ఉన్నట్లుండి తమిళ స్టార్ రజినీ కాంత్ అసలు రాజకీయాల్లోకి రావడంలేదని ప్రకటించడం వెనక కారణం ఏమయి ఉంటుంది?
ఎందుకంటే, ఆనారోగ్యం ఆయనకు కొత్త కాదు. ఎపుడూ ఉన్నదే. ఆరోగ్యం బాగా లేనపుడు, రీనల్ ట్రాన్స్ ప్లాంట్ జరిగినపుడు ఆయన రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేసుకున్నాడు తప్ప విరమించుకోలేదు.
ఇపుడు ఎందుకిలా ఆయన ఏకంగా రాజకీయల్లోకి రావడంలేదు అని ప్రకటించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు సారీ చెప్పాడు. దీనికి వెనక ఉన్న శక్తి అనారోగ్యమా లేక బిజెపి రాజకీయమా?
తమిళనాడులో ఈ చర్చ జోరుగా సాగుతూ ఉంది. అయితే, అనారోగ్యం వల్లే రాజకీయాల్లోకి రాకుండా విరమించుకున్నాడనే వాదనను ఎవరూ అంగీకరించడం లేదు. దీని వెనక బిజెపి సెకండ్ ఇన్ కమాండ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహం ఉందని చెబుతున్నారు.
బిజెపి వ్యూహం ఇది…
భారతీయ జనతా పార్టీ తమిళనాడులో జీరో. ఇపుడు అధికారంలో ఉన్న ఎఐడిఎంకెతో పొత్తు పెట్టుకుని కాలుమోపాలని చూస్తూ ఉంది. అయితే, ఆ రాష్ట్రంలో పొత్తుల్లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి ఎదగాలనేది బిజెపి లక్ష్యం. ఎదిగితీరతామని బిజెపి బలంగా నమ్ముతూ ఉంది.
అయితే, ఆ రాష్ట్రంలో బలమయిన ప్రాంతీయ పార్టీలు బలహీన పడితేనే బిజెపికి చోటు లభిస్తుంది. అందువల్ల ఎఐడిఎంకె లేదా డిఎంకె బలహీనపడాలి. అంత దాకా వేచి చూడాలి, ఓపికలో బిజెపిని మించిన పార్టీ ఇండియాలోలేదు.
అయితే, ఇలాంటపుడు రజినీకాంత్ వంటి వ్యక్తి మరొక ప్రాంతీయపార్టీ పెడితే, బిజెపి సొంతంగా బలపడే రోజులు ఇంకా దూరమవుతాయి. ఆ రాష్ట్రంలో ఎపుడూ మైనర్ పార్టీగానే బతకాల్సి వస్తుంది. ఇది బిజెపికి ఇష్టం లేదు.
అందువల్ల రజినీ కాంత్ చేత పార్టీ పెట్టడం మానిపించి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మద్దుతు నిచ్చేలా చేసుకోవడం బెస్టు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ల రజనీకాంత్ పిలుపునిస్తే,ఎఐడిఎంకె, డిఎంకె వ్యతిరేకుల, రజినీ అభిమానులు బిజెపికి వోటు వేస్తే బిజెపికి గౌరవప్రదమయిన సీట్లు వచ్చే అవకాశం ఉంది. అది భవిష్యత్తులో బిజెపి ద్రవిడరాష్ట్రంలో జండా ఎగరేసేందుకు దోహదపడుతుంది. రజినీ కాంత్ పార్టీ పెడితే అపుడు ఆ పార్టీ భుజాలెక్కి తమిళనాడులో తిరగాల్సి వస్తుంది. మరి బిజెపికి సొంతంగా ఒకటోరెండో సీట్లొచ్చేదెపుడు? అందువల్ల మిత్రుడయిన రజినీకాంత్ ను బిజెపి సులభంగా తన వ్యూహానికి తగ్గట్టుగా నిర్ణయం మార్చుకోవాలని ఒప్పించినట్లు చాలా మందిచెబుతున్నారు.
రజినీ కాంత్ నిర్ణయంతో అంతాహ్యాపీ…
దీనితో బిజెపి హ్యాపీ, ఎందుకంటే, సొంతంగా మరొకసారి తమిళనాడులో ఎదిగెేందుకు ప్రయత్నించవచ్చు. ఎఐడిఎంకె, డిఎంకె హ్యాపీ, ఎందుకంటే రజినీ కాంత్ వచ్చి ఓట్లు చీల్చి స్టేటస్ కో ని చెడగొడతాడు, రెండు పార్టీలు బలహీనపడతాయి. ఇది గుంటనక్కలా కాచుకున్న బిజెపికి లాభిస్తుంది. రజినీ కాంత్ హ్యాపీ, రాజకీయాల్లో ఎంజిఆర్ కరుణానిధి తర్వాత సినిమా వాళ్లెవరూ సక్సెస్ కాలేదు.తనవుతాడో లేదో. ఈ వృద్ధాప్యలో ఓడిపోయిన మానసిక క్ష్యోభ కొనితెచ్చుకోవడం దేనికి?