కృష్ణా నది యాజమాన్య మండలిని విశాఖపట్నం లో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.
కృష్ణానది మీద నిర్మించిన శ్రీశైలం ప్రాజక్టు ఉన్న కర్నూలు జిల్లాలో కాకుండా ఎక్కడో వైజాగ్ లో ఈ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలనుకోవడం సరైన దోరణి కాదని ఆయన అన్నారు.
‘విద్యుత్తు ఉత్పాదన పర్యవేక్షణకు, కృష్ణా నది నీటి పంపకానికి, కృష్ణా నదీ జలాలను సమగ్ర వినియోగానికి కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు జిల్లాలో “కృష్ణా నది యాజమాన్య బోర్డు” ఏర్పాటు అత్యంత సమంజసం’ అని ఆయన అన్నారు.
కృష్ణా నది యాజమాన్య నిర్వహణకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలును కాదని, విశాఖపట్నంలో కృష్ణా నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, ఆందోళనకు సిద్ధమవుతున్నదని ఆయన అన్నారు.
కృష్ణా జలాల యాజమాన్య మండలి కార్యాలయం ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు కర్నూలు లో ఏర్పాటుచేసేలా చూసే బాధ్యత ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరి మీద ఉందని, వారు ఈ విషయం విస్మరించరాదని ఆయన అన్నారు.
విశాఖపట్నంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటును వ్యతిరేకించాలని,రాయలసీమ ప్రజల డిమాండ్ మేరకు రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా మౌనం వీడి, కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటుకు గళం విప్పి, కర్నూలులో బోర్డు ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాలని బొజ్జా దశరథరామిరెడ్డి రాయలసీమ ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో కృష్ణా నది తాగునీటి, సాగు నీటి పై ఆధారపడిన తెలంగాణా, రాయలసీమ, నెల్లూరు, కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు కృష్ణా నది నీటి పంపిణికి అత్యంత కీలకం శ్రీశైలం రిజర్వాయర్ అని, శ్రీశైలం రిజర్వాయర్ కుడి, ఎడమ విధ్యుత్తు కేంద్రాల ద్వార విధ్యుత్తు ఉత్పాదన కూడా రెండు తెలుగు రాష్ట్రాలు చేస్తున్నాయనీ రెండు తెలుగు రాష్ట్రాలలోని కరువు పీడిత ప్రాంతాలకు న్యాయం జరగాలంటే, వరద జలాలు వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవడానికి శ్రీశైలం రిజర్వాయర్ కీలకం అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.
శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చట్టం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా న్యాయ రాజధానిలో భాగంగా కూడా కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా నదీ నీటి పంపిణీ విధ్యుత్తులో ఉత్పన్నమయ్యే వివాదాలను ఎప్పటికప్పుడు త్వరితంగా పరిశీలించి, అవసరాలను బట్టి ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించి, సమన్వయంతో గురుతర భాద్యతలను నిర్వహించాల్సిన సంస్థ కృష్ణా నది యాజమాన్య బోర్డు అన్న విషయం విదితమే అనీ, ఇది న్యాయ సంబంధిత సంస్థ అని ఆయన అన్నారు.
ఈ అంశాలపై ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు సవివరమైన వివరాలతో ఉత్తరాలను రాసి, కర్నూలు లో కృష్ణా నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని కోరడమైనదని ఆయన తెలిపారు. అదేవిధంగా కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజా ప్రతినిధులకు రాయలసీమ ప్రజా సంఘాలు రాయలసీమ సత్యాగ్రహం సందర్భంగా కూడా కోరడమైనదని దశరథరామిరెడ్డి తెలిపారు. కానీ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాయలసీమ వాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన అన్నారు.