(అజ్ఞాత రచయిత)
ఆ రోజు నేను భయపడి నంతా అయింది. మా ఆవిడ పక్కింటి పిన్నిగారిని సకుటుంబ సమేతంగా భోజనానికి పిలిచినట్టు చల్లగా చెప్పింది. ఏమంటాను ?ఏమనగలను చెప్పండి? వెరీగుడ్! మనం నలుగురు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయచ్చు.
“నలుగురేమిటి? అయ్యో , నా మతి మండా, వాళ్ళ మనమరాలు వందన కూడా వస్తుందని చెప్పడం మర్చిపోయాను” అంది మా ఆవిడ.
నేను తెల్ల బోయాను. ఆ పిల్ల మహా గడుగ్గాయి. చాన్సు దొరికితే చాలు నన్ను ఆట పట్టిస్తుంది.
ఎమ్ టెక్ చదువుతోంది. పిన్నిగారింటికి కాలేజీ చాలా దూరం అని వాళ్ళ మ్మానాన్నా హాస్టల్లో చేర్పించారు. సాధారణంగా ఆదివారాలు ఆ పిల్ల తన స్నేహితులతో సిటీలోకి షాపింగ్ కు వెళ్ళి ఆ తరువాత ఎక్కడో భోజనంచేసి సాయంత్రానికి హాస్టల్ కి చేరుకుంటారు. ఎప్పుడో గానీ ఇక్కడికి రాదు.
ఈ ఆదివారం ఇంటికి ఎందుకు వస్తోందో నా ప్రాణం తీయడానికి కాకపోతే అనుకున్నాను.
“అదేమిటీ, ఆ పిల్ల ఆదివారాలు సాధారణంగా షాపింగ్ కి పొతుంది కదా ? అన్నాను.
“ముందు రాను అందిట. పక్కింటి అంకుల్ ఆవపెట్టిన అరటిపువ్వు కూర వండుతున్నాడు అని పిన్నిగారు చెప్పగానే ఎగిరి గంతేసిందిట. మా ఫ్రెండ్సు ఇద్దరిని కూడా తీసుకురానా? అని అడిగిందట.
” ఈ సారికి వద్దులే, అబ్బాయి (అంటే నేను) టెన్షన్ పడిపోతాడు. పనసపొట్టు ఆవపెట్టిన కూరకూడా బాగా వండుతాడట. అప్పుడు పిలుద్దుగానిలే” అని పిన్నిగారు నచ్చచెప్పారట.
ఆ మాట వినగానే నాకళ్ళు చీకట్లు కమ్మాయి. నా కాళ్ళకింద భూమి బద్దలైనట్టూ , నేను అధోఃపాతాళంలోకి కూరుకుపోతున్నట్టూ అనిపించింది.
ఆ అల్లరి పిల్ల రావడం నాకు అస్సలు ఇష్టంలేదు.
పిన్నిగారింటికి వచ్చినప్పుడల్లా అంకుల్ , ఆంటీ అంటూ పిలవని పేరంటాల్లా మా ఇంటికి వచ్చేస్తుంది. ఆ పిల్లని చూడగానే ఇంక మా ఆవిడ ఒళ్ళు విడిపోతుంది .”దా, వందనా, బావున్నావా, బాగా చదువుతున్నావా?
“అని మా ఆవిడ పలకరించగానే ఇంక ఇక్కడ సెటిల్ అయిపోతుంది. మహా గడుగ్గాయి.. తెగ వాగుతుంది. ఎదుటివాళ్ళని అస్సలు మాట్లాడనివ్వదు. అలా మాట్లాడే వాళ్ళంటే మా ఆవిడకు ఎంత ఇష్టమో చెప్పలేను. పిన్నిగారు నాలుగు సార్లు అన్నానికి రమ్మంటే గాని ఇక్కడనుంచి కదలదు. ఎప్పుడో నెలకోసారి వస్తుందికాబట్టి సరిపోయింది ప్రతివారం వచ్చుంటే చచ్చివుండేవాణ్ణి.
ఇల్లాలి ముచ్చట్లు
ఇంటాయన ముచ్చెమటలు-2
ఎందుకు ఆ పిల్లంటే మీకు ఇష్టంలేదని మీరు అడగచ్చు. ఆ అమ్మాయి నన్ను రెండుసార్లు చాలా ఇబ్బందుల్లో పడేసింది.
