సుప్రీం కోర్టు ‘కమిటీ‘ సభ్యుల మీద ఇంత రభస ఎందుకు?

(చలసాని నరేంద్ర)
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయచట్టాల అమలను చేయకుండా సుప్రీంకోర్టు నిన్న  స్టే విధించింది. అదే సమయంలో   ఈ చట్టాలకు వ్యతిరేకంగా 50 రోజులుగా సాగుతున్న రైతుల ఆందోళనకు పరిష్కారం కనుగొనేందుకని కొంతమంది మేధావులతో ఒక కమిటీ నియమిచింది. ఈ క మిటీలో ఉన్ననలుగురు సభ్యుల మీద దేశ వ్యాపితంగా పెద్ద చర్చ నడుస్తూ ఉంది.  సుప్రీంకోర్టు ఈ నలుగురు పేర్లను వెల్లడించినప్పటినుంచి, ఈ కమిటీ వల్ల ప్రయోజనం ఉండదనే వివాదం మొదలయింది. ఎందుకంటే, రైతులేమో ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకోవాలసిందే నంటున్నారు. ఈ నలుగురు మేధావులు కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను సమర్థిస్తూ పత్రికలలో వ్యాసాలు రాశారు. చట్టాలను సమర్థించిన వారితో చట్టాలను ఈ  చటాలను పరిశీలించి ఒక నివేదిక ఇవ్వమని అడగడం సబబు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది.  గతంలో  ఏవో  చట్టాలనుకూలంగా రాశారని కమిటీ సభ్యలును వ్యతిరేకించడం సబబా? అలాగయితే,  గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిన ప్రభుత్వాల పార్టీల సంగతేమిటి అని అడుతున్నారు  సీనియర్ జర్నలిస్టు  చలసాని నరేంద్ర .
(చలసాని నరేంద్ర)
భారత రాజ్యాంగం చట్టాలను రూపొందించడం, విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడం పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల బాధ్యతలుగా స్పష్టం చేస్తుంది. న్యాయస్థానాలు కేవలం వాటి రాజ్యాంగబద్దత, చట్టబద్దత పైననే మాత్రమే స్పందించగలవు. కానీ మూడు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తూ, వాటి పరిశీలనకు నలుగురు నిపుణులతో ఒక కమిటీ నియమిస్తూ సుప్రీం కోర్ట్ తీసుకున్న నిర్ణయంను `అసాధారణం’ గా పేర్కొనవచ్చు. 
 
విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ చట్టాల రాజ్యాంగబద్దత గురించి సుప్రీం కోర్ట్ లో వాద,  ప్రతివాదనలు జరగనే లేదు. సంబంధిత ప్రశ్నల పరిశీలనను న్యాయస్థానం చేపట్టనే లేదు. మరోవంక,  ప్రభుత్వం,ఈ చట్టాలపై ఉద్యమం చేస్తున్న రైతు సంఘాల నాయకులు ఇప్పటికే ఎనిమిది పర్యాయాలు చర్చలు జరిపారు. తొమ్మిదో పర్యాయం చర్చలు ఈ నెల 15న జరుగనున్నాయి. చర్చలు ఇక జరిపే ప్రసక్తి లేదని రెండు వైపులా నుండి ఇప్పటి వరకు ఎవ్వరు పేర్కొనడం లేదు. 
 
చట్టబద్దమైన ఎటువంటి అధికారం లేకుండానే పరిపాలన, రాజకీయ యాజమాన్యంలో జోక్యం చేసుకోవడంగా దీనిని ప్రముఖ వ్యవసాయ నిపుణులు భాను ప్రతాప్ సింగ్ అభివర్ణించారు. ప్రజాస్వామ్యంను కాపాడే నెపంతో పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నంగా ఘాటైన పదజాలం వాడారు. 
 
అయినా సుప్రీం కోర్ట్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం ఒకింత అసమ్మతిని వ్యక్తం చేస్తూనే, ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీకి సహకరిస్తామని ప్రకటించింది. వాస్తవానికి మొదటినుండి ప్రభుత్వం ఈ చట్టాల గురించి ఎవ్వరితో అయినా చర్చలకు సిద్దమే అని, ఈ చట్టాలలో రైతులకు ఇబ్బంది కలిగించే అంశాలను నిర్దిష్టంగా తమ ముందుంచితే, ఆ మేరకు చట్టాలను సవరించడానికి సిద్దమే అని ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. 
 
