(పగుడాకుల బాలస్వామి)
భారత సుప్రీంకోర్టులో విజయం సాధించి ఆగస్టు 5, 2020 న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేసి ప్రారంభించిన అయోధ్య రాముల వారి మందిరం నిర్మాణ మహాయజ్ఞంలో మనం అందరం సమిధుల అయ్యే భాగ్యం వచ్చింది. పూర్వం రామసేతు నిర్మాణం లో ఉడత శక్తికి మించి చేసిన సేవ ప్రపంచానికి తెలిసిందే! నేడు అదే తరహాలో ప్రతి భారతీయుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవుడు ఉడతా భక్తిగా తన వంతు రాముల వారికి సేవ చేసుకునే గొప్ప అవకాశం లభిస్తోంది. అయోధ్య రామ జన్మభూమిలో భవ్యమైన మందిర నిర్మాణానికి దాదాపు 1,100 కోట్ల వ్యయం అవసరం. అయితే ఆ మొత్తాన్ని ఒకరు లేదా ఇద్దరి దాతల సహకారంతో పూర్తి చేయవచ్చు. కానీ నిర్వాహకులు అలా చేయకుండా ప్రతి భారతీయుడి హృదయస్పందన కు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. మందిర నిర్మాణం లో దేశంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్” ఏర్పాటు చేశారు. దేశంలోని దాదాపు 5 లక్షలకు పైగా గ్రామాల్లో సంచరించడం… 11 కోట్ల కుటుంబాలను కలవడం లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారు.” రామ మందిరం నిధి అభియాన్” పేరిట కమిటీలు ఏర్పరచుకొని ప్రతి కుటుంబాన్ని కలిసి విరాళాలు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి హిందూ కుటుంబం నుంచి వారి స్తోమత.. ఆర్థిక స్థితిగతులను బట్టి మరీ ముఖ్యంగా వారి మనసుకు తోచినంత శ్రీరామునికి విరాళాలు సేకరించే గురుతరమైన కార్యాన్ని తలకి ఎత్తుకున్నారు రామ భక్తులు. ఇందులో భాగంగా పది రూపాయలు.. వంద రూపాయలు.. వేయి రూపాయల కూపన్లు ముద్రించారు. అంతకు మించి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చే వారి పాన్ నెంబర్ తీసుకుని రసీదు ఇచ్చి, చెక్కులు.. డీడీలు తీసుకుంటున్నారు. ఎవరైనా కూడా 20 వేలకు మించి క్యాష్ రూపంలో ఇచ్చేందుకు అనుమతి లేదు. కార్యకర్తలు కూడా రోజువారీగా జమ చేసిన మొత్తాన్ని అదేరోజు సాయంత్రం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతా లో జమ చేస్తారు. విరాళాలు అధిక మొత్తంలో ఇచ్చేవారికి చోటు కల్పించే (80G) పన్ను రాయితీ వెసులుబాటు అవకాశాన్ని అందుబాటులో ఉంచారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరికి వారు శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు లో నేరుగా ట్రాన్స్ఫర్ చేసేందుకు అన్ని వివరాలు అందుబాటులో ఉంచారు.
పారదర్శకత… ప్రామాణికత..!
పైసా పైసా కు ప్రామాణికత.. పారదర్శకత ..కల్పిస్తు ప్రతి పైసా పరమాత్ముడికి చేరేలా ప్రణాళికలు రూపొందించడం గొప్ప విశేషం. కాబట్టి ప్రతి భారతీయుడు రామజన్మభూమి నిధి సేకరణ అభియాన్ లో స్వచ్ఛందంగా పాల్గొని రామభక్తి చాటుకోవాలి. సీతమ్మ ను లంక నుంచి అయోధ్యకు తీసుకువచ్చే క్రమంలో రామసేతు నిర్మాణం లో ఉడుత చేసిన సేవను ఆదర్శంగా తీసుకొని నేడు మనం రామ కార్యంలో పాలు పంచుకోవాలి. వారధి నిర్మాణం లో గుట్టలు, కొండలు మోసుకొచ్చిన హనుమంతుడిలా నేడు కోట్లల్లో డబ్బులు ఇచ్చే భక్తులు .. ఇసుకరేణువుల ను మోసుకు వచ్చి భక్తి చాటుకున్న ఉడత లాగా 10 రూపాయలు ఇచ్చే భక్తులు కూడా ఉన్నారు. అయితే వారధి నిర్మాణం లో హనుమంతుడి గురించి చెప్పుకోవాల్సి వస్తే అదే విధంగా ఉడత గురించి కూడా స్మరించుకోవాల్సిన సందర్భం తప్పక వస్తుంది. రామ కార్యంలో తారతమ్యాలు లేవు. పేద, ధనిక, చిన్న, పెద్ద భేదం అసలే లేదు. వారి స్థాయిని బట్టి వారి సహాయం ఉంటుంది. ఎవరి స్థాయి వారిదే.
