‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్
రిక్షావాలా జిందాబాద్
మూడు చక్రములు గిరగిర తిరిగితే
మోటరుకారు బలాదూరు’
***
‘ నా రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు’
***
‘రిక్షా బండినే మీనా కడతా.. చెల్లెమ్మా..
మీ అత్తారింటికి సాగనంపుతా చెల్లెమ్మా…’
రిక్షా బండిపైనా చక్కటి పాటలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ పాటలు వింటుంటే మది పులకిస్తుంది. పాటల పూదోటలో రిక్షా పదిలంగా ఉందంటే అప్పట్లో రిక్షా బండి జనజీవితంలో ఎంతగా ముడిపడి ఉందో అర్థమవుతుంది.
ఇప్పుడంటే రోడ్డుపై అడుగు పెట్టగానే అడుగడుగుకూ ఆటోలు.. మరి గతంలో ఏముండేవి అని పిల్లలు … తాతయ్య, తాతమ్మలను అడిగితే చెప్పే మాట రిక్షా.. ‘ అరే.. మీ అమ్మానాన్నలు పిల్లలుగా ఉన్నప్పుడు రైలెక్కి ఊరెళితే.. స్టేషన్ కాడ రెడీగా ఉండేవిరా రిక్షాలు.. అవెక్కి ఎంచక్కా సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేవారు. అలాంటి రిక్షా కాలక్రమంలో కనుమరుగు అవుతోంది. అయినా రిక్షాకు చరిత్ర ఉంది.. ఆ చరిత్రలో మంగళగిరికి ప్రత్యేకస్థానం ఉంది. శ్రమజీవుల బతుకుబండి మంగళగిరిలోనే తయారయ్యేది. అలా మంగళగిరి రిక్షా.. మహా ఫేమస్ అండీ..
మంగళగిరి చేతివృత్తులకు పెట్టింది పేరు. మంగళగిరి అంటేనే చేనేత.. చేనేత అంటేనే మంగళగిరి.. అంతగా విడదీయరానిబంధం. ఆ తర్వాత చెప్పకోదగ్గ వృత్తి.. గూడు రిక్షా తయారీ. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నుంచే మంగళగిరి ప్రాంతంలో గూడు రిక్షా తయారీ ఖార్ఖానాలు పెద్దసంఖ్యలో ఉండేవి. ఇక్కడ తయారైన గూడు రిక్షాలను చుట్టుప్రక్కల ప్రాంతాలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పంపించేవారు.
తొలినాళ్లలో కడియం పిచ్చయ్య, షేక్ మౌలాలీ, దాసరి నారాయణరావు, కడియం సైదులు రిక్షా ఖార్ఖానాలకు ప్రసిద్ధి. ఆటోల ఉధృతి రాక మునుపు అంటే 2000 సంవత్సరం వరకు గూడు రిక్షాల తయారీ ఖార్ఖానాల్లో కార్మికులకు చేతినిండా పనివుండేది. కమ్మరి, కార్పెంటర్, పెయింటర్, ఆర్టిస్టులు ఇలా పలురకాల చేతివృత్తిదారులందరూ కలిస్తేనే చక్కటి గూడు రిక్షా రూపుదిద్దుకునేది. దాదాపు 200 మందికిపైగా గూడు రిక్షాల తయారీ ద్వారా జీవనోపాధి పొందేవారు.
రాష్ట్రంలోని చీరాల, చిలకలూరిపేట, కంకిపాడుల్లో గూడు రిక్షాల తయారీ ఉన్నా… ఇనుప ఫ్రేముకు మాత్రం మంగళగిరి ప్రసిద్ధి. ఇక రిక్షా కవరుపై దేవుళ్ల బొమ్మలు, వెండితెర అభిమాన తారలను అందంగా తీర్చిదిద్దేవారు. అప్పట్లో ఆర్టిస్టులు రాము, సుబ్బారావు, సాంబయ్య ఇటువంటి బొమ్మలు వేయడంలో దిట్టలు.
ఇక ఆర్టిస్టు రాము బొమ్మ వేసాడంటే అచ్చుగుద్దినట్టు ఉండేది అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. ప్రధానంగా సినీతారల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ బొమ్మలను రిక్షా కవర్ పై చూస్తే అచ్చుగుద్దినట్లు ఉండేవి. మహిళాతారలు రిక్షాకవర్ పై మెరిసేవారు. సావిత్రి, జమున, వాణిశ్రీ తర్వాతి కాలంలో శ్రీదేవి, జయప్రద, జయసుధ తదితర తారామణులు తళుక్కుమనేవారు. అలా రోడ్డుపై రిక్షా వెళుతుంటే అభిమాన తారల బొమ్మలను ఆగిమరీ చూసి సంబరపడిపోయేవారు అభిమానులు. ఆ బొమ్మలు అంతగా ఆకర్షణీయంగా… కట్టిపడేసేలా ఉండేవి.
అన్ని రకాల కార్మికులకు అప్పట్లో చేతినిండా పనివుండేది. పాతబస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు పలు వీధుల్లో రిక్షా ఖార్ఖానాలు సందడి సందడిగా ఉండేవి.
కాలక్రమంలో రిక్షాల స్థానాన్ని ఆటోలు ఆక్రమించేశాయి. దీంతో మంగళగిరిలో ఓ వెలుగు వెలిగిన రిక్షా ఖార్ఖాన పరిశ్రమ క్రమేణా కాంతిని కోల్పోయింది. ప్రస్తుతం డీఎంకే, శంకర్, నాగుల్, పుల్లారావు, వేణు రిక్షా ఖార్ఖానాలు ఉన్నా కార్మికులకు పెద్దగా పని ఉండడం లేదు. గూడు రిక్షాల తయారీ పూర్తిగా తగ్గిపోయినా.. నూడిల్స్ బండ్లు, మున్సిపల్, పంచాయతీలు పారిశుధ్యానికి ఉపయోగించే రిక్షాలు, బల్ల బండ్లు మాత్రమే తయారవుతున్నాయి. నెలకు 20 నుంచి 25 బండ్ల వరకు ఆర్డర్లు రావడమే గగనమైంది.
– ఎ.శ్రీనివాస్, మంగళగిరి