ఆ మేరకు పలు సవరణలను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇప్పటి వరకు చర్చలలో రైతు సంఘాల నేతలు నిర్దిష్ట ప్రతిపాదనలు ఏవీ ఉంచకుండా, చట్టాలను రద్దు చేయాలనీ మాత్రమే కోరుతున్నారు. అటువంటప్పుడు సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ ఎటువంటి ప్రయోజనం కలిగించగలడో అనుమానాస్పదమే. 
 
సుప్రీం తీర్పుతో రైతులు, రైతు సంఘాలు పూర్తిగా విబేధించాయి. తాము కొద్ది రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక నిరసనను ఇకపై కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుప్రీం కోర్ట్ కమిటీతో తాము చర్చలు జరిపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాయి. ప్రభుత్వంతో చర్చలకు మాత్రం తలుపులు మూసుకోలేదని చెబుతున్నాయి. ఇదొక్క విచిత్ర పరిస్థితి అని చెప్పవచ్చు. 
 
వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్ధతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వడం మినహా మరే ప్రతిపాదనకు తాము ఒప్పుకోబోమని రైతులు మరోసారి స్పష్టం చేశారు.  పైగా,  వ్యవసాయ చట్టాల వివాదంపై కమిటీ వేస్తామని సుప్రీం కోర్టు ప్రకటించడం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని కొందరు ఉద్యమ నాయకులూ ఆరోపిస్తున్నారు. కేంద్రంపై భారం తగ్గించుకోవడానికి సుప్రీం కోర్టు ద్వారా కమిటీ వేయించారని క్రాంతి కార్ కృషి అధినేత దర్శన్ పాల్  విమర్శిస్తున్నారు.
 
 కమిటీలో ఉన్న సభ్యులంతా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులేనని, రైతుల పక్షాన ఉన్నవాళ్లు ఒక్కరు కూడా లేరని భారతీయ కిసాన్ యూనియన్ (ఆర్) నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ఆరోపించారు. వాస్తవానికి సుప్రీం కోర్ట్ నియమించిన నలుగురు సభ్యులలో ఒకరైన భారతీయ కిసాన్ యూనియన్ అధినేత, అఖిల భారత కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ కోఆర్డినేటర్ భూపేంద్ర సింగ్ మాన్ 2019 ఎన్నికలలో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ కి బహిరంగంగా మద్దతు తెలిపారు. 
 
ప్రస్తుతం రైతుల ఉద్యమంకు కాంగ్రెస్ అండగా ఉండటం తెలిసిందే. ఆయన  రాజ్యసభ మాజీ సభ్యులు కూడా.  కేంద్రంలో బిజెపి అధికారమలో లేని సమయంలో, 1990లో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. కొత్తగా రైతు నేత అవతారం ఎత్తిన యోగేంద్ర యాదవ్ వంటి వారి దీనిని `సర్కారీ కమిటీ” అని అపహాస్యం చేయడం రాజకీయ దురుద్దేశ్యపూర్వకంగానే భావించవలసి ఉంటుంది. 
 
వ్యవసాయ చట్టాలను ఈ నలుగురు సభ్యులు సూత్రప్రాయంగా సమర్ధించడాన్ని ఈ సందర్భంగా పలువురు ఎత్తి చూపుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 2019లో తమ ఎన్నికల ప్రణాళికలో ఈ మేరకు వాగ్దానం కూడా చేయడం గమనార్హం. సూత్రప్రాయంగా ఈ చట్టాలలో ఉద్దేశించిన సంస్కరణలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ చెప్పగలదా?  
 
