అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు అమెరికన్ హిస్టరీలో కనిపించే ఒకే ఒక అధ్వాన్నపు అధ్యక్షుడు. ఇంకొక 12 రోజుల్లో ట్రంప్ ఇంటి దారి పడతాడు. జనవరి 20, 2021 బుధవారం నాడు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడవుతాడు. అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచాడని నిన్న అమెరికా పార్లమెంటు అమోదించింది.
ఇది జరుగుతుందని భరించలేక తన అల్లరి మూకను ట్రంఫ్ క్యాపిటల్ హిల్ (Capitol Hill) ఉసి కొల్పాడు. వాళ్లు లోనికి ప్రవేశించారు. బీభత్సం సృష్టించారు. నలుగురు చనిపోయారు.
ప్రజాస్వామ్యానికి కాపలా అని చెప్పుకునే అమెరికాను ట్రంపు నవ్వుల పాలు చేశారు. అందరు ట్రంపును తిట్టి పోశారు. ప్రపంచనేతలంతా అమెరికాను ఏవగించుకున్నారు.
సరే, ఇది వేరే కథ. ఇంతకీ క్యాపిటల్ హిల్ అంటే ఏమిటి? ఇండియాలో దాన్నేమంటారు?
క్యాపిటల్ హిల్ అంటే అమెరికా పాలనా వ్యవస్థలోని శాసన నిర్మాణ విభాగం. అంటే మన పార్లమెంటు వంటిది. ఇందులో ప్రజాప్రతినిధుల సభ (లోక్సభ), సెనెట్ (రాజ్యసభ ) ఉంటాయి.
మనం లోక్ సభ రాజ్యసభ (రాష్ట్రపతిని కలిపి) లను మనం పార్లమెంటు అన్నట్లే, అమెరికన్లు హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్ ని, సెనెట్ ని కలిపి యుఎస్ కాంగ్రెస్ అంటారు.
యుఎస్ కాంగ్రెస్ లో ఓటు హక్కున్న సభ్యులు 535 మంది ఉంటారు. వీరిలో 100 మంది సెనెటర్స్, మిగతా 435 మంది రెప్రెజెంటేటివ్ లు . వీరుకాకుండా మరొక ఆరుగురు వోటింగ్ లేని సభ్యులుంటారు. వీళ్లను కలిపితే, యుఎస్ కాంగ్రెస్ బలగం 541 అవుతుంది.
ఈ భవనాన్ని క్యాపిటల్ హిల్ మీద 1793లో కట్టారు. ఈ గట్టు పేరు జెంకిన్స్ హిల్. ఇక్కడ రాజధాని నిర్మాణం జరగాలని 1970లో నాటి దేశాధ్యక్షుడు వాషింగ్టన్ స్థలాన్ని ఎంపిక చేశారు. ఆయనే దీనికి క్యాపిటల్ హిల్ అని పేరు పెట్టారు.
మెల్లిమెల్లిగా విస్తరిస్తూ ఈ భవనం 1892 నాటికి ఇపుడున్న ఆకారానికి వచ్చింది. పూర్వం ఇందులో నే సుప్రీంకోర్టు, పార్లమెంటు లైబ్రరీ కూడా ఉండేవి. 1897లో లైబ్రరీ ఇక్కడి నుంచి మరొక చోటికి తరలివెళ్లింది. 1935లో సుప్రీంకోర్టు సొంత భవనంలోకి మారింది.