గుడివాడ పేకాట శిబిరం మీద స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంటు బ్యూరో( ఎస్ఈబీ) టీమ్ దాడి చేసి 33 మందిని అరెస్టు చేసిన సంఘటన మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు.
పోలీసుల దాడిలో అరెస్టయిన వారిలో తన సహచరులెవరూ లేరని, అదే విధంగా తాను పరిగెత్తుకుంటా ముఖ్యమంత్రి జగన్ దగ్గరికి వెళ్లడం లేదని ఆయన వివరణ ఇచ్చారు.
ఈ పేకాట వ్యవహారంలో కొడాలి నాని ప్రధాన అనుచరులు ఉన్నారని సీఎం గారు మిమ్మల్ని క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించారని అంటున్నారని విలేకరులుప్రశ్నించినపుడు ఇలా స్పందించారు.
‘‘ముఖ్యమంత్రి గారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నానని పిచ్చిపిచ్చిగా ప్రేలాపనలు చేస్తున్నారు. సీఎం గారికి నాకు ఉన్న సంబంధాలు వేరు. ప్రజలకు అవసరమైనప్పుడు సీఎం గారి వద్దకు వస్తాం. ఇంతవరకు నేను నా పర్సనల్ పని ఏదీకూడా సీఎం గారిని అడగలేదు. భవిష్యత్‌లోనూ అడగను. నాలుగు సార్లు గుడివాడ శాసనసభ్యునిగా గెలిపించిన ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా వస్తాను. ఈరోజు కూడా గుడివాడ నుంచి కంకిపాడు వెళ్లే రోడ్డు వయా మాడికొండ మీదగా వెళ్లే రోడ్డును ఎన్డీబీ సెకండ్ ఫేజ్‌లో పెట్టమని సీఎం గారిని కోరానని ఆయన అంగీకరించారని కొడాలి నాని అన్నారు.
– డబ్బులు సంపాదించాలంటే అనేక మార్గాలు ఉన్నాయ్. చంద్రబాబు, ఉమాలాగా వ్యభిచార గృహాలు, పేకాట క్లబ్‌లు నిర్వహించాల్సిన గతి మాకు పట్టలేదు,’ అని నాని మండిపడ్డారు,
ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్ లో ఆదేశించిన తర్వాతే దాడులు జరుగుతున్నాయని, పూర్తి స్వేచ్ఛ ఇచ్చి జూదాలు నిర్వహించే వారిని పట్టుకోమని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన చెప్పారు. ఎస్ఈబీకి దీనిపై సమాచారం ఉండబట్టే వారు వెళ్లి పట్టుకోవటం జరిగిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.
పోలీసులు పట్టుకున్న వారిలో తన అనుచరులున్నారన్నఆరోపణను ఆయన ఖండించారు.
‘పోలీసులు ఎవర్ని పట్టుకున్నారు, ఏ పార్టీ వారిని పట్టుకున్నారు, పేకాట ఆడుకునేవారికి పార్టీ ఏమిటి.. ? లేకపోతే ఒకే కులం వారు ఆడుకుంటున్నారా? ఏ కులం అయినా, ఏ పార్టీ వారు అయినా.. ఎవరుంటే వారిని అరెస్ట్ చేసి డబ్బును, వెహికల్స్‌ను సీజ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతోంది. మా ప్రభుత్వంలోని పోలీసు యంత్రాంగమే రైడ్ చేశారు. గుడివాడలో క్లబ్బులు మూసేయించింది నేనే,’ నాని అన్నారు.
కొడాలి నాని ఇంకా ఏమన్నారంటే..
ఒకేచోట పార్కింగ్‌లో కార్లు పెట్టి.. అందరూ కార్లలో పేకాట ఆడుతున్నారు. 28 కార్లు, 13 బైక్‌లు దొరికాయని మొత్తం మీద 40 లక్షలు నగదు లభించిందని రెండు సెట్లు పేకాట సెట్లు లభించాయని చెబుతున్నారన్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. పేకాట వేరేచోట జరుగుతోంది. ఇది పార్కింగ్ ప్లేస్ అని, కొంతమంది వ్యక్తులు మిస్ అయ్యారని చెబుతున్నారు. దీనిమీద కూడా విచారణ జరుపుతాం. ఇందులో చంద్రబాబు దేవినేని ఉమాల పాత్రే కాదు, ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
దమ్ము, ధైర్యంతో పోలీసుల్ని పంపి పేకాట స్థావరాలపై దాడులు మా ప్రభుత్వం చేస్తే.. నేను పేకాట ఆడిస్తున్నానని దేవినేని ఉమా.. చంద్రబాబు లాంటి చవట దద్దమ్మలు విమర్శలు చేయటం ఏంటని కొడాలి నాని మండిపడ్డారు. ఇక్కడ వైయస్ఆర్సీపీ జెండా, వాటర్ బాటిల్ ఉందని పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీస్తా.