకోసం ప్రభుత్వం రు. 7 కోట్లను విడుదల చేసింది. దీనికి సంబంధించిన జివొని ఈ రోజు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, నరసింహ రావు శతజయంతి వేడుకల నిర్వాహణ కమిటీ అధ్యక్షులు కె కేశవరావు కుటుంబ సభ్యులకు అందచేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యాటక, సాంస్కృతిక, హెరిటేజ్ తెలంగాణ శాఖ ఉన్నతాధికారులతో గ్రామాన్ని సందర్శించి అక్కడ పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి కావాల్సిన కార్యచరణ ప్రణాళికను రూపొందించారు.
కేశవరావు మాట్లాడుతూ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు . ‘పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి గా దేశంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. వారి గొప్ప తనాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో వంగర లో పీవీ విజ్ఞాన వేదిక ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పివి విజ్ఞాన వేదిక థీమ్ పార్క్ కు 7 కోట్ల ను కేటాయించటం ఆనందంగా ఉంది,’ అని అన్నారు..
పివి విజ్ఞాన వేదిక కోసం 7 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని, అవసరమైతే ఇంకా నిధులను కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే నెల రోజుల్లో వంగర లో విజ్ఞాన కేంద్రం థీమ్ పార్క్ కు శంకుస్థాపన చేస్తామని కూడా మంత్రి గౌడ్ తెలిపారు.