(అహ్మద్ షరీఫ్)
‘శ్రీమతే రామనుజాయనమః’ అనే మాట విన్నారా? ఇది 1961 నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిన మాట. దీన్నిపాపులర్ చేసింది రేలంగి. చిత్రం వెలుగు నీడలు. వెలుగు నీడలు చిత్రం వినగానే వొళ్లు పులకరిస్తుంది. నటీనటుల కాంబినేషన్ సాంకేతిక వర్గం కాంబినేషన్ అలాంటి. మళ్లీ తీయలేనటువంటి మహాకళా ఖండం. దాని గురించి సినిమా విశ్లేషకుడు అహ్మద్ షరీఫ్ అసక్తికరమయిన విశేషాలు చెబుతున్నారు…
ప్రేక్షకులు సినిమా చూస్తున్నపుడు, దర్శకుడు వారికి కనిపించకూడదు కానీ ఆ సినిమా ఆసాంతం దర్శకుడి ఉనికి ఉండాలి ” అనేది ప్రఖ్యాత దర్శకుడు రిషికేశ్ ముఖర్జీ సూక్తి.
ఈ సూక్తి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కి బాగా నప్పుతుంది. ఎక్కువగా మెలో డ్రామా లేకుండా మనుషుల మధ్య వున్న సున్నిత బాంధవ్యాలను చిత్రీకరించడం లో ఆదుర్తి సుబ్బారావు నైపుణ్యం కొనియాడతగింది.
వెలుగు నీడలు (1961) చిత్రం లో ఎక్కువ మెలోడ్రామా లేకుండా చిత్రీకరించిన రెండు సన్నివేశాల్లో ఈ నైపుణ్యం కనబడుతుంది. మొదట తన ప్రియురాలిని (సావిత్రి) జగ్గయ్య తో వివాహానికి ఒప్పిస్తాడు అక్కినేని నాగేశ్వర రావు. కొంతకాలం తరువాత సావిత్రి , అక్కినేని నాగేశ్వర రావును గిరిజ తో వివాహానికి ఒప్పిస్తుంది.
తోడికోడళ్లు, మాంగల్య బలం సినిమాల విజయం తరువాత అన్నపూర్ణా పిక్చర్స్ ద్వారా దుక్కిపాటి మధుసూధనరావు నిర్మాణంలో, ఆదుర్తి సుబ్బారావు రచన, దర్శకత్వం వహించిన “వెలుగు నీడలు” సినిమా 1961 జనవరి లో విడుదలయింది. ఈ సినిమా కు సంబంధించి కొన్ని ఆసక్తి కరమైన విశేషాలున్నాయి
ఓ కథనం ప్రకారం ఈ చిత్ర కథ కు ప్రేరణ డి మధుసుధన రావు తన నిజ జీవితం లో చూసిన ఓ కుటుంబ వ్యవహారమట .
పిల్లలు లేని ఓ జంట ఓ అమ్మాయిని దత్తత తీసుకుంది. కాలక్రమేణా వారికి సంతానం కలిగినప్పుడు ఆ తల్లి దత్తత తీసుకున్న అమ్మాయి పట్ల ప్రేమ రాహిత్యంగానూ దురుసు గానూ వ్యవహరించడం మొదలు పెట్టింది.
ఈ వ్యవహారానికి, ఓ ప్రింటింగ్ ప్రెస్ కార్యకలాపాలూ, దరిమిలా వచ్చే గొడవలూ, ఎం బి బి ఎస్ కాలేజి చదువులూ ప్రేమ జంటలూ గట్రా, జోడించి డి మధుసుధన రావు, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, అప్పట్లో ఈ చిత్రానికి అసోషియేట్ దర్శకుడు కె. విశ్వనాధ్ కలిసి వెలుగు నీడలు చిత్ర కథను రూపొందించారట. ఈ సినిమాలో సంతానం లేని జంటగా ఎస్ వి రంగా రావు, సూర్యకాంతం అభినయించగా, దత్తత తీసుకున్న అమ్మాయి గా సావిత్రీ, వారికి కలిగిన సంతానంగా గిరిజా పాత్రలు పోషించారు.
కథా కేంద్రం చుట్టూ అక్కినేనీ, సావిత్రి, గిరిజా, జగ్గయ్య ఉంటారు. మొదట్లో సావిత్రి నాగేశ్వర రావును పెళ్ళి చేసుకోవా లనుకుంటుంది. విపరీతంగా సిగరెట్లు కాల్చే నాగేశ్వర రావు కి క్షయ రోగం వున్నట్లు తెలుస్తుంది. దరిమిలా జగ్గయ్య (లండను నుంచి వచ్చిన డాక్టర్)ను పెళ్లాడ వలసిందిగా నాగేశ్వర రావు సావిత్రిని ఒప్పిస్తాడు.
తాను మదనపల్లె శానిటొరియంలో చికిత్స నిమిత్తం చేరతాడు. అదృష్టవశాత్తు చికిత్స పని చేసి అతను క్షయ బారినుండి తప్పించు కుంటాడు.
అతణ్ణి ఇంటికి తెచ్చే పనిలో జగ్గయ్య ఆక్సిడెంటు కు గురై చనిపోతాడు. ఇంటికి తిరిగి వచ్చిన నాగేశ్వర రావు ను గిరిజ తో పెళ్లికి ఒప్పిస్తుంది సావిత్రి. ఆ తరువాత మొదట్లో అభిమానాలూ, ఆ తరువాత అనుమానాలతో కథ సాగుతుంది.
ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వర రావు సంగీత దర్శకత్వం వహించాడు. సంగీత పరంగా ఈ చిత్రం గొప్ప విజయం సాధించింది. పెండ్యాల సంగీతం, శ్రీశ్రీ, కొసరాజుల పాటలు, ఆత్రేయ స్క్రిప్ట్ సినిమా విజయవంతానికి బాగాదోహదపడ్దాయి. ఇది అగ్నిపరీక్ష అనే బెంగాలీ నవల ఆదారంగా తీసిన చిత్రం.
మరొక ఆసక్తికరమయిన విశేషమేంటే, ఈ చిత్రానికి డైలాగులురాసింది ఆత్రేయ. డైలాగులు రాసేందుకు ఆయన ఒక నెల పాటు కేరళలోని పీచ్చి ప్రాజక్టుకు దగ్గిర ప్రశాంత వాతావరణంలో గడిపారు. ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి రావు తోడు.
ఆత్రేయ మనకు మాటల రచయితగా కంటే కూడా పాటల రచయిత గా, మనసుకవిగా ఎక్కువ పరిచయం వున్నా ఈ చిత్రం లో ఒక్క పాట కూడా రాయక పోవడం ఆసక్తి కరం.
“కల కానిదీ విలువైనదీ బ్రతుకూ కన్నీటి ధారలలోనే బలి చేయకు”