కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పూర్వరంగంలో నాడు స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ ముందస్తు జాగ్రత్తగా వాయిదా వేసింది.
కరోనా తగ్గు ముఖం పట్టిన పూర్వరంగంలో బీహార్ శాసనసభకు, కొన్ని లోక్ సభ స్థానాలకు ఉపఎన్నికలు, హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఇటీవల జరిగాయి.
త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగవచ్చని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మద్యం షాపులు తెరిచారు. విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు తెరవబోతున్నారు.
రాజకీయ పార్టీల కార్యకలాపాలు, వ్యాపార-వాణిజ్య కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా జీవనంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
వాక్సిన్ అందుబాటులోకి రావాలి. తరువాత ప్రజలందరికీ వాక్సిన్ వేయడానికి కనీసం ఏడాది కాలంపైనే పట్టవచ్చు. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సమంజసమా!
ఒక్క పాలక పార్టీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్వహించిన సమావేశంలో తెలియజేశాయి. పాలక పార్టీ ఆ సమావేశాన్ని బహిష్కరించింది. కాబట్టి ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేయకుండా ఎన్నికల నిర్వహణకు సహకరించడం సముచితంగా ఉంటుంది.
(టి.లక్ష్మీనారాయణ,సామాజిక ఉద్యమకారుడు)