యుపిఎ పాలనలో వ్యవసాయ మంత్రిగా శరద్ పవర్ ఈ సంస్కరణలు తీసుకు రావడానికి ప్రయత్నం చేయలేదా?  నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సంస్కరణలు తీసుకు రాలేక నిస్సహాయంగా ఉండిపోలేదా? సుప్రీం కోర్ట్ నిర్ణయంపై ఇప్పటి వరకు శరద్ పవర్ మాత్రమే స్పందిస్తూ స్వాగతించారు. ఈ కమిటీ ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
 
సుప్రీం కోర్ట్ ఈ చట్టాల చట్టబద్దతను ప్రశ్నించక పోవడం గమనార్హం. ఈ చట్టాలను కొట్టివేయలేదు. కేవలం ఆందోళన చేస్తున్న రైతుల ఉద్దేశ్యాలను తెలుసుకోవడం, మరోవంక ప్రభుత్వ వాదనలను పరిశీలించడం ద్వారా ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనకు సంబంధించిన అంశాలను నివేదించడం కోసమే ఈ కమిటీ నియామకం జరిగిన్నట్లు కనబడుతున్నది. 
 
సుప్రీం కోర్ట్ నియమించిన నలుగురు సహితం సూత్రప్రాయంగా వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తున్నా అమలు విషయంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నవారే. పలు సవరణలు అవసరమని సూచిస్తున్నవారు కూడా ఉన్నారు. ఈ కమిటీ మొదటి సమావేశం పది రోజులలో జరగాలని సూచించడం ద్వారా ప్రభుత్వం – ఆందోళన చేస్తున్న రైతుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించడం కోసం సుప్రీం కోర్ట్ రాజ్యాంగబద్ధమైన చర్యకు పూనుకున్నదని భావించవచ్చు. 
 
పైగా మొదటి సమావేశం జరిగిన రెండు నెలలోగా తన నివేదికను ఈ కమిటీ ఇవ్వాలని పేర్కొనడం ద్వారా కేవలం కాలయాపన కోసం ఈ కమిటీ నియామకం జరగలేదని స్పష్టం అవుతున్నది. 
 
వాస్తవానికి రైతు సంఘాల ప్రతినిధులతో చర్చల సందర్భంగా వారి అభ్యంతరాల పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రులు సుముఖత మొదటి నుండి వ్యక్తం చేస్తూ వస్తున్నది. అటువంటి నిర్దిష్ట అంశాలపై చర్చలకు వారే ముందుకు రాకపోవడంతో చర్చలలో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. 
 
అందుకనే సుప్రీం కోర్ట్ వ్యవసాయ చట్టాల అమలుపై స్టే ఇవ్వడం పట్ల ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నప్పటికీ,  ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న చొరవను స్వాగతిస్తున్నామని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు సంప్రదింపులకు సంసిద్దంగానే ఉంటున్నదని గుర్తు చేశారు. 
 
సుప్రీం కోర్ట్ నియమించిన నాలుగురులలో ఒకరైన   మహారాష్ట్రకు చెందిన అనిల్ ధన్వంత్ షెత్కారి సంఘటన అధ్యక్షుడు. ఈ సంఘాన్ని స్థాపించిన శరద్ జోషి భారత దేశంలో వయ్వసాయ రంగంలో సంస్కరణలకు అలుపెరుగని పోరాటం చేసిన తొలి యోధుడు అని చెప్పవచ్చు.
 
వామపక్షాలు వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకించడం సైద్ధాంతిక అంశం. ఈ సంస్కరణలు అమలు జరిపితే దేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు క్రమంగా అదృశ్యం అవుతాయని వారు   ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సుదీర్ఘకాలం వామపక్షాలు అధికారమలో ఉన్న కేరళలో వ్యవసాయ మార్కెట్ కమిటీలే ఎందుకని లేవు?  అక్కడ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతున్నదా?
 
1991లో పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్ధిక సంస్కరణలతో భారత దేశం ప్రపంచంలో శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థలలో ఒకటిగా ఎదిగినా,  గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఈ సంస్కరణలను విస్తరింపక పోవడంతో ఆర్ధిక అసమానతలు పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగు పడటం లేదు. 
 
వ్యవసాయ సంస్కరణలు తీసుకు రావాలని అప్పటి నుండి చేస్తున్న ఫలితాలు ఫలించడంలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ తీసుకు వచ్చిన ఈ సంస్కరణల పట్ల దేశంలో రాజకీయంగా ఏకాభిప్రాయం దాదాపుగా చిరకాలంగా ఉంది. కానీ రాజకీయ ప్రయోజనాలే అమలుకు అడ్డంకులుగా మిగులుతున్నాయి. 
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *