జనవరి 12 వ తేదీన 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా ను జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్ నగర్ డివిజన్ SPR హిల్స్ లో ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగరం ప్రజలకు ఉచితంగా మంచినీళ్లు సరఫరా చేస్తామన్నది కెటిఆర్ జిహెచ్ ఎం సి ఎన్నికల హామీ. ఈ హామీ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ పథకం అమలు జరిగితే, ఢిల్లీ తర్వాత దేశంలో ఉచిత నీటి సరఫరా పథకం అమలుచేస్తున్న నగరం హైదరాబాద్ అవుతుంది.ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఉచిత మంచినీటి సరఫరా పథకం అమలు చేశారు.
హైదరాబాద్ లో ఈపథకం వల్ల 9 లక్షల మంది వినియోగ దారులు లబ్ది పొందుతారు.
నీటివినియోగం 20 వేల లీటర్ల లోపు ఉన్నవాళ్ల కు మాత్రం ఈపథకం వర్తిస్తుంది. అంటే ఆకాశ హర్య్మాలకు, వ్యాపారసంస్థలకు, రెసిడెన్సియల్ బ్లాకులకు ఇది వర్తించదు.ఎందుకంటే అక్కడ రోజు వారి వినియోగం 20 వేల లీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది.
20 వేల లీటర్ల లోపు నీటివినియోగం ఉన్నవారికి బిల్లులు వెళ్లకుండా సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయడం మొదలయింది.
రహ్మత్ నగర్ డివిజన్ నుంచి ఈ పథకం ప్రారంభిస్తున్న విషయాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
సోమవారం నాడు ఆయన టిఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కలసి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రారంభ కార్యక్రమంలో GHMC పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.