మొదటిసారి ఏమైందో చెబుతాను.ప్రతి ఆదివారం పొద్దున్నే కాఫీలు అయిన తరువాత మార్కెట్ కి వెళ్ళి వారానికి సరిపడా కూరలు తీసుకువస్తాను. ఆ ఆదివారం సంచీ పుచ్చుకుని వెళ్ళబోతూంటే…
“ఏమండీ, పచ్చిమిరపకాయలు , అల్లం తో బాటు ఓ నాలుగు రకాల కూరలు పట్టుకురండి. కేబేజీ, తోటకూర, బీట్రూట్ కొనకండి. ఇంట్లో ఇంకా వున్నాయి. మర్చిపోవద్దు, అసలే మీకు మతిమరుపు ఎక్కువ. ఆ కూరలవాడు దెయ్యమంత తోటకూర కట్ట ఇస్తాడు. దాన్ని బాగు చేయలేక చావాలి. ఫ్రిజ్ లో చోటు చాలక చస్తున్నాను” అని నా శ్రీమతి తనదైన శైలిలో ఓ చిన్న వార్నింగ్ ఇచ్చింది.
అటూఇటూ పోకుండా త్వరగా వచ్చేయండి అంది.
“అలాగే అని బుర్ర ఆడించి స్కూటర్ స్టార్ట్ చేసి బయలుదేరబోతూంటే ఆటోలో వందన దిగుతూ “హాయ్, అంకుల్ “అని పలకరించింది.
నేనూ హాయ్ అనేసి బయలుదేరాను. కూరలకొట్లో సుబ్బారావు కనిపించాడు. నాకు కావల్సిన కూరల జాబితా కొట్టువాడికి చెప్పేసి సంచీ వాడి చేతికిచ్చి సుబ్బిగాడిని పలకరించాను.
ఈలోగా “సార్, ఇదుగో మీ సంచి,మీ బిల్లు 150 అన్నాడు .సంచీ తెరిచి చూసా, పైన ఇంత ఇంత పెద్ద కరివేపాకు , కొత్తిమీర కట్టా కనిపించాయి. ఈ కూరలవాడు ఒకడు, ప్రతిసారి ఇంత కరివేపాకు , ఓ కొత్తిమీర కట్టా ఫ్రీగా పడేస్తాడు. ఒకటా రెండా పదేళ్ళుగా వాడి కొట్లోనే కూరలు కొంటున్నాను మరి.
సుబ్బారావు దగ్గర సెలవుతీసుకుని హుషారుగా ఇంటికి చేరుకున్నాను. హాల్లో మా ఆవిడా, వందనా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.
” ఆ, వచ్చారా, వుండండి, పెద్ద పళ్ళెం పట్టుకొస్తాను. కూరలు అందులో గుమ్మరించి, విడదీసి సంచీల్లో సర్దుతాను అంటూ మా ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది.”ఆంటీ నేనుకూడా హెల్ప్ చేస్తాను.”అంది వందన.
హమ్మయ్య, కాస్త పని తప్పింది అనుకున్నాను. “వద్దులే వందనా, అంకుల్ వున్నారు కదా, నువ్వు వెళ్ళి మీ తాతా బామ్మా దగ్గర కూచుని కబుర్లు చెప్పు, మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో” అంది మా ఆవిడ.
“సరే” అనేసి వెళ్ళిపోయింది.
ఆ పెద్ద పళ్ళెంలో మా ఆవిడ కూరలు గుమ్మరిస్తోంటే పెద్ద దెయ్యమంత తోటకూర కట్ట కరివేపాకు ,కొత్తిమీర కట్టతో బైటపడింది.ఆ తోటకూర కట్టచూడగానే మా ఆవిడ మొహం ఎర్రగా అయిపోయింది. నా గుండె జారి చేతిలోకి వచ్చినట్టు అయింది. గొంతుకు తడి ఆరిపోయింది. ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి.
“తోటకూర వద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పానా లేదా? మీ నిర్వాకం చూడండి ఎలా తగలడిందో అని మాఆవిడ రంకెలు మొదలుపెట్టింది. “అయ్యో, తోటకూర వద్దని వాడికి చెప్పాను గురూ, దేముడి మీద ఒట్టు అన్నాను.
