ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపరీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దాదాపు ఈ పథకాలన్నీ నగదు బదిలీ పథకాలే. ఈ రోజు కూడా రేషన్ బియ్యం ఇంటి దగ్గిరకే తెచ్చి పంపిణీ చేసేందుకు వినూత్నమయిన పథకం చేపట్టారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా ఉండదేమో. అమ్మఒడి అని,దీవెన, పేదలందరికి ఇళ్లూ,రైతు భరోసా… ఇలా జగన్ టచ్ చేయని రంగం లేదు. జగన్ అందిస్తున్న నగదు అందుకోని కుటుంబం ఉండదేమో రాష్ట్రంలో. ఎన్నికష్టాలు పడైనా జగన్ ఈ పథకాలను కొనసాగించి తీరతాడు. అందులో అనుమానం లేదు. ఇప్పట్లో ఈ స్పీడు తగ్గదు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన మరిన్ని పథకాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఇలాంటపుడు తెలుగుదేశం పార్టీ దీనావస్థలో ఉండాలి. సంస్థాగతంగా పార్టీ డీలా పడిపోయి ఉండాలి. ఎందుకంటే చాలా మంది పార్టీ ఫిరాయించారు. పోయినోళ్లు పోతే, మిగిలినోళ్లు నిరుత్సాహపడి ఉండాలి. భవిష్యత్తు కనిపించక క్యాడర్ దూరం కావాలి. కాని అలా జరగడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఎలా డిలా పడిపోయిందో చూశాం కదా. ఇలాంటి దురవస్థ టిడిపిలో కనిపించడం లేదు. పిరాయింపులు జరిగాక మిగిలిన వాళ్లందరిలో ఉత్సాహం నింపడంలో చంద్రబాబు నాయుడు విజయవంతమవుతున్నాడనే చెప్పాలి.
ఎందుకంటే, ఆయన కార్యక్రమాలకు విపరీతంగా జనాన్ని మొబెలైజ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కార్యక్రమాలకంతటికి వస్తున్నవాళ్లంతా ముఖ్యమంత్రి జగన్ లబ్దిదారులే ఎక్కువ. డబ్బిచ్చి తెలుగుదేశం పార్టీ వీళ్లందరిని సమీకరిస్తున్నదనుకున్నా, జగన్ ఇస్తున్న సాయం చూస్తే వీళ్లెవరూ గడప దాటి వచ్చి మరొక పార్టీ జండా పట్టుకునే సాహసం చేయకూడదు. అలా జరగడం లేదు.
ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. చంద్రబాబు అనంతపురం వెళ్లినా, కడప వెళ్లినా జనం, రామతీర్థం వెళ్లినా జనం. ఈ రోజు మాజీ మంత్రి పీతాని సత్యానారాయణ ఇంటిలో ఒక ప్రయివేటు పంక్షన్ కు ఆయన వచ్చినా ప్రజలు విపరీతంగా వచ్చారు. జగన్అంతుచూడాలనుకుంటున్న ప్రతిపక్ష నేత ను కలిస్తే వైసిపి నేతల ఆగ్రహానికి గురికావలసి వస్తుందనే బెణుకు ఎవ్వరిలో కనిపించడం లేదు. చంద్రబాబు కంట పడటానికి, ఆయన్ను కలవడానికి ప్రజలు ఎగబడుతున్నారు. టిడిపి దీనిని ఎలా వినియోగించుకుంటుందో తెలియదు.
జగన్ అందిస్తున్న ఫలాలు అనుభవిస్తూ జనం ఇంకా ఇలా బయటకు వస్తున్నారంటే, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతున్నదనిపిస్తుంది. జగన్ కు అఖండ విజయం లభించినా, అనేక మంది టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా, టిడిపి పని ‘ఫసక్ ’ అనిపించడం లేదు. 2024లో వచ్చేది టిడిపియే నని చంద్రబాబు నాయుడు అనుచరుల్ని, పార్టీ కార్యకర్తల్ని ఉత్తేజపరుస్తున్నాడేమో అనిపిస్తుంది.
అదే నిజమయితే మాత్రం, టిడిపి వ్యూహం విజయవంతమవుతున్నట్లే. వైఎస్ ఆర్ కాంగ్రె స్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ వ్యూహాన్ని సమీక్షించుకోవలసిందే.
చంద్రబాబును అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో అరెస్టు చేసి జైలుకి పంపే అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి. అమరావతి తరలింపు వాయిదా పడుతూ ఉంది. కోర్టు తీర్పులు టిడిపి క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపి, చంద్రబాబు అసాధ్యుడనే భావం కలిగిస్తున్నాయోమో అనిపిస్తుంది.
జగన్ పథకాల దెబ్బకు,వైసిపి ఉధృతికి, అసెంబ్లీలో ఉన్న మెజారిటీకి, పోలీస్ యంత్రాంగం దాటికి ఈ పాటికి టిడిపిలో బాబు, చిన్నబాబు తప్ప మరొకరు మిగలని పరిస్థితి రావాలి. అది రాకపోవడం కాదు, జనాన్ని తనవైపు తిప్పుకోవడంలో పచ్చ పార్టీ విజయవంతమవుతున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు విక్టరీ సైన్ ఏమాత్రం బలహీనపడ లేదు.