కల చెదిరినా, కథ మారకూడదు (వ్యక్తిత్వ వికాసం)

(అహ్మద్ షరీఫ్)

కలలనేవి నిద్రలో కనేవి కావు, అవి మనల్ని నిద్ర పోకుండా చేసేవి” – A.P.J. అబ్దుల్ కలాం 

జీవితం లో ఉత్సాహవంతంగా ముందుకు సాగడానికి కలలూ, కోరికలూ అవసరం.  అవి లేకపోతే జీవితం నిస్సారంగానూ, స్తబ్ధంగానూ  వుంటుంది. కలలు కనాలి వాటిని సాకారం చేసుకోవడానికి సాగాలి అనే అంశం పై బోలెడు వ్యక్తిత్వ వికాస పాఠాలున్నాయి.

ప్రతి మనిషి జీవితం లో రెండు పార్స్వాలుంటాయి   ఆదర్శాలూఆశయాలూ, కలలూ నిండిన ఆశల జీవితం ఒక వైపు వుంటే విధులు, బరువు బాధ్యతలూ  మరో వైపు వున్న అసలు జీవితం. మొదటిది వూహల మయమైతే, రెండొది వాస్తవికతల తో కూడుకున్నది. వర్తమానం లో వున్నది.

చదువు పూర్తయిన తరువాత ప్రతి మనిషికి ఒక ఉద్యోగం కావాలి. అది అవసరం. అవసరాల విషయం లో మనిషి అట్టడుగునుంచే మొదలు పెడతాడు. అంటే ఏ వుద్యోగమైనా ఫరవాలేదు.ఒక ఉద్యోగం కావాలంతే అనుకుంటాడు. ఉద్యోగం వస్తుంది దానితో పాటు జీవితావసరాలు తీర్చుకునే సామర్థ్యమూ వస్తుంది. కూడూ, గూడూ, గుడ్డ అనే అవసరాలు వస్తాయి. ఇవి ఇంకా అవసరాలుగానే వుంటాయి కాబట్టి వీటి విషయం లో అతడు పెద్దగా ఛాయిస్ తీసుకోడు. అందుకే ఇప్పట్లో ఒక సాదా అపార్ట్ మెంటు (1 BHK) అనుకుదాం, అవసరం తీరుస్తుంది. అది అసలు జీవితం లో భాగమవుతుంది. అయితే ఇక్కడే అతడు తన ఆశల జీవితానికి గేటెడ్ కమ్మ్యూనిటీ లో ఒక విల్లా చేరుస్తాడు. ఇది అతడి కల అవుతుంది. 

ఇలాంటి కలను సాకారం చేసుకోదలచిన వ్యక్తి 1 BHK లోని వసతుల్ని, పరిసరాల్ని ప్రతి రోజూ  ఏవగింపు తో నిరసిస్తూ, “ ఛీ….1 BHK జీవితం, దరిద్రం.. అంటూ నెగెటివ్ ఆలోచనలకు  తావు ఇవ్వకుండా, విల్లా తీసుకున్నప్పుడు జీవితం ఎలా మారుతుంది? అని పాజిటివ్ గా మాత్రమే ఆలోచిస్తూ పోతే, తన కలను సాకారం చేసుకునే ప్రేరణ పొందుతాడు. నెగెటివ్ అలోచనా విధానం అతడి కల పట్ల నిరుత్సాహాన్ని పెంపొందిస్తుంది. అతడిలో అసమర్థతా భావాన్ని కలిగిస్తుంది.

మనిషి భవిష్యత్తులోని కలల జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి వర్తమానం లోని అసలు జీవ్వితాన్ని అశ్రధ్ధ చేయలేడు. అలా చేస్తే వర్తమానమే పాడయిపొతుంది. ప్రతిరోజు నిస్సారంగా నడుస్తుంది  ఈ రెండు పార్శ్వాలను  బాలెన్సు చేస్తూ ముందుకు సాగాలి. అంటే వర్తమానపు జీవితాన్ని ఏవగించుకోకూడదు. భవిష్య జీవితపు కలల్ని వదిలేయకూడదు.

కలలు తీరినప్పుడు మనకు కలిగే సంతోషం కంటే, అవి తీరనప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువగా వుంటుందిఅంతే కాదు, ఒక మనిషి జీవితం లో, ఆ కలలూ కోరికలూ తీరక పోవడం వల్ల వాటిల్లే నష్టం కంటే, అవి తీరలేదే అని పదే పదే ఆలొచించడం వల్ల వచ్చే మనస్తాపం కలిగించే నష్టమే,  చాలా ఎక్కువగా వుంటుంది.

తీరని కోరికలూ, సాకారం చేసుకోలేని కలలూ, మానసిక దుస్థితిని కలుగచేస్తాయి. దీనినే మనం చింత అనొచ్చు

 “సజీవం దహతే చింతా, నిర్జీవం దహతే చితా”  అన్నారు పెద్దలు.  

అందుకే కల చెదిరింది అని కలత పడకుండా, “ఇంకా వుంది..” అనే పాజిటివె ఆలోచనతో, ఆశాభావంతో ముందుకు సాగితే, ఏదో ఒక రోజు ఆ కల తీరుతుంది. 

(అహ్మద్ షరీఫ్, వ్యక్తి త్వ వికాస నిపుణుడు,  ప్రాజక్ట్ మేనేజ్ మెంట్ కోచ్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *