రామతీర్థం అనే ఊరు ఎక్కడుందో ఒక వారం కిందటి దాకా ఎవరికీ తెలియదు. తెలుగు నాట రామాలయాలు లేని ఊరుండదు కదా. రామతీర్థంలో ఒక గుడి ఉందని,అందులో కోదండ రాముడు కొలువై ఉన్నాడని కూడా చాలా మందికి తెలియదు. ఇది ప్యూర్ హైపర్ లోకల్ గుడి. ఇలాంటి రామతీర్థం ఇపుడు ప్రధాన వార్త అయింది.
రామతీర్థం పేరుతో ఆంధ్ర ప్రదేశ్ టెంపుల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రామతీర్థం ఎక్కడుందో తెలుసా?
విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండంలో ఒక చిన్న గ్రామం రామతీర్థం. ఈ వూరి పిన్ కోడ్ 535218. విజయనగరం పట్టణానికి 12 కిమీ దూరాన ఉంటుంది. జనాభా 1500 లోపే. ఇక్కడొక రామాలయం ఉంది. ఇదే మంత పెద్ద ఆలయం కాదు, ప్రముఖ ఆలయమూ కాదు. సాదా సీదా కోదండరాముడి గుడి. ఇది చాలా పురాతనమయిందని, వేయ్యేళ్ల నాటిదని కొందరు కథలు చెబుతారు. దీనికే చారిత్రకాధారాలులేవు.అయితే, ఈ ప్రాంతం ప్రాచీన జైన భౌద్ద చారిత్రక అవశేషాలకు బాగా ప్రసిద్ధి. బుద్ధిస్టు కారిడాార్ లోకి వస్తుంది.
ఇక్కడ ఆలయంలో శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి పండుగలు బాగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున గిరిప్రదక్షిణ ఉంటుంది. ఇది 400 సంవత్సరాల కిందటి ఆలయమని మీడియా రాస్తున్నది.
రామాలయం ఇపుడు రాజకీయ కేంద్రం అవుతున్నది.
డిసెంబరు 29న ఇక్కడి ఆలయంలోని కోదండ రాముడి విగ్రహంపై దాడి జరింది. ఎవరో దుండగులు గుడితలుపులు పగులకొట్టి లోనికి ప్రవేశించి కోదండ రాముడి విగ్రహం తలనరుక్కుని తీసుకు వెళ్లారు.
తర్వాత డిసెంబర్ 30వ తేదీన ఆలయం ఉన్న కొండ సమీపంలోని కొలనులో రాముడి శిరస్సు దొరికింది.
శ్రీ రాముడి విగ్రహం శిరచ్ఛేదం రాష్ట్రంలో బాగా చర్చనీయాంశమయింది. దానికి తోడు ఈ మధ్య రాష్ట్రంలో అనేక చోట్ల విగ్రహ ధ్వంసాలు, ఆలయ రథాలకు నిప్పుపెట్టడం, విగ్రహాలకు చెప్పుల దండలు వేయడం వంటి సంఘటనలు ఎక్కువయ్యాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఆలయాలమీద ఉన్నట్లు దాడులు ఎక్కువయినట్లు కనిపిస్తుంది.
“హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి తన ఆత్మగా అభివర్ణించిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారు. ఈ దాడలను చూస్తే ఆంధ్రప్రదేశ్ హిందువుల మనోభావాలను గాయపరిచే ఘటనలు జరగడంలో ఎదైనా రాజకీయ కుట్ర దాగి ఉన్నదా! అన్న అనుమానాలు రావడం సహజమే కదా!,’ అని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత టి లక్ష్మినారాయణ ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్ ’ తో అన్నారు.
“ఒక వైపు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల నిజజీవితాలను ప్రభావితం చేసే అంశాలపైన ఆలోచనలు, సాగుతున్న ఉద్యమాల నుండి ప్రజల దృష్టిని హైజాక్ చేసి, రాజకీయ లబ్ధిపొందుదామన్న కుటిల నీతిని ఈ రూపంలో అమలు చేస్తున్నారేమో!,” అని లక్ష్మినారాయణ అనుమానం వ్యక్తం చేశారు.
దీనితో ప్రతిపక్షాలు ఆందోళనవ్యక్తం చేశారు. బిజెపి ఈ సమస్యను రాజకీయంగా వాడుకొనకముందే ఈ సమ్యస్య మీద ఉద్యమం లేవదీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఈ రోజు రామతీర్థం చేరుకున్నారు.
చంద్రబాబు మీద ఒక నిమిషం విరామం లేకుండా ట్విట్టర్ దాడిచేస్తున్న వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి కూడా రామతీర్థం వచ్చారు.