మావూరు ఎర్రవల్లి మరణిస్తూ ఉంది, మళ్లీ జన్మిస్తుందా?

(రుద్రారం శేఖర్)

నా ఊరు ఎర్రవల్లి…నేను గర్వంగా చెప్పుకునే పేరు ఇది. తెలంగాణ సిద్దిపే ట జిల్లాలో నిర్మిస్తున్న మలన్న సాగర్ కోసం ఆత్మార్పణ చేసుకుంటున్నది. ఎవరో భక్తుడు మోక్షం కోసం  శిరస్సు నరికి దేవుడికి సమర్పించుకున్నట్లు ఎర్రవల్లి ఇపుడు మల్లన్న సాగర్ ప్రాజక్టుకోసం ఆత్మార్పణ చేస్తున్నది.

నిన్న మొన్నటి దాకా ఈ ఇక్కడి ఇళ్లలో జీవం ఉట్టిపడింది. ఇక్కడి వీధులగుండా కష్టాలు సుఖాలు కలగలసిన  జీవితం చెక్కుచెదరకుండా ప్రవహించింది. ఇక్కడ  చిన్నపిల్లలు కేకలు,కేరింతలు వినిపించేవి. నవ్వులు వికసించేవి. అపుడుపు  కన్నీళ్లు రాలేవి.   కష్టాలు కనిపించేవి,  నిట్టూర్పులు వినిపించేవి. ఆవెంటనే చిరునవ్వులు వికసించేవి… ఇలాజీవితం శతాబ్దాలుగా సాగింది. ఏకాలమూ ఇక్కడి జీవితాన్ని చిదిమేయలేదు. ఇపుడాపని జరుగుతూ ఉంది.

ఊరు ఖాళీ అయింది. ఇళ్లకున్న కిటీకి ద్వారాలను పెరుక్కుపోతున్నారు. వూళ్లో వాళ్లందరికి గజ్వేల్ దగ్గిర తాత్కాలిక వసతి ఏర్పాటుచేశారు. తర్వాత శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తారు. అక్కడొక వూరు 2బిహెచ్ లతో  నిదానంగా తయారు కావచ్చు. ఎంతయినా ఎర్రవల్లికి ఏదీ సాటిరాదు. అక్కడ గాలిలో  ఎర్రవల్లి సహజ సౌందర్యం ఉంది.గ్రామ జీవన సంగీతం ఉంది. దానికి మరుజన్మ నీయలేము.

కొద్ది రోజుల్లోనే   వూరు కనుమరుగవుతున్నది, వూరు పేరు మాయమవుతుంది.  మరి కొద్ది రోజుల్లో ఆనవాళ్లేవి కనిపించకుండా వూరువూరంతా మటుమాయవుతుంది. ఇది బాధాకరమయిన నిజం.

అందుకే కన్నీరు ఆగటం లేదు… నేను పుట్టిన ఊరు….నేను పెరిగిన నేల… నాకు చదువు నేర్పిన పాఠశాల..నాకు ఈత నేర్పిన నల్లచెరువు అన్ని మాయవవుతాయి.


ఎగిరిపోయిన ఎర్రవల్లి

ఎర్రవల్లి పేర్లోనే ఏదో శక్తుంది;
ఎరుపెక్కిన ఎద లోతుల గాయముంది!
ఎర్రవల్లి ఊర్లోనే ఏదో మహత్తుంది;
ఎత్తైన కొండల్లో పూచిన ఎర్ర మందారమది!

ఇక్కడి మట్టిలోనే మొరటుతనముంది
ఈడి నీళ్ళళ్ల సల్లదనముంది
వీచే గాలిల పెంకితనముంది
ఊరి జనాలల్ల బోళాతనముంది!
ఈ ఊరోళ్ళు
కలెగూర గంప లెక్క
ఒకరికొకరు కల్సిపోవుడే కాదు,
బరి గీసి కలెబడేటోళ్లు గూడా!

