తెలుగు రాష్ట్రాల్లో రాముడు,కృష్ణుడు తర్వాత ఎక్కువ వినిపించే దేవుడి పేరు నరసింహుడిదే. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో నరసింహస్వామి అరాధన (Cult of Lord Narasimha) చాలా ఎక్కువ ఉండటమే దీనికి కారణం. ఈ ప్రాంతాల్లో ఉన్న లక్ష్మీనరసింహ ఆలయాలు ఎంత ప్రసిద్ధి చెందాయో అహోబిలం,యాదాద్రి వంటి ఆలయాలు సాక్ష్యం.
నరసింహ స్వామి ఆరాధన ఉత్తర భారతంలో బాగా తక్కువ. చరిత్రకారుల పరిశోధనల ప్రకారం, నరసింహస్వామి (విష్ణుదేవుని దశావతారాల్లోఒకరు) ఆరాధన రాయలసీమలో అహోబిలం లో మొదలయింది. అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు విస్తరించింది
ఈ లెక్కన లక్ష్మీ నరసింహాస్వామి ఆలయాలలో తెలుగు నాట అంత్యంత పురాతనమయినది కర్నూలు జిల్లాలోకి అహోబిలం. నరసింహస్వామికి సంబంధించిన ప్రముఖమయిన ఆలయాలుండేది తెలంగాణ, ఆంధ్రలోనే.
పూర్వకాలంలో నాటి తెగల్లో ఉన్న సింహారాధన నుంచి క్రమంగా నరసింహారాధన వచ్చిందని కొందరు చెబుతారు అంటారు. నరసింహస్వామి భార్య చెంచులక్ష్మి. అహోబిలం చెంచు తెగలుండే ప్రాంతం.హిరణ్యకశ్యపుడిని సంహరించాక ఉగ్రనరసింహుడిగా నరసింహస్వామి నల్లమల అడవుల్లో సంచరిస్తున్నపుడు ఆయన ఉగ్రరూపం చూసి దేవతులు భయపడ్డారు. అపుడు లక్ష్మీ దేవిని కలసి, ఆయన కోపం చల్లారేలా చేయాలని కోరారు. అపుడు లక్ష్మీదేవి చెంచుకన్య రూపం ధరించి నల్ల మల అడవుల్లో సంచరిస్తూ నరసింహ స్వామి కంటపడింది. ఆమెనుచూశాక తనని వివాహం చేసుకోవాలని కోరారు. లక్ష్మీదేవి ఆయనకు అనేక పరీక్షలు పెట్టి చివర వివాహమాడేందుకు అంగీకరించింది. ఆమెయే చెంచు లక్ష్మిఅయ్యిందనేది పురాణగాథ.
నరసింహస్వామి ఆరాధన మీద బాగా పరిశోధన చేసిన ఎ. ఎస్ మన్ ( A. Eschmann) తెలంగాణ, ఆంధ్రప్రాంతంనుంచే నరసింహ ఆరాధన మొదలయిందని వాదిస్తున్నారు.
గంటూరు జిల్లా కొండమోటు దగ్గిర దొరికిన ఒక పలకం మీద నరసింహుడి బొమ్మలున్నాయి (కిందిఫోటో).
నరసింహ అవతారానికి సంబంధించిన ఆధారాలలో పురాతనమయింది ఇదే నని చరిత్రకారులు చెబతారు.ఇందులో నరసింహుడి రెండు చేతుల్లో గద , చక్రం ఉంటాయి.ఇది క్రీ.శ3 వశతాబ్దం కాలానిదని, అందులో కూడదా శాతవాహనుల కాలానిదని చెబుతారు.
క్రీ.శ 4-6 శతాబ్దాల కాలంలో గుప్తుల కాలంలో నరసింహారాధన దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. గుప్త చక్రవర్తులలో ఒకరిపేరు నరసింహగుప్త. హిరణ్య కశ్యపుడి కథ లో ఉండే స్థంభం గుప్తుల అనంతర కాలంలో జోడయిందని చెబుతున్నారు.
ప్రొఫెసర్ సువిరా జైస్వాల్ 1973లో హిస్టరీ కాంగ్రెస్ లో సమర్పించిన ఒక పరిశోధనాపత్రం ప్రకారం నరసింహస్వామి ఆరాధన తెలంగాణ, ఆంధ్ర,ఒదిషా,చత్తీష్ గడ్ ప్రాంతాలలోని తెగల నుంచి వచ్చింది. వారి స్థంభారాధన క్రమంగా వైష్ణవ సంప్రదాయంలోకి చొరబడిందని ఆయన అభిప్రాయం. పూరిజగన్నాథ స్వామి కూడా ఆలయం ఒకపుడు నరసింహాలయమే.
అయితే, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలతోపాటు రాజస్తాన్ నుంచి కేరళ దాకా నరసింహస్వామి ఆలయాలున్నా, ఇప్పటికీ నరసింహారాధన ఎక్కువగా ఉన్న ప్రదేశాలు తెలుగు రాష్ట్రాలే. అక్కడి ఆలయాలు అంత ప్రాముఖ్యం లేనివి.
పెద్దవి చిన్నవి కలిపి ఆంధప్రదేశ్ లో మొత్తంగా 350 నరసింహాలయాలున్నాయి. తెలంగాణలో 169 ఆలయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. కొన్ని మైదాన ప్రాంతాలలో ఉంటాయి.
నరసింహస్వామికి సంబంధించిన ప్రఖ్యాతమయిన ఆలయాలు:
ఆహోబిలం (కర్నూలు జిల్లా), సింహాచలం(విశాఖపట్టణం జిల్లా), మంగళగిరి (గుంటూరు జిల్లా), మట్టపల్లి(గుంటూరు జిల్లా), కేతవరం (గుంటూరు జిల్లా), వేదాద్రి(కష్ణా జిల్లా), అంతర్వేది(తూర్పుగోదావరి జిలా), సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) మాలకొండ (ప్రకాశం జిల్లా),కోరుకొండ (తూర్పుగోదావరి జిల్లా), ఆగిరిపల్లి (కృష్ణా జిల్లా) కదిరి (అనంతపురం జిల్లా) పెన్నహోబిలం( అనంతపురం జిల్లా), తిరుమల యోగనరసింహ స్వామి (చిత్తూరు జిల్లా) వాడపల్లి (నల్గొండ జిల్లా) యాదగిరి గుట్ట (యాదాద్రి జిల్లా), ధర్మపురి (కరీంనగర్ జిల్లా). ఇవి కాకుండా చిన్న చిన్న ఆలయాలు లెక్కలేనన్ని ఉన్నాయి.