రాష్ట్రపతి విరాళం సెక్యులరిజానికి ఆదర్శం.!
రామమందిర నిర్మాణానికి భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం భారత లౌకిక విధానానికి కీర్తి కిరీటం. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కోర్టులో విజయం సాధించి ప్రతి భారతీయుడు ..ప్రతి హిందువు స్వాభిమానానికి చిహ్నమైన రామమందిర నిర్మాణానికి తనవంతుగా రాష్ట్రపతి స్పందన ప్రశంసనీయం.. అనుసరణీయం కూడాను! కానీ కొంతమంది దాన్ని తప్పుపట్టడం వారి అవివేకానికి, అలౌకిక వాదానికి, అంతకుమించి వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. గతంలో ఇదే రాష్ట్రపతి భవన్లో ఇస్తారు విందులు ఏర్పాటు చేస్తే ఏ ఒక్కరూ స్పందించిన దాఖలాలు లేవు అనే విషయం గుర్తు చేసుకోవాలి.
వ్యక్తిపూజకు దూరంగా.. సంఘటిత మందిర మే ధ్యేయంగా..!
కేవలం ఒకరి చేత విరాళం తీసుకొని మందిరం నిర్మిస్తే నేడు మనం బిర్లా మందిర్ గా నామకరణం చేయాల్సి వస్తుంది. బిర్లా మందిర్ లో వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. కానీ మనం మాత్రం బిర్లా మందిర్ గా పిలుస్తాం. ఎందుకంటే బిర్లా అనే వ్యక్తి దానికయ్యే సొమ్ము మొత్తం వెచ్చించాడు కాబట్టి మందిరానికి తన పేరు పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్నప్పుడు అడ్డు చెప్పేవారు కూడా ఎవరూ ఉండరు. నేడు రాములవారికి కూడా టాటా .. బిర్లా.. అంబానీ వంటి ఆర్థిక పరిపుష్టి గల ప్రముఖుల చేత మందిరం నిర్మిస్తే రామకార్యం నెరవేరదు. ప్రతి భారతీయుడు గుండె చప్పుడై న రామమందిర నిర్మాణం లో అందరి సహకారం పొంది రాములవారి మందిరాన్ని రామ మందిరం గానే నిర్మాణం చేసుకుందాం అనే ఆలోచనతో ట్రస్ట్ ముందుకు వెళ్లడం గొప్ప విషయం. నిర్వాహకుల ఆలోచన కు వందనం. చాలామంది సంపన్నులు డబ్బును కోట్లలో అందించేందుకు ముందుకు వచ్చినా నగదు రూపంలో తీసు కోవడం లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వైట్ మనీ (చెక్కు రూపంలో ) అకౌంట్ లో జమ చేసుకునే నిబంధన ఖచ్చితంగా అమలు చేయడం ఆదర్శం. అడ్డ మీద కూలీ నుంచి మొదలుకొని.. అంబానీ బ్రదర్స్ దాకా అందరూ అందించే ప్రతి పైసా అకౌంట్ రూపంలో ఉండాలి. అందరి ఆశీర్వాదంతో మందిర నిర్మాణం పూర్తి కావాలి.. తద్వారా లోకకల్యాణం జరగాలి. “జనవరి 15, 2021 నుంచి ఫిబ్రవరి 20 2021” వరకు కొనసాగే నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా మన ఇంటికి వచ్చే రామ భక్తులను ఆదరిద్దాం.. రామమందిర నిర్మాణం లో భాగస్వాములు అవుదాం.!
వాస్తు.. ఆలయ స్వరూపం..
ప్రముఖమైన నాగరి నిర్మాణ శైలితో రెండు ఎకరాల విస్తీర్ణంలో మందిరం నిర్మాణం అవుతోంది. అష్టభుజి ఆకృతిలో గర్భగుడి ..చుట్టూ వృత్తాకారం పరిధి ఉంటుంది. మొదట అనుకున్న నిర్మాణంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి రెండంతస్తుల కు బదులు మూడు అంతస్తుల మందిరం నిర్మాణమవుతోంది. ఆలయం పొడవు 360(మూడు వందల అరవై) అడుగులు, వెడల్పు 230 అడుగులు , ఎత్తు 194 అడుగులు. ఇందులో మొత్తం 366 స్తంభాలు ఉంటాయి. మొదటి అంతస్తులో 160,రెండవ అంతస్తులో 132, మూడో అంతస్తులో 70 నాలుగు స్తంభాలు, 27 నక్షత్ర వాటికలు ఉంటాయి. రాయి పైనే శిల్పాలు , ప్రతి స్తంభానికి 16 విగ్రహాలు చెక్కుతారు. హిందూ పురాణాల ప్రకారం దేవీ దేవతల విగ్రహాలను రూపొందిస్తారు. ముఖ్యంగా రామాలయానికి 5 ద్వారాలలో ప్రవేశం ఉంటుంది. మొదట సింహద్వారం గుండా ప్రధాన ప్రవేశం. ఐదు ప్రధాన విభాగాలు ఉన్నాయి. సింహ ద్వారం. నత్య మండపం.. రంగ మండపం.. ఆలయ ప్రధాన గోపురం.. గర్భగుడి. రామ మందిరానికి నాలుగు వైపులా నాలుగు చిన్న మందిరాలు నిర్మిస్తారు. మొదట గణేష్ ఆలయం, సీతా మాత ఆలయం, లక్ష్మణ్ ఆలయం, భరతుడి మందిరం ఉంటాయి. రామాలయానికి ఎదురుగా ఎత్తైన భారీ విజయస్థూపం ఏర్పాటు చేస్తారు. ఎడమవైపున నాలుగు వైపులా నాలుగు ద్వారాలతో కూడిన కథా వేదిక నిర్మాణం. ఈ కథా వేదికలో రామ కథ ..రామ లీల.. మహాభారతం.. పురాణ గాధలను చరిత్ర రూపంలో చూపిస్తారు. కథావేదిక పక్కన పరిశోధన కేంద్రం.. మరోవైపు భోజనశాల.. గ్రంథాలయం.. దేవాలయ సిబ్బంది కోసం వసతి గృహం ఉంటుంది. మందిరం చుట్టూ ఉన్న 67 ఎకరాల సువిశాల భూభాగంలో భారీ వృక్షాలు ఏర్పాటు చేస్తారు. ప్రార్థన మందిరం.. ఉపన్యాస వేదిక.. వేద పాఠశాల.. సంతు నివాస్.. యాత్ర నివాస్ మందిరాలు ప్రత్యేకంగా నిర్మిస్తారు.
క్యాతి గాంచిన “సోంపుర” డిజైనర్ మార్గదర్శనంలో..
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శిల్పశాస్త్ర ప్రావీణ్యులు సోంపుర కుటుంబీకులతో అయోధ్య రామ మందిరం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. చంద్రకాంత్ సోంపుర అనే శిల్ప శాస్త్ర ప్రముఖుడి ఆధ్వర్యంలో ఆలయం రూపుదిద్దుకుంటోంది. చంద్రకాంత్ సోంపుర కు సహాయకులుగా నిఖిల్ సోంపుర, ఆశిష్ సోంపురలు ఉన్నారు. గుజరాత్ లోని ప్రఖ్యాతి గాంచిన సోమనాథ్ మందిరం నిర్మాణ డిజైనర్లు కూడా సోంపురం కుటుంబీకులే కావడం విశేషం. చంద్రకాంత్ సోంపుర తాతగారైన ప్రభా శంకర్ సోంపు ర గారు సోమనాథ్ మందిరాన్ని రూపుదిద్దారు. శిల్ప శాస్త్రం లో 15 తరాలుగా ఈ కుటుంబానికి అనుభవం ఉంది. గుజరాత్లోని అహ్మదాబాద్ కు చెందిన ఈ కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 131 మందిరాలకు అద్భుతంగా డిజైన్ చేశారు. లండన్ లోని స్వామి నారాయణ ఆలయంతో పాటు అమెరికాలోని చాలా దేవాలయాలు వారి చేతుల మీదుగా రూపొందించడం గొప్ప విషయం.
ప్రముఖ L&T కంపెనీచే నిర్మాణం
తరతరాలకు ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడి మందిర నిర్మాణాన్ని ప్రముఖ కంపెనీ అయిన ” larsen and toubro” ఎల్ అండ్ టి చేపట్టింది. దాదాపు 36 నెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రకృతిలో ఎలాంటి వైపరీత్యాలు చోటు చేసుకున్నా తట్టుకునేలా దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా మన్నిక వచ్చేలా నిర్మాణం సాగుతోంది. రిక్టర్ స్కేల్ పై పది తీవ్రతతో భూకంపం సంభవించిన కూడా మందిరం చెక్కుచెదరదు. ఆలయంలో ఇంచు కూడా కదలదు. 200 అడుగుల లోతులో తవ్వి మట్టి నమూనాలు సేకరించి తదనుగుణంగా పనులు ప్రారంభించారు. చిన్న శిల్పం కూడా కదలకుండా నిర్మాణం ఉంటుంది. నిర్మాణంలో ఎటువంటి ఉక్కు, సిమెంట్, లోహం ఉపయోగించడం లేదు. రాజస్థాన్ లోని భరత్ పూర్ లో లభించే ప్రత్యేకమైన రాయితో నిర్మాణం సాగుతోంది.
(పగుడాకుల బాలస్వామి,ప్రచార సహ ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్, తెలంగాణ రాష్ట్రం,9912975753,9182674010)