పల్లెకు పర్యాయపదమైన ఎర్రవల్లి
ఇప్పుడు పిల్లలు లేని తల్లైంది
రెక్కలిరిగిన పక్షైంది
కొమ్మలిరిగిన చెట్టైంది
నాపరాయి వాకిళ్ళు పొక్కిళ్ళైనై
ఇండ్లల్ల ముండ్ల కంపలు మొలిచినై

చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన బురుజు
దభేల్మని కూలినప్పుడే అర్థమైంది;
చౌదర్ కాడున్న కచీరు
చిన్నబోయినపప్పుడే అనిపించింది
ఏదో ముప్పు కొక్కెం తగిలిందని!
మూడేండ్లకే మునిగిపోతుందనుకోలే!!

ఊర్ని నమ్ముకున్న కుక్కలాగమైనై,
మావోళ్ళు ఏమైపోయిండ్రని
అద్దుమ రాత్రి నిద్దురలేక అరుస్తున్నై
తాళాలు వడ్డ తలుపులు ఢీలా పడ్డై
దూలాలు బిక్కుబిక్కుమంటూ
దిక్కులు చూస్తున్నై
నిల్వ నీడనిచ్చిన గూనపెంకులు
వాన చుక్కల్ల్లా రాలి పడ్తున్నై
పెద్దోల్ల సమాధులు అనాధలైనై

ఎర్రవల్లి ఇప్పుడు
మల్లన్న సాగర్ల మూడు మునకలేసి
మూట్రాజ్ పల్లెల తేలింది
పల్లె బతుక్కి, పట్నం పౌడర్ అతుక్కుంది
ఇన్నాళ్లు యిరాం లేక
యిత్తునాలేసిన చేతులు
పని కోసం మారాం చేస్తున్నై

గిప్పుడు
ఊర్లె ఎవ్వరూ లేరు!
బడిలో సార్లు తప్ప!!
ఊరు ఊరంతా వలసపోయింది
ఇగ మా కథేందోనని
వాళ్లు మనాదవడ్తున్నరు!!!

-గంగాపురం శ్రీనివాస్
ప్రా. పా. ఎర్రవల్లి
మం. కొండపాక
జి: సిద్దిపేట

 


ఇవే నా బాల్యంలో నా ప్రపంచం… కానీ ఇప్పుడు మటుమాయమయ్యే గడియసమీపించింది. నా జీవితంలో జ్ఞాపకాలు మాత్రమే కాదు, వందల ఏళ్ల  వారసత్వ మాధుర్యమంతా చరిత్ర పుటల్లో కలిసిపోతున్నాయి.

నా ఊరు కేవలం ఒక చిన్న గ్రామం మాత్రమే కాదు, ‘అందమైన పల్లెటూరు’ అనే పదానికి కరెక్ట్ డెఫ్నేషన్ చెప్పే మరో ప్రపంచం.

ఊరి పొలిమేరలో తాటి వనం…మైసమ్మ తల్లి గుడి.. ఊరికి ఒకవైపు గిరాయిపల్లి- కొండపాక అడవులు ….మరోవైపు నీటి వసతి లేకున్నా ఏడాదికి రెండు పంటలు పండే పచ్చటి పొలాలు మా గ్రామానికే కాదు మా మండలానికే అందం. మా ఊర్లో సమయాన్ని గడపడం ఊర్లో పుట్టిన నాకే కాదు పట్నంలో ఉన్న నా దోస్తులకు సైతం ఎంతో ఇష్టం.

ఆప్యాయంగా పలకరించే ఊరి ప్రజలు. నేను అక్కో అని పిలిచే లక్ష్మీ అక్క. అమ్మా బాగున్నవా అని పిలిచే భాగ్యమ్మ- పద్మమ్మ. మామ అని పిలిచే సంతుమామ…డార్లింగ్(తాత) అని పిలిచే దశగౌడ్ ఇలా ఒకటి రెండు కాదు వందలు వేళలో ఉన్నారు.

ఈ పోస్టు మీకు నచ్చిందా? అయితే, మీ మిత్రులకూ షేర్ చేయండి!

