నాలుగు విడతల పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలచేసే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొక సారి ఎన్నికలను బహిష్కరిచింది. అంతేకాదు, కమిషన్ సిఫార్సుల ప్రకారం అధికారలను విధులనుంచి తప్పించడం సాధ్యం కాదని కూడా ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనితో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వానికి యుద్ధం మొదలుకానుంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాన కార్యదర్శి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఒక లేఖ ద్వారా కమిషనర్ నిమ్మగడ్డకు తెలిపారు.
ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, ఎన్నికలు జరపాలన్న నిర్ణయాన్ని ఎస్‌ఈసీ నిర్ణయం పునఃపరిశీలించాలని సీఎస్ కోరారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, వేచిచూడాలని కూడా ఆయన కోరారు.
ఎస్‌ఈసీ కోరినట్లుగా అధికారులను తొలగించడం సాధ్యం కాదని సీఎస్ లేఖలో పేర్కొన్నారు.
సిఎస్ లేఖలోని మరిన్ని ముఖ్యాంశాలు:
ఎస్ఈసీ తొలగించిన అధికారులు కరోనా విధుల్లో ఉన్నవారు.
ఎస్ ఇసి ప్రభుత్వం ఉమ్మడిగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పింది.
కరోనా మొదటి డోస్ తీసుకున్న వారికి రెండోడోస్ ఇచ్చిన నాలుగు వారాలకు ఇమ్యూనిటీ వస్తుంది.
పోలింగ్, వ్యాక్సినేషన్ రెండూ ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదు.
పోలింగ్, వ్యాక్సినేషన్ రెండూ ఒకేసారి జరగాలంటే వ్యాక్సినేషన్ వాయిదా వేయాల్సి వస్తుంది.
హైకోర్టు ఉత్తర్వులను మనస్ఫూర్తిగా పాటించేందుకు ఎస్‌ఈసీ, ప్రభుత్వం ప్రయత్నించాలి.
ఎస్‌ఈసీకి చెప్పిన విషయాలన్నీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలో ఉన్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగాలి.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దు.