గత వారం పోస్టు…ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/features/banana-flower-banana-trunk-banana-fry-banana-leaf-andhra-kitchen/
మా ఆవిడకు కోపం వస్తే తిరిగి శాంతించ డానికి కనీసం ఓగంటసేపు పడుతుంది . ఆ గంట సేపూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టగలదు. తిడుతున్నంత సేపూ గుడ్లుఅప్పగించి వినాలి. అటూఇటూ దిక్కులు చూడకూడదు. అసలే మా ఆవిడ కంఠం కంచు కంఠం. పక్కింటి పిన్నిగారింటికి, మా ఇంటికీ మధ్యలో ప్రహరీగోడే అడ్డు. మా డ్రాయింగ్ రూమ్ కిటికీ తలుపులు తెరిస్తే వాళ్ళ డ్రాయింగ్ రూమ్ కనిపిస్తుంది. ఎవరు విన్నా వినకపోయినా వందన కచ్చితంగా వినే వుంటుంది. వాళ్ళ కిటికీ తలుపులు ఎప్పుడూ తెరిచేవుంటాయి. కిటికీ తలుపులు మూస్తే బాగుండును. కానీ కదిలానో మా ఆవిడ ఇంకొంచం రెచ్చిపోతుంది. మధ్యలో నోరెత్తకూడదు. చచ్చు పీనుగులా పడివుండాలి.
“నిన్ను అమితంగా ప్రేమించేవాళ్ళే అలా అరుస్తారు, తలవంచుకుని వినేయ్, ఆవిడిని అర్థం చేసుకో అని సుబ్బారావు నాకు ఓ దుర్ముహర్తంలో హితబోధ చేసాడు.
ఈసారి కనిపిస్తే పెద్దవాడని లెక్కచేయకుండా ఆయన్ని పీక పిసికి చంపేయాలి అనుకున్నాను. గంట అవగానే తిట్ల దండకం పూర్తి అయింది. పూనకం తగ్గిపోయింది. వాన వెలిసింది. సద్దు మణిగింది.
“ఇంక లేవండి చేసిన నిర్వాకం చాలు, వెళ్ళి స్నానం చేసి రండి అంది మా ఆవిడ అతి మామూలుగా . గంట క్రితపు భధ్రకాళి ఈవిడేనా అనిపిస్తుంది. ఏదో ప్రీ ప్రోగ్రామ్డ్ సాఫ్ట్ వేర్ లా అనిపించేది కొత్తల్లో.ఆ తరువాత అలవాటు అయిపోయింది.
సాయంత్రం ఐదుఅవుతూండగా ఎవరో బెల్లుకొట్టారు. వెళ్ళి తలుపు తెరిచి చూస్తే ఎదురుగా ముసి ముసి నవ్వులతో వందన. ఆ నవ్వులో ఏదో వ్యంగ్యం. అంతా విన్నానులే అన్నట్టు చూపులు, ఎవరూ అంటూ మా ఆవిడ వెనకాలే వచ్చింది. “ఆంటీ వెళ్ళొస్తాను” అంది వందన. “వుండు బొట్టు పెడతాను అంటూ మా ఆవిడ లోపలికి వెళ్ళగానే “అంకుల్ మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. మీ మనసు చాలా మంచిది. ఆంటీ చెప్పినట్టు వింటే మీకు చివాట్లు తప్పుతాయికదా, చూడండి మీ మొహం ఎంత చిన్న బోయిందోఅంది. దాంతో నా మొహం ఎర్రగాఅయింది.
ఛా, వెధవ బతుకు , అందరికీ లోకువైపోయాను అనున్నాను. దాంతో ఆ అమ్మాయి మీద పూర్తిగా ఇంప్రేషన్ పోయింది . ఆడజాతి మీదే విరక్తి కలిగింది.
ఆ తరువాత జరిగిన మరో సంఘటనతో నాకు ఆ పిల్లమీద పూర్తిగా సదభిప్రాయం పోయింది. అదేమిటంటారా? వినండి చెబుతాను.
మరోసారి, అదీ ఆదివారమే.
బెల్లు మోగగానే వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా నవ్వు మొహంతో వందన , చేతిలో స్వీట్ బాక్స్ తో కనిపించింది.
“అంకుల్ , ఇవాళ నా బర్త్ డే, మీరిద్దరూ బ్లెస్ చేయాలి”అంది.
ఇంతలో మా ఆవిడ వచ్చింది “హాయ్, వందనా, ఏమిటి విశేషం? కొత్త డ్రెస్ లో చాలా అందంగా వున్నావు”అంది. ఇవాళ నా బర్త్ డే ఆంటీ, మీరిద్దరూ బ్లెస్ చేయండి అంటూ మా ఇద్దరి కాళ్ళకి నమస్కారం పెట్టి స్వీట్ బాక్స్ మా ఆవిడ చేతికి ఇచ్చింది. “శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు”‘ అని మా ఆవిడ దీవించగానే “అంకుల్ లాంటి భర్త దొరకాలి అని దీవించండి”అంది. నేను తెల్లబోయి చూసాను.
మా ఆవిడ హహ్హహ్హ అని నవ్వి “ఇంకా మంచివాడే వస్తాడులే .నీకేమి తక్కువ , చక్కగా వుంటావు, చిదిమి దీపం పెట్టుకోవచ్చు అని మా ఆవిడ దీవించి “వుండు నీకో చిన్న గిఫ్ట్ ఇస్తాను అని మా ఆవిడ లోపలికి వెళ్ళగానే “అంకుల్ , మీరు నాకన్నా పాతికేళ్ళు ముందుగా ఎందుకు పుట్టారు? మీరు లేటుగా పుట్టివుంటే నేను మిమ్మల్ని ఎగరేసుకు పోయేదాన్ని. మీలాంటి సాఫ్ట్ మొగుడు దొరకడం ఆంటీ చేసుకున్న అదృష్టం.”అని నవ్వుతూ కన్నుకొట్టింది.
“వామ్మో, వోరి నాయనోవ్, ఈ పిల్ల కొంపలు కూల్చేసేలా వుందే”అనుకున్నాను.ఇంతలో మా ఆవిడ వందనకి అందమైన డ్రెస్ మెటీరియల్ ప్రెజెంట్ చేసింది. ధ్యాంక్స్ అని చెప్పి, “అంకుల్, పనసపొట్టు కూర వండినప్పుడు చెప్పండి , మా ఫ్రండ్స్ ని కూడా తీసుకువస్తాను అని బాంబు పేల్చింది.
“తప్ఫకుండా తీసుకురా, అంకుల్ అద్భుతంగా వండుతారు అని మా ఆవిడ అనగానే నా కళ్ళు బైర్లు కమ్మాయి.
అదండీ సంగతి.
అసలు విషయంలోకి వద్దాం.
పక్కింటి పిన్నిగారు, బాబాయ్ గారు, ఆ రౌడీ పిల్ల వందన మా ఇంటికి భోజనానికి వచ్చారు. సుష్టుగా ఆవపెట్టిన అరటి పువ్వు కూర, దూట పెసర పప్పు, కరకరా అరటికాయ వేపుడు తిన్నారు. అరటి పువ్వు కూర వాళ్ళకి బాగా నచ్చింది. కొంచంకూడా మిగల్లేదు. కానీ వేపుడు, పప్పు బాగా మిగిలి పోయాయి. అరటి పువ్వు కూర చాలా బావుంది అని నన్ను తెగ మెచ్చు కున్నారు . “నువ్వెంతో అదృష్టవంతు రాలివి” అని మా ఆవిడని దీవించి, ఈ సారి ఏమైనా సరే పనసకాయ సంపాదిస్తాను అని చెప్పి అతిథులు వెళ్ళారు.
మా ఆవిడ ఎంత సంతోషించిందో చెప్పలేను.మా ఆయన బంగారు కొండ , నా పరువు దక్కించారు అని మురిసి పోయింది. నా మీద మరీ ఓవర్ గా లవ్వు వచ్చినప్పుడు మా ఆవిడ నన్ను “ఏవండి , మీరు” అని పిలుస్తుంది. స్వర్గం పొలిమేరల్లో వున్నట్టూ , మేఘాల మీద తేలిపోతున్నట్టూ నాకు అనిపించింది . దేముడా, సంసారం ఇలా సాఫీగా సాగిపోయేలా దీవించు అని ప్రార్థించుకున్నాను.
“ఏవండీ మిమ్మల్నే “అన్న మా ఆవిడ కంచు కంఠంతో ఈ లోకంలోకి వచ్చాను.
“ఆ, చెప్పు” అన్నాను.
బుధవారం మనింట్లో కిట్టీ పార్టీ అండి.ఈ సారి నాది పార్టీ.మా వాళ్ళంతా సాయంత్రం నాలుగింటి కి high tea కి వస్తారు.మీరు ఓ గంట పర్మిషన్ పెట్టి వస్తూ వస్తూ Hot chips లో ఒక కేజీ క్యాలీఫ్లవర్ పకోడీలు పట్రండి.మిగతావి నేను చూసు కుంటాను,మర్చి పోకండి. మర్చిపోయారో నా పరువు గంగలో కలుస్తుంది” అని మా ఆవిడ హుకుం జారీ చేసింది.
(నాలాంటి అభాగ్యులకి ఇది అంకితం )
Your style is very nice. Why don’t you write in your name or some pen name. It’s only a suggestion 😁.
చాలా బాగుంది. 😊👌👌
Title చాలా బావుంది. మీ శైలి కూడా చాలా బావుంటుంది. ఈ సీరీస్ ముళ్ళపూడి వారిని గుర్తు చేస్తున్నాయి.