నాకు వయసుకునే లేకపోయినా స్కూల్ కి వెళ్లి చదువుకుంటే మైయిబెల్లి( అటెండర్) కొట్టిన-తిట్టిన-ఆప్యాయంగా దగ్గరకు తీసిన మధుర క్షణాలు… ఈ  మూగబోయిన గోడలను చూస్తుంటే కళ్లలోనే తిరుగుతున్నాయి. నేను 10వ తరగతి(2009) ఫైనల్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్న రోజుల్లో పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లోనే తిరుగుతున్నాయి. పంద్రాగస్టు- జనవరి 26 సమయాల్లో ఆటల పోటీలు మర్చిపోలేకపోతున్న.

ప్రతి దసరా రోజు యాటను(మేక) కొట్టడం….పీర్ల పండుగరోజు పిరీల ఊరేగింపు బాడుకావ్ వేషం మా కొండపాక మండలంలోనే గొప్పగా జరపడం మా ఊరి విశిష్టత.

పట్నంలో ఉన్న స్నేహితులు ఊర్లకు వస్తే ఉదయాన్నే ఈదుళ్ళకి వెళ్లడం ఎప్పటికీ మర్చిపోలేని రోజులవి. ఎర్రవల్లి గ్రామానికి కూసంత(10కిలోమీటర్లు) దూరంలో మొక్కులు తీర్చే కొమురవేల్లి మల్లన్న దేవాలయం( ఇప్పుడు అదే మల్లన్న సాగర్ లో ఊరు మునిగిపోవడం బాధేస్తోంది.

ఉదయాన్నే లేచి పొలం కాడికి పోయోస్తా అనే పెద్దమనిషి-ముసలయ్య మాటలు మూగబోయాయి. కులవృత్తులు చేసుకోని బతుకుబండి లాగే జీవులు జీవనోపాధి కోసం ఎదురుచూస్తున్నాయి. గల్లా ఎగురేసుకోని తిరిగే ఊరి పెద్దల…పెదవులు పలకడం లేదు. నాలాంటి ఎందరికో ప్రాణం పోసిన ఇండ్లు ఇప్పుడు ఎర్రటి ఎండలో బోడగా కాలిపోతున్నాయి. కష్టం వస్తే చెప్పుకునే ఖషీరు(రచ్చబండ) బస్ స్టాండ్, గ్రామ పంచాయితీ, గ్రామ ప్రజలెక్కడా అని ప్రశ్నిస్తోంది.

ఎప్పుడైనా నా ఊరి గురించి చెప్తుంటే గర్వపడే వాన్ని ఇప్పుడెందుకో కళ్ళలో కన్నీరు వస్తోంది. గొంతుపెగలడం లేదు. ఎవరికో ఒకరికి ఈ మూగవేదన చెప్పుకోవాలనిపించి, ఇలా రాస్తున్నాను.

ఈ గ్రామం  దేశాభివృద్ధికి ప్రాణత్యాగం చేస్తున్నదని అని అందరూ(అధికారులు) ధైర్యం చెప్పినా.. నా గుండెలో గుబులు మాత్రం పోవడం లేదు. కన్న ఊరు..పెరిగిన నేల.. పండించే చేలక.. చదువుకున్న స్కూల్.. కష్టం వస్తే మొక్కే శివాలయం ఇక భవిష్యత్ లో ఉండవు… అనే ఆలోచన వస్తేనే ఏడుపొస్తున్నది.

మొన్నటి వరకు ధైర్యంగా కనిపించిన మనిషులు …ఇప్పుడు మౌనంగా ఉన్నారు. నలుగురి భవిష్యత్( రాష్ట్ర అభివృద్ధి) కోసం మేము మా ప్రాణాలు తప్ప అన్ని త్యాగం చేసాము. మాకు అండగా ఈ లోకం… ధైర్యంగా ప్రభుత్వం ఉంటుందని ఆశిస్తున్నాను

 

రుద్రారం శేఖర్

గ్రామం:- ఎర్రవల్లి
మండలం:- కొండపాక
జిల్లా:- పాతది మెదక్…ప్రస్తుతం సిద్దిపేట.
Pin:- 502301

One thought on “మావూరు ఎర్రవల్లి మరణిస్తూ ఉంది, మళ్లీ జన్మిస్తుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *