(భమిడిపాటి ఫణిబాబు)
సాధారణంగా చాలామంది తమ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసికోవడంలో ఎంతో ఆనందం అనుభవిస్తూంటారు.
ప్రస్తుత కాలమాన పరిస్థితులతో రాజీ పడలేకనండి,ఇమడలేకనండి, “పాతరోజులే ఎంతో బాగుండేవీ..” అని అనుకోవడమో, పత్రికల్లోనో, బ్లాగుల్లోనో వ్రాసుకుని, ఓసారి సంతోషపడుతూంటారు.
నిజమేకదా, కనీసం ఓ “వేదిక” లాటిది ఉండడం ధర్మానా, అంతర్జాలం లో ఉండే సదుపాయం వలననండి, సాధ్యపడుతోంది. దానికి సాయం, ఇరవయ్యో శతాబ్దంలో పుట్టిన వారికి, కావాల్సినన్నీ జ్ఞాపకాలు.
ఇంట్లో ఏదైనా సంఘటన జరిగితే చాలు… “ మారోజుల్లో ఇలా ఉండేదీ, అలా ఉండేదీ..” అంటూ ఓ చిఠ్ఠా విప్పడం. ఓపిక ఉన్నవాళ్ళు వింటారు, లేనివాళ్ళు “ బాబోయ్..మళ్ళీ మొదలెట్టాడురా బాబూ..” అనుకుంటారు. ఇది సందర్భాన్ని బట్టికూడా ఉంటూంటుంది. అలాగని, చిన్ననాటి జ్ఞాపకాలని, మరీ తుడిచిపెట్టేయంలేముగా. మనం బతికున్నంతకాలమూ, మనతోటే ఉంటాయి, నచ్చినా నచ్చకపోయినా. ఇదిమాత్రం నికార్శైన నిజం.
ఆరోజుల్లో ఒంటరిగా పిల్లల్ని బయటకే వదిలేవారు కాదు, అధవా, వెళ్ళాల్సొచ్చినా, నానా ఆంక్షలూ పెట్టే. ఫలానాటైముకి రావాలీ అంటే రావాలే. ఈరోజుల్లో చెప్పడం మాటటుంచండి, ఇంటికి టైముకి రాలేదూ అంటే, అదృష్టం బాగుండి, ఆ పిల్లకో, పిల్లాడికో గుర్తొచ్చి, ఫోను చేసినప్పుడే గతి. ఇదంతా so called freedom అన్నమాట. ఆ తరువాత ఏమైనా అయితే, నెత్తీ, నోరూ మొత్తుకోడం. ప్రతీ ఇంట్లోనూ ఇలాగే ఉంటుందని కాదూ, కొన్ని so called forward thinking కుటుంబాల్లో జరిగేదిదే. బహుశా అదే కారణమయుంటుంది.
టీవీ చానెళ్ళ వార్తల్లో ప్రతీరోజూ, ఎక్కడో అక్కడ ఏదో కిడ్నాపింగయిందనో, అత్యాచారం జరిగిందనో వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి..అలాగని పాతరోజుల్లో తల్లితండ్రులు పెట్టిన ఆంక్షలవలన, ఏదో నష్టం జరిగిందనికూడా చెప్పడానికి ఎటువంటి ఋజువులూ కూడా లేవు.. వచ్చిందల్లా సమాజంలో మార్పు.. పాతరోజుల్లో ఎవరైనా చిన్నపిల్లాడు దిక్కుతోచకుండా అటూఇటూ తిరుగుతూంటే, ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయడమో లేక ఏ పోలీసు స్టేషన్ లో అప్పగించడమో చేసేవారు.. అదే ఈ రోజుల్లోనో, ఒంటరిగా కనిపించడం తరవాయి, వయసుతో సంబంధం లేదు.. ఈ పిల్ల / పిల్లాడు మనకి ఎలా ఉపయోగిస్తాడూ అనే చూడ్డం..
ఆరోజుల్లో తొలకరి చినుకు పడిందంటే చాలు, మట్టి వాసన వచ్చేది. ఆ సువాసన జీవితంలో మర్చిపోగలమా? కానీ ఈ రోజుల్లో “ మట్టి” అనేది “వట్టి మాట” గా మిగిలిపోయింది. ఇంక వాసన లెక్కణ్ణించొస్తాయీ?
ఈ రోజుల్లో, బయటకి వెళ్తే, తిరిగి సజావుగా ఇంటికి వస్తామో, లేదో ఆ పెరుమాళ్ళకే ఎరుక. అసలు తిరిగిరాలేకపోతే, ఓ ఏడుపు ఏడ్చేసి ఊరుకుంటారు.. ఏ కాలో,చెయ్యో విరిగిందంటే, ఆ విరక్కొట్టుకున్న మనిషికి బాధైతే ఉంటుందే, కానీ, అతనికి సేవలు చేయడానికే కష్టం. ఆసుపత్రుల చుట్టూ తిరగడం, వచ్చే పోయే చుట్టాలని చూసుకోడంతోనే సరిపోతుంది. ఈరోజుల్లో వీటన్నిటికీ టైముండడం లేదు. దానితో, ఈరోజుల్లో ఇన్స్యూరెన్సుల ధర్మాననండి, లేదా వచ్చే జీతాల వలనైతేనేమిటి, కావాల్సినన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచేస్తున్నారు. ఇంటికొచ్చేసిన తరువాత, ఓ ఎటెండెంటుని పెట్టేస్తే సరిపోతుంది. ఇలాటి పరిస్థితుల్లోనే చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరువేసికుంటూంటారు.
చిన్నప్పుడు, ఒళ్ళు కొద్దిగా వెచ్చబడిందంటే చాలు, ముందుగా స్కూలు మాన్పించేయడం, , ఇంట్లోనే ఉండే ఏ అగ్నితుండు మాత్రో వేయడం, లేదా ఏదో “ కొప్పి” ని అరగదీసి, తేనెతో నాకించడం, మరీ ఏ తలనొప్పో వస్తోందంటే, ఏ శొంఠిముక్కో గంధంతీసి, నుదిటిమీద ఆరారగా పట్టువేయడం… అదీకాపోతే, ఏ ఫ్యామిలీ డాక్టరుగారినో ఇంటికే పిలిచి, ఓ సూదిమందో, అరకో ఇప్పించడం. అంతా మహారాజభోగం.
జ్వరం తగ్గకపోతే, ఏ పక్కింటి పిన్నిగారో వచ్చి పరామర్శించడం, “అయ్యో మేకులాటి కుర్రాడు ఎలా అయిపోయాడో “ అంటూ పరామర్శించడం. అన్నీ పూర్తయిన తరువాత “పథ్యం”—ఏ బీరకాయకూరో చేసి, చారు, కారప్పొడీ, చింతకాయ పచ్చడితో,నెయ్యేసి, వేడివేడిగా ముద్దలు చేసి తినిపించడం. ఇంతతిండీ తిని, నిద్రపోతే, జ్వరం మళ్ళీ తిరగబెడుతుందని, ఎవరో ఒకరు పక్కనే ఉండడం. ఎటుచూసినా, unadulterated attention… ఎంతగా అంటే, ప్రతీరోజూ “జ్వరం” వస్తే ఎంతబాగుంటుందో కదా అని అనుకునేటంత !!
మరి అదే ఈ రోజుల్లో చూడండి, తగ్గకుండా ఓ రెండ్రోజులు జ్వరం వచ్చిందంటే చాలు, ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనో నానా టెస్టులూ చేయించి, ఏవేవో కొత్తరోగాలుకూడా కనిపెట్టడం. ఇంట్లో ఉండే ఏ పిల్లో, పిల్లాడో తుమ్మితే చాలు, ముందుగా చేసేది, గూగుల్ లో వెదికేయడం.. టెక్నాలజీ ధర్మమా అని ఈరోజుల్లో అన్ని విషయాలూ తెలుస్తున్నాయి. కానీ బంధాలూ అనుబంధాలూ అటకెక్కేశాయి. అదీ దురదృష్టం.
కనీసం నెమరు వేసికోడానికి కొన్నైనా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి, ప్రీ-2000 వారికి. శలవులొచ్చినప్పుడు, ఓ పదిహేనురోజులు అమ్మమ్మగారింట్లోనూ, ఓ పదిహేనురోజులు నానమ్మగారింట్లోనూ, గడపడం లాటివి.
కానీ ఈరోజుల్లో శలవలొస్తున్నాయంటే చాలు, ఏ ప్యాకేజీ బావుందీ, ఏ దేశానికెళ్తే బాగుంటుందీ అనే ఆలోచన. వెళ్ళొచ్చు, కాదనరెవరూ, కానీ ఏ నాలుగేళ్ళో, అయిదేళ్ళో ఉన్న కొడుక్కో, కూతురికో, ఈ విహారయాత్రలు గురించి, పెద్దయిన తరువాత ఎంతవరకూ గుర్తుంటాయీ అనేదే ప్రశ్న. “ మా ఫ్యామిలీ కూడా హాలిడేస్ కి ఫలానా చోటుకెళ్ళామూ..” అని ఒకరికొకరు పోటీగా చెప్పుకోవడానికి తప్ప, ఇంకో ఉపయోగం ఉండదు.
ఇంక జ్ఞాపకాలు విషయానికొస్తే, ఈరోజుల్లో ఉండే పిల్లలకి “ బాల్యం” అనేది, కాలూ, చెయ్యీ వచ్చేదాకానే. ఆతరువాత, చేతిలో ఓ ఐపాడ్డూ, ఇంకో చేతిలో ఓ రిమోట్టూ. ఓ పదిపదిహేనేళ్ళు గడచిన తరువాత, సంఘంలో ఓ పెద్ద పేరు సంపాదించిన తరువాత, ఎవరో“ మీ చిన్ననాటి జ్ఞాపకాలు మాతో పంచుకుంటారా ..” అని అడిగితే, సమాధానం మహా అయితే, యాపిల్ 10G, లేదా SAMSUNG 16 G ఏ కానీ ఇంకోటేదీ గుర్తురాదు.
మనకి మనమే మన చిన్నపిల్లల “మధుర జ్ఞాపకాల “ ని తుంపేస్తున్నాము. దేశాన్నేదో ఉధ్ధరించఖ్ఖర్లేదు, మన పిల్లలకి , వారి జన్మ హక్కు ఇస్తే పదివేలు. ఈరోజుల్లో వేలంటే మళ్ళీ నవ్వుతారు, పోనీ పది లక్షలందాము.
(భమిడిపాటి ఫణి బాబు, సొంతఊరు అమలాపురం, స్థిరపడింది మహారాష్ట్ర పుణే లో)