నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (RARS) భూములను వైద్యకళాశాలకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపు
రైతు సంక్షేమానికి, దేశ ఆహార భద్రతకు దోహదపడుతున్న నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్యకళాశాలకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
నంద్యాలలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ 1000 కోట్ల మూలధనంతో విరాజిల్లుతూ రైతుల అభివృద్ధికి, వేలాదిమంది ఉద్యోగుల,వ్యవసాయ కార్మికులకు ప్రత్యక్షంగాను,పరోక్షంగాను దోహదపడుతున్న నంద్యాల RARS ను నిర్వీర్యం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన అన్నారు.
వైద్య కళాశాలకు RARS భూములను కేటాయించకూడదని, జీ.వో.నెంబరు 341 ని తక్షణమే రద్దు చేసి RARS ను రక్షించాలని తాము ముఖ్యమంత్రి గారికి మరియు స్థానిక ప్రజా ప్రతినిధులకు వివరించినప్పటికీ ప్రభుత్వం మొండిగా RARS భూములనే వైద్య కళాశాలకు కేటాయిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
115 ఏళ్ళ క్రిందట బ్రిటిష్ హయాంలో వెలిసిన ఆధునిక దేవాలయం మన RARS అనీ దీనిని కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని రాయలసీమ ప్రజలకు దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యున్నత పరిశోధన స్థానాలలో మన నంద్యాల RARS అగ్రగామిగా వుండి, నంద్యాల ప్రాంతంలో విత్తన పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, రాయలసీమ ప్రాంత రైతుల ఆర్థిక అభివృద్ధికి, దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్న మన RARS ను కాపాడుకోవాల్సిన బాద్యత మనందరిమీద వుందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు,కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR నిధులతో 6 పంటలను పరిశోధనలు మన RARS విజయవంతంగా నిర్వహిస్తోందని ,అంతేకాక పత్తిలో నరశింహ,వరిలో నంద్యాల సోనా మరియు వివిధ పంట రకాల అభివృధ్దిలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన నంద్యాల RARS ను నిర్వీర్యం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మార్చి 1 న నంద్యాలలో జరిగే కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని దశరథరామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
*RARS ను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా
రేపు అనగా 28-12-2020 న వెలుగోడు మండల సమావేశం వెలుగోడులోని సాయిబాబా దేవాలయంలోను,
నంద్యాల మండల స్థాయి సమావేశం 29-12-2020 మంగళవారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు,
గోస్పాడు మండల స్థాయి సమావేశం గోసుపాడు సాయిబాబా ఆలయం నందు మండల స్థాయి ఉద్యమ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన RARS ను కాపాడుకుందామని దశరథరామిరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు కరపత్రాలను విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో Y.N.రెడ్డి, వెంకటేశ్వర నాయుడు, సౌదాగర్ ఖాసీంమియా,ఏర్వ రామచంద్రారెడ్డి, పట్నం రాముడు, మహేశ్వరరెడ్డి, వెంకటసుబ్బయ్య,భాస్కర్ రెడ్డి, రాఘవేంద్ర గౌడ్ పాల్గొన్నారు.