గూగుల్ కంపెనీ ఎవరూ కంట్రోల్ చేయలేనంత పెద్దగా తయారయింది. తన సెర్చ్ ఇంజిన్ తో నిరంకుశంగా తయారయింది. ప్రపంచమంతా తన మీదే ఆధారపడేలా చేసుకుంది. పేరుకే ఇపుడు మనల్ని ప్రభుత్వాలు అదుపు చేస్తున్నాయి కాని, నిజానికి మన జీవితాల్ని శాసిస్తున్నది గూగుల్. గూగుల్ లేకపోతే మన ప్రపంచం అంధకారమవుతుంది. ఏమీ కనిపించదు. ఏమీ తెలియదు. మన చదవు, విజ్ఞానం, మన కూడబెట్టుకన్న సంపద, మన బ్యాంక్ అకౌంట్లు ఏవీ పనికిరాకుండా పోతాయి. గూగుల్ కు కోపం రాకుండా మనం మసలుకోవాలి. ఎంతటి దురవస్థ ఇది.
అయితే, గూగుల్ కంట్రోల్ నుంచి ఆస్ట్రేలియాను కొంతయినా తప్పించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తూ ఉంది. గూగుల్ కు ముకుతాడు వేసేందుకు ప్రపంచంలో ఎవరూ ప్రయత్నించలేక పోతున్నపుడు ఆస్ట్రేలియా ఈ ప్రయత్నం చేస్తున్నది.
ఇంటర్నెట్ రంగంలో మోనాపలి ఎంజాయ్ చేస్తున్న గూగుల్ , ఫేస్ బుక్ వంటి వాళ్లందరిని ఆస్ట్రేలియా దారికి తీసుకు రావాలనుకుంటుంది. గూగుల్, ఫేస్ బుక్ వంటి టెక్ కంపెనీలన్నీ న్యూస్ కంటెంట్ వాడుకుంటున్నందుకు మీడియా సంస్థలకు డబ్బు చెల్లించాల్సిందేనని ఆస్ట్రేలియా చెబుతున్నది. దీనికి సంబంధించిన బిల్లు ఆస్ట్రేలియో పార్లమెంటు ముందుకు వస్తున్నది.
ఇలాంటి నియమాలు పెడితే, సెర్చ్ ఇంజిన్ వంటి సర్వీసులను ఆస్ట్రేలియా నుంచి ఉపసంహరించుకుంటామని గూగుల్ హెచ్చరించింది. పాక్షికంగా ఈ పని మొదలుపెట్టింది.
అయితే, ఆస్ట్రేలియా భయపడలేదు. ఇలాంటి బెదిరింపులకు ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులు భయపరని ప్రధాని స్కాట్ మారిసన్ స్పష్టం చేశారు.
నిజానికి గూగుల్ మార్కెట్ లో ఆస్ట్రేలియా వాటా బాగా తక్కువ. గూగుల్ ఆందోళన ఏమిటంటే, ఆస్ట్రేలియా ఇలాంటి చట్టం తీసుకువస్తే ప్రపంచంలోని అన్ని దేశాలు రేపు అదే దారి పడతాయి. అందుకే ఈ రోజు ఆస్ట్రేలియా సెనెట్ ముందు వాజ్మూల మిస్తూ ఇలాంటి చట్టాలు పనిచేయవని గూగుల్ ఆస్ట్రేలియా మెల్ సిల్వా చెప్పారు.
ఇలాంటి చట్టాలను తీసుకువస్తే, అస్ట్ర్రేలియా నుంచి వెళ్లి పోవడం తప్ప తమకు మరొక గత్యంతరం లేదని ఆమె చెప్పారు
న్యూస్ కంటెంట్ వాడుకుంటున్నందున గూగుల్ డబ్బుచెల్లించాల్సిందేనని వత్తిడి మొదట ఫ్రాన్స్ లో వచ్చింది. అక్కడ గురువారం నాడు గూగుల్ ఒక ఒప్పందం కూడా చేసుకుంది.
ఇప్పటికే గూగుల్ కొన్ని ఆస్ట్రేలియా న్యూస్ సైట్ లను బ్లాక్ చేసింది. గూగుల్ సెర్చ్ లో ఈ న్యూస్ సైట్స్ కనిపించడం మానేశాయి. తాము తమ సర్వీస్ ను ఉపసంహరించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూపేందుకు కొన్ని ప్రయోగాలు చేస్తున్నామని గూగుల్ స్పందించింది.