హైదరాబాద్, జనవరి 7 : ధాన్యం ప్రొక్యూర్ మెంట్ మీద ముఖ్యమంత్రి కెసిఆర్ యు టర్న్ తో ప్రభుత్వం పంటను కొనడం మానేస్తే రేపటి నుంచే రాష్ట్రంలోని దళారులు మద్దతు ధర కంటే తక్కువగా రైతుల వద్ద పంటను కొనేందుకు, రైతులను పీడించేందుకు పథక రచన చేస్తారని తెలంగాణ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ రోజు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.
ఇది కేవలం రైస్ మిల్లర్లతో ముఖ్యమంత్రి కుమ్మక్కై దళారులకు మేలు చేసేందకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆయన ఈ రోజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ధర కన్నా ఒక్క రూపాయి తగ్గినా ఈ సమాజం తీవ్రంగా నష్టపోతుందని చెబుతూ ప్రజల కోసం చేసే పనులను ప్రభుత్వం ఎప్పుడూ లాభాపేక్షతో చూడరాదని భట్టి విక్రమార్క చెప్పారు.
భారత రాజ్యాంగం ప్రకారం నడిచే ప్రభుత్వాలన్నీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాయిని చెప్పారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు, ప్రజల కోసం ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తోందని చెప్పడం మూర్ఖత్వమని అన్నారు. పాలన ఉన్నదే ప్రజల కోసం అని భట్టి చెప్పారు. రాష్ట్రం అంటే కార్పొరేట్ సంస్థ కాదు, దీనికి కేసీఆర్ సీఈఓ కాదని భట్టి అన్నారు. దుర్మార్గపు ఆలోచనలను కేసీఆర్ దూరం పెట్టాలని హితవు పలికారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ నెల 9న ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ధర్నా చేస్తున్నట్లు భట్టి తెలిపారు.
రైతుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలాయన వాదం పాటించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు.
భారత్ బంద్ సమయంలో రైతులకు మద్దతు పలికి ఢిల్లి వెళ్లి యూ టర్న్ తీసుకున్నారని అంటూ ఢిల్లీ వెళ్లిన ప్రధానిని కలసిన కేసీఆర్ అక్కడకు దగ్గరలోనే ధర్నా చేస్తున్న రైతులను కలవకపోవడం ఆయన నైజాన్ని బయట పెట్టిందన్నారు
రాష్ట్రంలో పండిన ప్రతి పంటను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మద్దతు ధరకన్నా ఒక్క రూపాయి తగ్గినా ఈ సమాజం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుల వ్యతిరేక చట్టాలను విరమించుకునే వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల రైతుకు మాత్రమే నష్టం వస్తుందంటే పొరపాటని.. మొత్తం సమాజానికే నష్టమని భట్టి వివరించారు. మోదీ తెచ్చిన కొత్త చట్టాలు కార్పొరేట్ వ్యవస్థలకు మేలు చేస్తాయని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ వ్యవస్థలు గుప్పిట్లో పెట్టుకునే అవకాశాన్ని ఈ చట్టాలు కల్పిస్తాయనే ఆందోళనను భట్టి వ్యక్తం చేశారు.